- భారత్ జోడో యాత్ర ఎందుకన్న బిజెపి నేతల ప్రశ్నలకు రాహుల్ జవాబు
- నేడు హరియానాలోకి భారత్ జోడో యాత్ర
- డిసెంబర్ 24 నుంచి జనవరి 2 వరకు భారత్ జోడో యాత్రకు బ్రేక్
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, డిసెంబర్ 20 : అసలు భారత్ జోడో యాత్ర లక్ష్యాలు ఏమిటని బిజెపి నేతల ప్రశ్నలకు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపి రాహుల్ గాంధీ తనదైన శైలిలో జవాబిచ్చారు. రాజస్థాన్‌లో భారత్ జోడో యాత్ర సందర్భంగా ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ..‘ద్వేషమనే మార్కెట్‌లో నేను ప్రేమ అనే దుకాణాన్ని తెరుస్తున్నాను..ఇదే బిజెపి నేతలు నేను భారత్ జోడో యాత్ర ఎందుకు చేస్తున్నానని అడుగుతున్న ప్రశ్నలకు నా ప్రతిస్పందన’ అంటూ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా పెరుగుతున్న ఇన్‌ఫ్లేషన్‌పై ప్రధాని మోడీని నిలదీస్తూ…ప్రధాని స్నేహితులకు వినోదం కలిగించే కార్యక్రమాలను ఆపి ధరల పెరుగుదలతో అష్టకష్టాలు పడుతున్న సామాన్య ప్రజలను పట్టించుకోవాలని సూచించారు. స్నేహితులకు డేఫ్రూట్స్ తినిపించడం ఆపి పెరుగుతున్న ద్రవ్యోల్భణంతో బాధపడుతున్న ప్రజలకు సేవ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా రాజస్థాన్‌లో ఉజ్వల పథకం కింద పేదలకు 500లకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రాహుల్ ప్రస్తావించారు. కాగా దేశ సమైక్యత కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేడు రాజస్థాన్‌లో ముగించుకుని హరియానాలో ప్రవేశించనుంది. మంగళవారం రాజస్థాన్‌లో 16వ రోజు అల్‌వర్ పట్టణం కటి ఘాటీ నుంచి ఉదయం ప్రారంభమయిన యాత్ర 23 కిలో మీటర్ల మేర కొనసాగి రామ్‌ఘడ్‌లో ముగిసింది. కాగా ఉదయం యాత్రలో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, మాజీ ఎంపి భన్‌వర్ జిత్రే సింగ్, పిసిసి చీఫ్ గోవింద్ సింగ్ జోటస్రా, ఇతర నేతలు, వందలాదిగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు రాహుల్ వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. అల్‌వర్‌లో రాహుల్ గాంధీ కొద్దిసేపు పిల్లలతో మమేకమై ముచ్చటించారు.
డిసెంబర్ 24 నుంచి జనవరి 2 వరకు భారత్ జోడో యాత్రకు బ్రేక్
భారత్ జోడో యాత్ర డిసెంబర్ 24న దిల్లీ చేరుకోబోతున్నది. కాగా డిసెంబర్ 25 నుంచి జనవరి 2 వరకు యాత్రకు విరామం ప్రకటించారు. యాత్ర తిరిగి 2023 జనవరి 3న ప్రారంభమవుతుంది. ఈ విషయాన్ని పార్టీ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేష్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఈ విరామంలో ఉత్తరాదిలో తీవ్రమైన శీతాకాలపు వాతావరణాన్ని తట్టుకునే విధంగా యాత్రలో వినియోగిస్తున్న కంటెయినర్లను మరమ్మత్తు చేయడం జరుగుతుందని, యాత్రలో మొదటి నుంచి రాహుల్ గాంధీతో పాదయాత్రలో పాల్గొంటున్న వారికి నాలుగు నెలల తర్వాత తమ కుటుంబాలతో సమయాన్ని వెచ్చించడానికి అవకాశం దొరుకుతుందని ఆయన తెలిపారు. అయితే ఈ విరామ సమయాన్ని రాహుల్ గాంధీ ఎక్కడ వెచ్చిస్తారో తెలియాల్సి ఉంది.



