- కుటుంబ పాలన కాదు, ప్రజల పాలన కావాలి
- డబ్బులు వొచ్చే పదవులన్నీ కెసిఆర్ దగ్గరే..
- దోచుకున్నదంతా కక్కిస్తాం…ప్రజల ఎకౌంట్‌లో వేస్తాం
- బిజెపి, బిఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటైనా కాంగ్రెస్‌ను ఆపలేవు
- మణుగూరు కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
- జనసంద్రంగా మారిన మణుగూరు
మణుగూరు, ప్రజాతంత్ర, నవంబర్ 17 : తెలంగాణతో తనకున్న సంబంధం రాజకీయ సంబంధం కాదని, రక్తసంబంధం అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసిందని అడుగుతున్నారని, అసలు తెలంగాణ తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ అని, కేసీఆర్ చదువుకున్న బడి, నడుస్తున్న రోడ్లు వేసింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసి డబ్బులు దాచి వాళ్లు నిర్మించుకున్న సామ్రాజ్యం కూలిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని రాహుల్ అన్నారు. తెలంగాణను దోచుకునే దొరలకు తెలంగాణ ప్రజలకు మధ్య పోరాటం జరుగుతుందని అన్నారు. శుక్రవారం ఏఐసిసి అగ్రనేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ మణుగూరు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్‌కు అన్ని గ్రామాల్లోని ప్రజలు అధిక సంఖ్యలో కావడంతో రహదారులన్నీ జనసంద్రంగా మారాయి.
రాహుల్ పర్యటనలో భాగంగా ప్రచార కమిటి కోకన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉదయమే మణుగూరు చేరుకుని పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. అశేష జనాభాను ఉద్దేశించి ఈ సందర్బంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ…ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ప్రజల స్వప్న సాకారం చేసిందని అన్నారు. తెలంగాణ ప్రజలు రాజ్యాధికారం చేపట్టాలని తాము ఆశించాము కానీ అధికారం ఒక కుటుంబానికి పరిమితం అయిందని మండిపడ్డారు. మంత్రివర్గంలో డబ్బులు ఎక్కువ వొచ్చే పదవులు ఏమైతే ఉన్నాయో ఆ పదవులు సియం కేసీఆర్ దగ్గరే ఉన్నాయని అన్నారు. మద్యం, మైన్స్ మరియు ఇతర సంపాదనకు సంబంధించిన శాఖలన్నీ సియం కేసీఆర్ దగ్గరే ఉన్నాయని అన్నారు. దేశంలో అత్యంత అవినీతి ముఖ్యమంత్రి సియం కేసీఆర్ అని, ఆ అవినీతి రాష్ట్రంలో అన్ని చోట్ల కనబడుతుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్ర ప్రజలను లక్షల కోట్లు మోసం ముంచారని అన్నారు. కేసీఆర్ చేసిన అవినీతిని ప్రజలు గుర్తించారని, ఇక ఆయన ఆటలు సాగవన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, కర్నాటక, ఛత్తీస్‌ఘఢ్, రాజస్థాన్ సియంలకు తాము ఒక విషయం చెప్పామని, తెలంగాణలో కాబోయే సియంకు కూడా అదే చెప్తానని అన్నారు. ఇప్పటి బిఆర్‌ఎస్ ఎన్ని లక్షల కోట్లైతే దోచుకున్నారో అన్ని లక్షల కోట్లు తెలంగాణ ప్రజలకు ఖర్చుపెట్టమని కాంగ్రెస్ పార్టీ సియంకు చెప్తానన్నారు. తెలంగాణ ప్రజాధనం ఎవరి చేతిలోకి వెళ్తుందో చూస్తున్నామని, కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చిన వెంటనే వారు దోచుకున్న సంపదను వసూలు చేసి పంచుతామని రాహుల్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటి పథకాలు ప్రవేశపెట్టిందని, అధికారంలోకి రాగానే ఆ పథకాలను అమలు చేస్తామని అన్నారు. 5 వందలకే గ్యాస్ సిలిండర్, ప్రతీ మహిళకు 2500 రూపాయలు, రైతు భరోసా కింద ఎకరానికి 15 వేలు రూపాయలు, గృహజ్యోతి క్రింద 200 యూనిట్ల ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇల్లు పథకం కింద 5 లక్షల రూపాయలు, యువ వికాసం పథకం క్రింద 5 లక్షల విద్యా భరోసా కార్డు, వృద్దులకు 4 వేల రూపాయల ఫించన్ అందజేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.
కేసీఆర్ ప్రభుత్వం హయాంలో మహిళలు బస్సుటిక్కెట్లు కొనుక్కుని ప్రయాణం చేస్తున్నారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఆరు గ్యారెంటీ పథకాలను రాష్ట్రంలో కాబోయే కాంగ్రెస్ సియం పూర్తి చేస్తారని రాహుల్ గాంధీ హామి ఇచ్చారు. తమవి కేసీఆర్‌లా ఉత్తి మాటలు కావని, కాంగ్రెస్ పార్టీ చెప్తే చేస్తుందని అన్నారు. తెలంగాణ వొస్తే తమ జీవితాలు బాగుపడతాయని తెలంగాణ ప్రజల కలలను కాంగ్రెస్ ప్రభుత్వం తీరుస్తుందని అన్నారు. రాష్ట్రంలో జాతీయ జనగణ లాగ కులాల గణన కూడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేస్తామని అన్నారు. లోకల్ రిజర్వేషన్‌ను 22 శాతం నుండి 42 శాతానికి పెంచుతున్నామని అన్నారు. బిసిలు, ఓబిసి లు కూడ వెనుకబడిన కులాలకు ఈ పథకం అందేల చూస్తామని అన్నారు. 24వేల కొత్త లోకల్ బాడీ పోస్టులు తెలంగాణలో రాబోతున్నాయని అన్నారు.
ధరణి పేరు చెప్పి 20లక్షల మంది రైతులను సియం కేసీఆర్ మోసం చేసి భూములు లాక్కున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, ఓబిసిలకు వారి భూములు వారికి అప్పగిస్తామని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ తుఫాను మొదలైందని కేసీఆర్‌కు అర్ధమైందని, ఇలాంటి తుఫానులు ముందుముందు ఇంకా వొస్తాయని అన్నారు. కాంగ్రెస్ దాటికి కేసీఆర్ పార్టీ తెలంగాణలో కనబడకుండాపోతుందని అన్నారు. తెలంగాణ కోసమే ఆరు గ్యారెంటీ పథకాలను తెచ్చామని అన్నారు. తెలంగాణ బిజెపి, బిఆర్‌ఎస్ యంఐయం పార్టీలు కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఆపలేమని ఆయన తెలిపారు. కేంద్రంలో బిజెపికి సియం కేసీఆర్ మద్దతు తెలుపుతున్నారని తెలంగాణ బిఆర్‌ఎస్‌కు బిజెపి మద్దతు తెలుపుతున్నారని అన్నారు. తెలంగాణ ఎన్నికల తరువాత బిజెపి ని కూడ పెకిలిస్తామని అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను గెలిపించాలని, పినపాక అభ్యర్ధి పాయం వెంకటేశ్వర్లును గెలిపించాలని రాహుల్ విజ్ఞప్తి చేసారు. ఈ సభలో పిసిసి ప్రచార కమిటి కోకన్వీనర్ పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భద్రాచలం కాంగ్రెస్ అభ్యర్ధి పొదెం వీరయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు తుళ్ళూరి బ్రహ్మయ్య, భట్టా విజయగాంధీ తదితరులు పాల్గొన్నారు.




