దేశ భవిష్యత్‌ కోసం మరోసారి మోదీని గెలిపించుకోవాలి..

హైదరాబాద్‌లో ఒక ఎంపీ సీటు అవసరముంది..
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : దేశ భవిష్యత్‌ కోసం మరోసారి నరేంద్రమోదీని గెలిపించుకోవాలని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం గోషామహల్‌ జుమ్మెరాత్‌ బజార్‌లో  నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.  పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ వ్యాప్తంగా 5 విజయ సంకల్ఫ యాత్రలు కొనసాగుతున్నాయన్నారు.  మొదటిది  కృష్ణా గ్రామం సమీపంలో కృష్ణా నది నుంచి ఒక యాత్ర, రెండోది  వికారాబాద్‌ జిల్లా తాండూర్‌ నుంచి,  మూడోది  సరస్వతి అమ్మవారి ఆశీస్సులతో బాసర నుంచి , నాలుగో యాత్ర భాగ్యలక్ష్మి ఆలయం నుంచి , ఐదో యాత్ర  భద్రాచలం రాముల వారి చెంత నుంచి యాత్రలు ప్రారంభమయ్యాయని వివరించారు. ఈ యాత్రలు మార్చి 2న  ముగుస్తాయని తెలిపారు. 17 పార్లమెంటు నియోజకవర్గాలు, 114 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5,500 కి.మీ మేర యాత్రలు జరగనున్నాయని, మోడీ సర్కార్‌ ను మూడోసారి  అధికారంలోకి రావాలనే లక్ష్యంతోనే  ఈ యాత్రలు ప్రారంభించామని కిషన్‌ రెడ్డి వివరించారు . 2014లో బీజేపీ కూటమికి  278 సీట్లు వస్తే,  2019లో  302 సీట్లు వచ్చాయని,  బీజేపీకి 375 సీట్లు రావాలనే సంకల్పంతో ప్రజల వద్దకు వచ్చామని తెలిపారు.  దేశ ప్రజలందరి మనసులో మోడీయే రావాలని ఉందని కిషన్‌ రెడ్డి  అన్నారు.

కాంగ్రెస్‌ పాలనలో 12 లక్షల కోట్ల అవీనితి జరిగిందని,  నాడు సోనియా రిమెట్‌ కంట్రోల్‌లో మన్మోహన్‌ సింగ్‌ పనిచేశారని ఎద్దేవా చేశారు. కానీ ఒక్క రూపాయి అవీనితి లేకుండా మోదీ పాలనను కొనసాగిస్తున్నారని, ఆయన  సమర్ధవంతమైన నాయకుడని కొనియాడారు. 500 ఏళ్ల కల అయిన అయోధ్య రామాలయాన్ని మోదీ నిర్మించారని గుర్తుచేశారు.  అధికారంలోకి వస్తే రామ మందిరం నిర్మిస్తామని హామీ ఇచ్చి నెరవేర్చుకున్నామన్నారు.  ఇది మోదీతోనే  సకారమైందని తెలిపారు.ప్రపంచంలో మన దేశ ప్రతిష్టను పెంచారని, అలాంటి  నాయకుడు మళ్లీ  ప్రధాని కావాలన్నారు.తెలంగాణలో 17 స్థానాల్లో  17 బీజేపీని గెలిపించాలని,  మజ్లీస్‌ సీటు కూడా బీజేపీ కైవసం చేసుకోవాలని  అసదుద్దీన్‌   పార్లమెంట్‌కు వెళ్లకుండా  అడ్డుకోవాలని ప్రజలను కోరారు. మజ్లీస్‌ పార్టీ ప్రజాసామ్యానికి, అభివృద్ధికి  వ్యతిరేకంగా పని చేస్తోందని, మెట్రో రైల్‌ను అడ్డుకున్నది మజ్లీస్‌ పార్టీనే అని విమర్శించారు.

ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పంచన చేరి.. పోలీసు వ్యవస్థను తన అధీనంలో  పెట్టుకుంటుందని మండిపడ్డారు. ఈసారి  నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు.  ముఖ్యంగా బీజేపీకి హైదరాబాద్‌ నుంచి ఒక  ఎంపీ  తప్పనిసరిగా గెలవాల్సిన అవసరముందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *