(భారతరత్న ప్రకటించిన సందర్భంగా…)
పాములపర్తి వెంకట నరసింహా రావుకు ధర్మవురి క్షేత్రంతో అవినాభావ సంబంధం ఉంది. బ్రాహ్మణ అగ్రహారమైన ధర్మవురి వాసులతో బంధుత్వం లేకున్నా, ఇక్కడి శ్రీ నృసింహ గురు పీఠంతో, అలాగే సమకాలీన రాజకీయాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉన్న, నాయకులతో గల సన్నిహిత సంబంధాల దృష్ట్యా, తరుచుగా వి.వి. క్షేత్రానికి వస్తూ పోతూ ఉండేవారు. అష్టాదశ పురాణములను ఔపోసనం పట్టి, నిత్య పురాణ ప్రవచనాలతో భక్తులను ఆధ్యాత్మిక లోకాలలో విహరింప చేసిన, అపర శుక యోగేంద్రునిగా పేరుగాంచిన గుండి రాజర్షి వద్దకు వచ్చి, శ్రద్ధగా విని, సందేహ నివృత్తి చేసుకున్న నేపథ్యం, అపర ధన్వంతరి, నాటక సంస్థ స్థాపకులు, దర్శకులు, బహుముఖ ప్రజ్ఞాశాలి కాసర్ల వేంకట రాజయ్య, కొరిడే కిష్టయ్య, వొజ్జల కోటయ్య, పాత కాంతయ్య, పెండ్యాల లక్ష్మీ నరహరి, పానుగంటి బాపు, తదితరులతో, కొరిడే కిష్టయ్య ఇంటి అరుగుపై రోజుల కొద్దీ రాజకీయ చర్చలు చేసిన విషయాలు క్షేత్ర పాతతరం వారికి నిత్య జ్ఞాపకాలుగా ఉన్నాయి. 1967లో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా, లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్న పి.వి. తర్వాత సీఎం బ్రహ్మానంద రెడ్డి, ఆర్దిక మంత్రి మర్రి చెన్నారెడ్డిలతో చర్చించి, స్థానికులు స్వాతంత్య్ర సమర యోధులు సమరయోధుడు కే.వీ. కేశవులకు ఏక సభ్య దేవస్థాన పునరుద్ధరణ కమిటీ బాధ్యులుగా నియమింప చేసి, దేవాలయాల అభివృద్ధికి, శ్రీ వెంకటేశ్వర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలకు పి.వి. చేయూత అందించారు.

ధర్మపురి క్షేత్రంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం సహకారంతో నిర్వహించ బడిన శ్రీ రాజ రాజేశ్వర వెంకటేశ్వర సంస్కృత పాఠశాల కోసం శాశ్వత భవనం నిర్మించాలని, నాటి దేవస్థాన పాలక వర్గ కమిటీకి సూచించి, 1970 అక్టోబర్ 2న రాష్ట్ర విద్యా శాఖ మంత్రిగా, శంకు స్థాపన చేశారు. తర్వాత సదరు పాఠశాల భవనం 1976 ఆగస్టు 11న నాటి రాష్ట్ర వ్యవసాయ, రవాణా శాఖల మంత్రి జువ్వాడి చొక్కారావు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి రాజా సాగి సూర్య నారాయణ రాజు చేతుల మీదుగా ప్రారంభం చేసుకోవడం జరిగింది.
1971 శాసనసభ సార్వత్రిక ఎన్నికల సమయంలో సీఎం హెరీదాలో నాటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బి. రాములుకు మద్దతుగా ధర్మపురి లో ప్రచార సభలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా గోదావరి నుండి త్రాగు నీటి సరఫరా పథకం మంజూరీ ఇచ్చి, దివంగత ఎమ్మెల్యే వెలిచాల జగపతి రావును నీటి సరఫరా పథకం పనులు చేయాలని కోరడం జరిగింది.
తమ సన్నిహితులు రొట్టె విశ్వనాథ శాస్త్రి కోరికపై స్థానిక లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర డిగ్రీ ప్రాచ్య కళాశాల శాశ్వత భవన నిర్మాణం చేపట్టాలని నాటి కరీంనగర్ కలెక్టర్ కే. ఎస్. శర్మను ఆదేశించారు. సదరు కళాశాల భవనాన్ని లాభాపేక్ష లేని స్థానిక కాంట్రాక్టర్ సంగి కిష్టయ్య నిర్మాణం గావించారు. నాటి ఎమ్మెల్యే జువ్వాడి రత్నాకర్ రావు అభ్యర్ధనపై పలు నిధులు మంజూరు చేశారు. 1945 నుండి పి.వి.కి ధర్మవురి నేతలతో సన్నిహిత సంబంధాలు ఉండేవని, ఆయన సమకాలిక నేత, పలువురు కాంగ్రెస్ అగ్ర నాయకు లతో సాన్నిహిత్యం కలిగి ఉన్న దాదా గారి కిషన్ రావు చెప్పేవారు. క్షేత్రంలో గోదావరి రక్షిత మంచినీటి సరఫరా పథకం, తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మశాల, సంస్కృత పాఠశాల భవనం, ఓరియంటల్ డిగ్రీ కళాశాల భవనం పి.వి. చొరవ వల్లనే సాధ్య మైనాయని పి.వి. సన్నిహితులు, ప్రభుత్వ సన్నానితులు, నరసింహ పీఠ నిర్వాహక బాధ్యులు బ్రహ్మశ్రీ రొట్టె విశ్వనాథ శాస్త్రి చెపుతుండే వారు. సాంప్రదాయ పద్య నాటకంలో తన ప్రదర్శన తిలకించి ‘‘నట కిరీటి’’ బిరుదుతో గౌరవించి, సన్మానించిన సంఘటనను, తమ ఇంటిలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యాలయంలో నెల రోజులు బిజీగా పార్టీ పటిష్టతకు అంకిత భావంతో పనిచేసిన, తనతో పాటే నిద్రించిన నేపథ్యాన్ని విశ్వనాథ శాస్త్రి తరుచూ గుర్తు చేసుకునే వారు.
-రామ కిష్టయ్య సంగనభట్ల
9440595494





ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల