-సదాశివపేట తహసిల్దార్ ను ప్రశంసించిన మంత్రి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు
ధరణి పోర్టల్ ఒక అద్భుతమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం ఉదయం సదాశివపేట మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయాన్ని మంత్రి ఆకస్మికంగా సందర్శించి, ధరణి పోర్టల్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ధరణి పోర్టల్ సమస్యలపై హరీష్‌రావు ముఖా ముఖి మాట్లాడారు.
ధరణి పోర్టల్ విధానంపై రైతులు అంతా బాగుందని, ఇంతకుముందులా కార్యాలయం చుట్టూ తిరగకుండా వచ్చిన వెంటనే పని అయిపోతుందని మంత్రికి తెలిపారు. విజయవంతంగా రైతులకు ఏ ఇబ్బంది రాకుండా మరింత వేగవంతంగా పనులు కొనసాగిస్తున్న తహసిల్దార్ పని విధానాన్ని రైతులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో మంత్రి స్థానిక తహసిల్దార్ మనోహర్ చక్రవర్తిని ప్రశంసించి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో రిజిస్ట్రేషన్ కోసం అనేక సమస్యలు ఉండేదని తెలిపారు. ధరణి ఒక విప్లవాత్మకమైన కార్యక్రమమన్నారు. సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని స్వయంగా రూపొందించారని పేర్కొన్నారు. నిజమైన భూ యజమానులకు భూమిపై పూర్తి హక్కు కల్పించాలని, భూమి బదిలీ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలన్నదే ధరణి ఉద్దేశ్యమని మంత్రి అన్నారు. భూముల అమ్మకాలు కొనుగోళ్లు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. పూర్తి పారదర్శకంగా ధరణి రిజిస్ట్రేషన్లు 15 నిమిషాల్లో పూర్తవుతున్నాయన్నారు. ధరణి పోర్టల్ లో ఎలాంటి సమస్య లేదని, సాంకేతిక సమస్యలే కొన్ని ఉన్నా వాటిని పరిష్కరించామని తెలిపారు.
మంత్రితోపాటు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, రాష్ట్ర చేనేత సహకార సంఘం అభివృద్ధి చైర్మన్ చింతా ప్రభాకర్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, తదితరులు ఉన్నారు.


