కుల మతాలకకు అతీతంగా పిల్లల నుంచి పెద్దలు ధ్యానం నేర్చుకోవాలి
పత్రీజీ చిన్న కూతురు, పిఎస్ఎస్ఎం గ్లోబల్ ఫౌండర్ పరిమళ పత్రీ
మౌన మహా విజ్ఞానం, మిలారెప జీవిత చరిత్ర, క్యాలెండర్ ఆవిష్కరణ
ఆమనగల్లు, ప్రజాతంత్ర, డిసెంబర్ 22 : ధ్యాన జగత్ నిర్మాణమే లక్ష్యంగా పిరమిడ్ సొసైటీ మూవ్మెంట్ పనిచేస్తుందని ప్రపంచవ్యాప్త పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ చిన్న కూతురు, పిఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిమళ పత్రీ అన్నారు. పిఎస్ఎస్ఎం అనేది కర్నూల్ లో ఒక చిన్న సొసైటీ లాగా ప్రారంభమై నేడు గ్లోబల్ పిఎస్ఎస్ఎంగా అవతరించిందని అన్నారు. ఈ మేరకు శుక్రవారం కడ్తాల్ మండలం హన్మస్ పల్లి గ్రామ సమీపంలో గల కైలాసపురి మహేశ్వరా మహా పిరమిడ్ ధ్యాన కేంద్రం వద్ద జరుగుతున్న పత్రీజీ మహా యాగం రెండవ రోజు ఉదయం 5 గంటల నుంచి 8 వరకు సంగీత వేణునాధ గానంతో ప్రాతః కాల ధ్యానం నిర్వహించారు. ఈ సందర్బంగా సైంటిస్ట్ నాగేశ్వర్ రావు రచించిన మౌన మహా విజ్ఞానం, మిలారెప జీవిత చరిత్ర అనే పుస్తకాలను పరిమళ పత్రీ, పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్ ఆధ్వర్యంలో రూపొందించిన 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను పరిణిత పత్రీ ఆవిష్కరించారు. అనంతరం పరిమళ పత్రీ మాట్లాడుతూ కుల మతాలకతీతంగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ధ్యానం నేర్చుకుని ఆచరించాలని ఆమె సూచించారు. పత్రీజీ సంకల్పాలు నెరవేర్చేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ధ్యాన అభివృద్ధి కార్యక్రమాల్లో పిరమిడ్ ధ్యానులు అందిస్తున్న సహకారం హర్షణీయం అన్నారు. ప్రతీ ఒక్కరికీ ధ్యానం నేర్పాలనేదే పత్రీజీ లక్ష్యం అని, పిరమిడ్ ఎక్కడ ఉన్నా ధ్యానానికి వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పత్రీజీ పెద్ద కుమార్తె పరిణితి పత్రి మాట్లాడుతూ ప్రపంచాన్ని ధ్యానమయం చేసే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ది హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ యాగనికి ఎన్ని వేల మంది హాజరైనా భోజన, ఆశ్రయం, ఇతర వసతులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఉదయం 10 నుంచి 5 గంటల వరకు స్పిరిచువల్ కౌన్సిలింగ్, పిరమిడ్ మేకింగ్ వర్క్ షాప్, ద్వారకా నివాస్ సభా ప్రాంగణంలో యువత కోసం అవేకెనింగ్ ఇన్నర్ పొటెన్షియల్ ఫర్ యూత్ కార్యక్రమాలు, సైంటిస్ట్ నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో 11 రోజుల మౌన ధ్యాన కార్యక్రమాలు, సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ సందేశాలు, పార్వతి పిరమిడ్ లో హిందీ, ఇంగ్లిష్, కన్నడలో ధ్యాన క్లాసులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీలు రాంబాబు, శ్రీరాంగోపాల్, సాంబశివరావు, దాట్ల హన్మంతరాజు, మేనేజంగ్ ట్రస్టి బాలకృష్ణ, పిఎంసి డైరెక్టర్ నవకాంత్, ఆనంద్, లక్ష్మి, జయశ్రీ, దామోదర్ రెడ్డి, మాధవి తదితరులు పాల్గొన్నారు.




