మన ధాన్యం కేంద్రం కొనుగోలు చేయడం లేదని తెలంగాణ ఎప్పటినుంచో గగ్గోలు పెడుతోంది. ధాన్యం కొనుగోళ్లపై నియంత్రణ ఎత్తేయాలని కోరుతోంది. అయినా కేంద్రం పట్టించుకోవడం లేదు. తాజాగా బియ్యం ఎగుమతుల పై ఆంక్షలు విధించడంతో అక్కడ బియ్యం నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.మరోవైపు ధాన్యం ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. కానీ రైతులకు గిట్టుబాటు ధరలు రావడం లేదు. కొనుగోలు దారులకు ధాన్యం సరసమైన ధరలకు దక్కడం లేదు. లోపం ఎక్కడ ఉందో అర్థం కావడం లేదు. ఈ క్రమంలో ధాన్యం ధరలను కంట్రోల్ చేసేందుకు ఎగుమతులపై ఆంక్షలు విధించారు. ఇదంతా ఓ మాయలాగా కనిపిస్తోంది. ధాన్యం పండుతున్న రాష్టాల్రు నేరుగా ఎగుమతులు చేసుకునేలా ప్రోత్సహించాలి. అలాగే గోదాముల్లో మగ్గుతూ..ముక్కిపోతున్న ధాన్యాన్ని వెలికి తీయాలి. కొత్త ధాన్యాన్ని నింపాలి. మోదీ తొలినాళ్లలో గోదాముల్లో బియ్యం ముక్కిపోతున్నాయని ఆరోపించారు. వాటిని పేదలకు అందించాలన్నారు.కనీసం ఈ ఒక్క హా అయినా మోదీ నెరవేర్చలేదు. రైతులు పండిస్తున్న ధాన్యంపై ఆంక్షలు విధించకుండా ఎగుమతులకు ప్రాధాన్యం ఇవ్వాలి.వ్యవసాయంపై జాతీయ విధానంతో ముందుకు సాగాలి. వ్యవసాయాన్ని లాభసాటి చేసేలా, దిగుబడులు తగ్గించుకుని మన రైతులను ప్రోత్సహిచేలా చూసుకోవాలి.
ప్రపంచం మొత్తానికి ఎగుమతి చేయగల సత్తా మనరైతులకు ఉంది. అలాంటి భూములు, నీటి వనరులు ఉన్నాయి. అయినా ఎందుకనో జాతీయ వ్యవసాయ విధానం అమలు కావడం లేదు. తాజా బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో అమెరికాలో బియ్యం కొరత ఏర్పడింది. మన వ్యవసాయాన్ని బలోపేతం చేసుకునే దిశగా ఆలోచనలు చేయాలి. వ్యవసాయ ఉత్పత్తులను పెంచి విదేశాలకు ఎగుమతులు చేసే విధంగా సన్నద్దం కావాలి. ఆర్థికమాంద్యం ముంచుకొస్తున్న వేళ కేంద్రం ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలి. వ్యవసాయరంగం పురోగమిస్తే, ధాన్యం దిగుబడులు తగ్గితే తప్ప భారత ఆర్థికరంగం పురోగమించదు. ఇప్పటికే వరిధాన్యం ఇబ్బడిముబ్బడిగా పండించడం వల్ల గోదాముల్లో మగ్గిపోతోంది. వాటిని వాడుకునే విధంగా కార్యక్రమాలు అమలు చేసుకోవాలి. అదేపనిగా వరి పండించకుండా ఇతర పంటలపైనా ప్రోత్సాహం కల్పించాలి. లేదా ఎగుమతుల విధానంలో అయినా మార్పులు చేసుకోవాలి. ఆధునిక వ్యవసాయం దిశగా పురోగమించాలి. నిరుద్యోగం పెరగడంతో.. ప్రజలు ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. వారిని వ్యవసాయం వైపు మళ్లించేలా పథకాలు చేపట్టాలి. తక్షణ ఉపాధికి ఇదొక్కటే ప్రత్యామ్నాయం కాగలదు. దీంతో ఆహార ఉత్పత్తులు కూడా పెరగ గలవు. కరువులు వొచ్చినా, అధికంగా వర్షాలు కురిసినా రైతుల దుర్భర పరిస్థితులలో ఎలాంటి మార్పూ కనిపించడం లేదు. మరోవైపు ప్రతి సంవత్సరం వేలాది మంది రైతులు పట్టణాలకు వలస వెళ్ళి దినసరి కూలీలుగా మారు తున్నారు. చిన్నాచితక వ్యాపారాలతో తోపుడు బళ్లు నడుపుతున్నారు. వారిని వ్యవసాయంలో స్థిరపడేలా చేయాలి.
వ్యవసాయ భూమి లేని కూలీలు కౌలుకు తీసుకొని నష్టాలపాలయి బతుకునీడ్చలేక,అవమానం భరించలేక, ఆఖరికి• ఆత్మహత్య లకు పాల్పడుతున్నారు. ప్రధానంగా అనేకరకాల పప్పు ధాన్యాలు, వంట నూనెల దిగుమతులను పూర్తిగా నిషేధించుకుని, దేశీయంగా పండించుకునేలా వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. కనీసం ఓ పదేళ్ల పాటు వ్యవసాయరంగ ఉత్పత్తులపై దృష్టి సారిస్తే భారతదేశం ఆర్థకంగా మళ్లీ పుంజుకోగలదు. ఉపాధి దొరక్క ఇప్పుడు అనేకమంది మళ్లీ వ్యవసాయం వైపు మళ్లుతున్నారు. వారి శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకునేలా చేయాలి. ఈ క్రమంలో విదేశాలకు భారీగా ఎగుమతి చేసేలా పంటలు పండించగలగాలి. దీంతో మనకు విదేశీమారకం కూడా ఆదా కాగలదు. అలా పంటలు పండించే సత్తా మన రైతాంగానికి ఉందని గుర్తుంచుకోవాలి. మన రైతులనే ప్రోత్సహించి మన పంటలనే కాపాడుకు నేలా రైతాంగ విధానాలు వొస్తే తప్ప వారు బతికి బట్ట కట్టేలా లేరు. రైతుల సమస్యలను పట్టించుకునే దిశగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకోవాలి. ఏటా ఒక విధానంగా గాకుండా, రుణ మాఫీలు అవసరం లేని విధంగా రైతులు స్వయం సమృద్దిగా ఎదిగేలా చేయాలి.
విత్తనాలు, పురుగు మందుల వ్యాపారస్థులు నకిలీలతో రైతులను నిలువునా ముంచుతున్నారు. అధికారులు చోద్యం చూస్తున్నారు. బ్యాంకు అధికారులు, ఏజెంట్లు కలిసి రైతులకిచ్చే ఋణాలలో కోత పెడుతున్నారు. అడ్తి దారులు, కషన్ ఏజెంట్లు, మార్కెట్ అధికారులు, అంతిమంగా అందరూ రైతులను ముంచడానికే సిద్ధంగా ఉంటున్నారు. రైతుల సమస్యలు రాజకీయ పక్షాలకు ప్రచార కార్యక్రమంగానే మిగిలిపోయాయి. పాలకపక్షం అయినా,ప్రతిపక్షం అయినా రైతుల సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో ఆలోచించడం లేదు. గిట్టుబాటు ధరలు లేక వచ్చిన ఆదాయం కూలీల ఖర్చుకు సరిపోతుంది. లక్షలాది మంది రైతులు వర్షాలు కురిసి కాలం కలసివచ్చినా ధరలు రాక నష్టపోతున్నారు. వర్షాలు పడని సంవత్సరంలో పంటలు ఎండిపోయి నష్టపోతున్నారు. కాలం అయినా గాని, కరువు అయినా గాని రైతుకు మిగిలేది అప్పులే. మార్కెట్‌లో రైతును దోచుకునే శక్తులు నిరాటంకంగా విజృంభిస్తూనే ఉన్నాయి. రైతులను రైతులకి మేలు చేస్తానన్న ప్రభుత్వాల ప్రకటనలు ఆచరణలోకి రావడం లేదు. అంతెందుకు రైతులకు గిట్టుబాటును మించి ధరలు దక్కేలా చేస్తామన్న ప్రధాని మోదీ వాగ్దానాన్ని నెరవేర్చడం లేదు. వ్యవసాయ ఉత్పత్తి వ్యయాలు అనేక రెట్లు పెరిగిపోవడంతో పాటు విత్తనాల దగ్గర నుంచి నకిలీలు రైతులను కుంగదీస్తున్నాయి. ఈ విధానాలకు స్వస్తి పలికి నిపుణుల సలహాతో వ్యవసాయరంగాన్ని పారిశ్రామిక రంగంగా అభివృద్ది చేయాలి.బియ్యం ఎగుమతులను కొనసాగిస్తూనే…ధాన్యం ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలి. ఎగుమతుల నిషేధం వల్ల దేశీయంగా ధరలు తగ్గుతాయని అనుకోవడం సరికాదు. రైతు సంక్షేమానికి చర్యలు తీసుకునే ప్రణాళికలు ముందుకు సాగాలి.
– ప్రజాతంత్ర డెస్క్




