ధనుర్మాసమే మార్గశిరం.. మహావిష్ణువుకు ప్రీతిపాత్రం

ప్రతి సంవత్సరం సూర్యుడు ధనూరాశిలోకి ప్రవేశించి తిరిగి మకర రాశిలోకి వచ్చేంతవరకు మధ్య ఉన్న కాలాన్ని ధనుర్మాసం అంటారు. ఈ ధనుర్మాసం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ ధనుర్మాసాన్నే మార్గశిర మాసం అనికూడా అంటారు. ఈ నెల డిసెంబరు 13న మార్గశిరం ప్రవేశించింది. ఈ ధనుర్మాసంలో నామ సంకీర్తనం, పుష్ప సమర్పణం, శరణాగతి అనే ఈమూడిరటిని ఆచరిస్తే నేనే రక్షిస్తాననిశ్రీవారు భూదేవికి చెప్పారట. అందుకే భూదేవి కలియుగంలో జీవులను భగవంతుని కృపకు పాత్రులుగావడానికి తానే స్వయంగా తమిళనాడు రాష్ట్రంలో తిరువారూర్‌ జిల్లాలో శ్రీవిల్లి పుత్తూరులో ఆండాళ్‌(గోదాదేవి)గా అవతరించినట్లు చరిత్ర చెబుతుంది. తెల్లవారు రaాము నుంచే శ్రీవేంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవతో పాటు ధనుర్మాస పూజలు నిర్వహిస్తారు.

ధనుర్మాసం ప్రారంభంనుంచి తొలి పక్షం రోజులవరకు సూర్యోదయానికి పూర్వమే అర్చనాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. సూర్యోదయం తర్వాత అర్చనాదికార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈనెలలో వైష్ణవ దేవాలయాల్లో నెల రోజులూ అర్చనాది కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు.సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే మార్పు క్రమంలో తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది. అందువలన సూర్యుడు ఆరు నెలలు ఉత్తరం వైపు ఆరు నెలలు దక్షిణం వైపు కనిపిస్తాడు. ఇలా ఉత్తరం వైపు కనిపించే క్రమమే ఉత్తరాయణం అంటారు. దక్షిణం వైపు కనిపించే క్రమం దక్షిణాయనం. మనకు ఒక సంవత్సరం కాలము అయితే దేవుళ్ళకు ఒక రోజు. అయితే ఒక రోజులో పగలు అనేది ఉత్తరాయణం. రాత్రి అనేది దక్షిణాయణం.. ఈ ఉత్తరాయణమనేది అందుకే మనకు అంత ముఖ్యం.. ఈ రోజు కోసమే భీష్ముడు ఎదురుచూసి ఉత్తరాయణ పుణ్య ఘడియలలోనే పరమపదించారు.

‘‘సంక్రాంతి’’ లేదా ‘‘సంక్రమణం’’ అంటే చేరుట అని అర్ధం. జయసింహ కల్పద్రుమం అనే గ్రంథంలో ‘‘సంక్రాంతి’’ని ఇలా నిర్వచించారు – ‘‘తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరతః సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః’’ – మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి. సూర్యుని చలనంలో (రధయాత్రలో) ఘట్టాలు నాలుగు. అవి మేష, తుల, కటక, మకర సంక్రమణాలు. వీటిలో మకర సంక్రమణాన్ని ‘‘సంక్రాంతి పండుగ’’గా వ్యవహరిస్తారు. మార్గశిరం పూర్తి కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది.

ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజుతో దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ రోజున స్వర్గ వాకిళ్లు తెరుస్తారని హిందువుల నమ్మకం. సంక్రాంతి పండుగ పుష్య మాసంలో వస్తుంది.ఇది మూడు రోజుల పండుగ. దీనిని పెద్ద పండుగగా పరిగణిస్తాము. మార్గశిర మాసం, పుష్య మాసాలు హేమంత ఋతువులో వస్తాయి. ఇది చలి కాలం. చలి గజ గజా వణికిస్తూ వుంటుంది. సౌరమానం ప్రకారం ఈ పండుగ సాధారణంగా జనవరి 13, 14, 15 వ తేదీలలో ఉంటుంది.

రైతులు చెమటోడ్చి పండిరచిన పంటలు చేతికొచ్చే సమయంలో సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి రైతుల పండుగగా దీన్ని అభివర్ణిస్తారు. సంక్రాంతి.. ఈ పండుగ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది పల్లె వాతావరణం, పాడి పంటలు. వివిధ పనులపై గ్రామాల నుండి పట్టణాలకు వలస వచ్చిన వారంతా సంక్రాంతి పండుగ సందర్భంగా వారి స్వగ్రామాలకు చేరుకుంటుంటారు. మకర సంక్రాంతి రోజున ఆడపడుచులను, అల్లుళ్లను ఇంటికి ఆహ్వానించి, వారికి కొత్త బట్టలు పెట్టి… బంధుమిత్రులతో కలిసి ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు కొన్ని కొన్ని వ్రతాలను ఆచరించడం చేస్తారు. వాటిలో గొబ్బిగౌరి వ్రతం ఒకటి. ఈ వ్రతాన్ని భోగినాడు ప్రారంభిస్తారు. ధనుర్మాసం మొదలు సంక్రాంతి పండుగ వరకు ప్రతి ఇంటి లోగిలి రకరకాల ముగ్గులతో ముచ్చటగా కనిపిస్తుంది. ఆ ఇంటి ఆడపడుచులు ఆ ముగ్గుల మధ్యన అందంగా గొబ్బిళ్లను తీర్చిదిద్ది, గొబ్బిపాటలు పాడుతూ.. కేరింతలు కొడుతుంటారు.మొదటి రోజు ‘‘భోగి’’ఉదయాన్నే లేచి ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. ‘‘స్వర్గ వాకిళ్లు’’ అనే ముగ్గును వేస్తారు. ముగ్గుమధ్యలో ‘‘గొబ్బెమ్మలు’’ పెడతారు. వీధులలో ‘‘భోగి మంటలు’’ వేస్తారు. కుటుంబంలోని వారందరూ తలస్నానాలు చేసి ‘‘సంక్రాంతి లక్ష్మి’’ ని పూజిస్తారు. కొత్త బట్టలు కట్టుకుంటారు. భోగి రోజు మూడు లేక ఐదు కూరగాయలను కలిపి కూరగా వండుతారు. దీన్ని ‘‘కలగూర’’ అంటారు. ‘‘నువ్వు పులగం, పొంగలి’’, ప్రధాన వంటకాలు. సాయంత్రము చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోసి పేరంటము జరుపుతారు. బొమ్మల కొలువును ఏర్పరచడం కూడ వుంటుంది. బొమ్మలకు హారతి యిచ్చి, పేరంటం చేస్తారు.

రెండవ రోజు ‘‘సంక్రాంతి’’
ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజుతో దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ రోజున స్వర్గ వాకిళ్లు తెరుస్తారని హిందువుల నమ్మకం. బెల్లం, గుమ్మడి కాయలు ‘‘దానమి’’స్తారు. పితృదేవతలకు ‘‘తర్పణాలు’’ వదులుతారు. ఈ రోజున కూడ ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. ‘‘రథం’’ ముగ్గు వేయటం సాంప్రదాయం. ఈరోజు కూడ ‘‘గొబ్బెమ్మలు’’ పెడతారు. బొమ్మల కొలువు, పేరంటం చేస్తారు.

మూడవ రోజు ‘‘కనుమ పండగ’’
ఈ రోజును ‘‘పశువుల పండుగ’’ అని కూడ అంటారు. వ్యవసాయదారులు పశువులను నీళ్ళతో కడిగి శుభ్రం చేస్తారు.పసుపు కుంకుమలతో, పూలతో అలంకరిస్తారు. పశువులను పూజిస్తారు. పశువుల కొట్టంలో ‘‘పొంగలి’’ వండి అందులో పసుపు, కుంకుమ కలిపి పొలాలలో చల్లుతారు. చీడ-పీడలు సోకకుండా కాపాడమని దేవతలను ప్రార్ధిస్తారు. గుమ్మడి కాయలు పగులకొట్టి పోలి (బలి) వేస్తారు.పూల దండలు గుచ్చి పశువుల మెడలో వేస్తారు. దూడల మెడలకు, కాళ్ళకు చిరుగంటలు కడతారు. ఎద్దు కొమ్ములకు వారి వారి అభిరుచిని బట్టి పసుపు, కుంకుమలు, రంగులతో తీర్చి దిద్దుతారు. గంగిరెద్దులను అలంకరిస్తారు. కొన్నిప్రాంతాలలో పశువుల ఊరేగింపు, కోడి పందాలు, గొర్రె పొట్టేళ్ళ పందాలు కనుమ నాటి సాయంత్రం జరుపుతారు.

‘‘కనుమ’’ రోజు ‘‘మినుము’’ తినాలని ‘‘గారెలు’’ చేసుకొని తింటారు. పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు, అత్తింటికి వెళ్ళిన అల్లుళ్ళు కూడ కనుమ రోజు తిరుగు ప్రయాణమవ్వరు. కనుమ నాడు కాకి కూడ కదలదని సామెత. మాంసాహారం తినేవాళ్ళు కనుమనాడు తప్పక మాంసం వండుకుంటారు. బొమ్మల కొలువు ఎత్తటం అని పేరంటం చేస్తారు. బొమ్మలకు హారతి పట్టి ఒక బొమ్మను శాస్త్రార్ధం ఎత్తి పెడతారు.

-నందిరాజు రాధాకృష్ణ,
వెటరన్‌ జర్నలిస్ట్‌,
9848128215

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *