నగరంలో పచ్చదనం పెంచాం..

సిగ్నల్‌ ఫ్రీగా మార్చేందుకు చర్యలు
వర్షాకాలం ఇబ్బందులు లేకుండా ఎస్‌ఎన్‌డిపి కార్యక్రమాలు
జిహెచ్‌ఎంసి సాధారణ సమావేశంలో మేయర్‌ విజయలక్ష్మి
సమావేశం నేటికి వాయిదా
సభ్యులు లేవనెత్తిన సమస్యలు పిన్‌ పాయింట్‌ ప్రొగ్రామ్‌ పెట్టి పరిష్కారిస్తామని కమిషనర్‌ వివరణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 : హరితహారంతో నగరంలో పచ్చదనం పెంచామని, సిగ్నల్‌ ఫ్రీ నగరంగా మార్చడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిహెచ్‌ఎంసి మేయర్‌ విజయలక్ష్మి వెల్లడిరచారు. వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎస్‌ఎన్‌డిపి కార్యక్రమాలు చేపట్టామన్నారు.  గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం నగర అభివృద్ధికి సహకారం అందించాలని మేయర్‌ కోరింది. ఈ సందర్భంగా మేయర్‌ నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అధ్యక్షతన సోమవారం గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కో-ఆప్షన్‌ మెంబర్లు, కార్పొరేటర్లు, జిహెచ్‌ఎంసి అధికారులు హాజరయ్యారు. అయితే ముఖ్యమంత్రి వద్ద అత్యవసర సమావేశం ఉన్నందున అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరు కావలసి ఉన్నందున భోజన విరామం అనంతరం మధ్యాహ్నం నుండి జరగాల్సిన సమావేశాన్ని నేటికి వాయిదా వేస్తున్నట్లు మేయర్‌ ప్రకటించారు. ఫిబ్రవరి 20న ఉదయం 10:30 నుండి సమావేశం పూర్తిస్థాయిలో కొనసాగుతుందని తెలిపారు. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి మాట్లాడుతూ…హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఎన్నో అవార్డులు, ర్యాంకులు అందుకుందని తెలిపారు. క్లీన్‌ సిటీగా తొమ్మిదవ స్థానంలో హైదరాబాద్‌ నిలిచిందని పేర్కొన్నారు. ఎస్‌టిపిలు అన్ని పూర్తయితే దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తుందన్నారు. అనంతరం జరిగిన కొశ్చన్‌ అవర్‌లో జిహెచ్‌ఎంసిలో ఎంత మంది ఔట్‌ సోర్సింగ్‌, డిప్యూటేషన్‌పై వొచ్చిన ఉద్యోగుల వివరాలు తెలపాలని మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రావణ్‌ కోరగా అడ్మిన్‌ అడిషనల్‌ కమిషనర్‌ సరోజ సమాధానం చెప్పగా చివరగా కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ సమాధానం ఇచ్చారు.

నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఉద్యోగులను తొలగించడం జరుగుతున్నదన్నారు. నగరంలోని పలు ఏరియాలలో వీధి దీపాలు వెలగడం లేదని, కొన్నిచోట్ల 24 గంటలు వెలుగుతున్నాయని, లైట్స్‌ పెట్టిన వెంటనే పోతున్నాయని సభ్యులు సభ దృష్టికి తీసుకురాగా ఆయా ప్రాంతంలో సమస్యల పరిష్కారానికి సంబంధిత కార్పొరేటర్‌తో కలిసి పిన్‌ పాయింట్‌ ప్రోగ్రామ్‌ పెట్టి పరిష్కరిస్తామని కమిషనర్‌ తెలిపారు. అన్ని డివిజన్లలో రంజాన్‌, మహాశివరాత్రి పండుగ సందర్భంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా కొత్త వీధి లైట్ల ఫిట్టింగ్‌ ఏర్పాటు చేస్తామని కమిషనర్‌ తెలిపారు. అదే విధంగా అడ్వర్టైజ్‌మెంట్‌ పాలసీ హోర్డింగ్స్‌, ప్రకటనలతో కార్పొరేషన్‌కు రావాల్సిన ఆదాయం రావడం లేదని, పక్కదారి పడుతున్నదని, ఇల్లీగల్‌ హోర్డింగ్స్‌పై ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని పలువురు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేయర్‌ను కోరగా, అన్ని పార్టీలతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మేయర్‌ తెలిపారు. రెగ్యులర్‌ అడ్వర్టైజ్మెంట్‌ సంబంధించిన ఒక ఎంక్వయిరీ అధికారిని నియమించి విచారణ చేసిన నివేదిక ను అందజేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. జిహెచ్‌ఎంసిలో డిప్యూటేషన్‌పై పని చేస్తున్న పలువురు అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని వారిని తిరిగి పంపించాలని పలువురు కార్పొరేటర్లు కోరారు. అక్రమ మార్గంలో వెళ్లే అధికారులు ఉండరాదని, బాధ్యతగా విధులు నిర్వహించని అధికారులను సరెండర్‌ చేయాలని మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి కమిషనర్‌కు సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్‌ శ్రీలత శోభన్‌ రెడ్డి, జిహెచ్‌ఎంసి కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, ఎమ్మెల్సీ లు ఎం ఎస్‌ ప్రభాకర్‌, సురభి వాణిదేవి, బల్మురి వెంకట్‌, మహమ్మద్‌ మిరాజ్‌ బేగ్‌, చార్మినార్‌ ఎమ్మెల్యే  మీర్‌ జుల్ఫేకర్‌ అలీ,  నాంపల్లి  ఎమ్మెల్యే మహమ్మద్‌ మాజీద్‌ హుస్సేన్‌, కార్పొరేటర్లు, జోనల్‌ కమిషనర్లు, ఆయా విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *