- వొచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోదీకి వోటు వేయండి
- కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రావడం తథ్యం
- సికింద్రాబాద్ నుంచి నన్ను మరోసారి ఆశీర్వదించండి
- సికింద్రాబాద్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్ట్ జీప్ యాత్ర
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10 : వొచ్చే ఎన్నికల్లో మోదీకే వోటు వేసి మరోసారి ప్రధాన మంత్రిని చేయాలని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇవి దేశ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలని, అందుకే ప్రతి ఒక్కరూ ఆలోచించి వోటు వేయాలని ఆయన కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం తార్నాక డివిజన్ సత్యనగర్‌లో పూలే విగ్రహనికి పూలమాల వేసి జీప్ యాత్రను ప్రారంభించారు. శ్రీపురి కాలనీ, చంద్రబాబు నగర్, ఇందిరా నగర్, మీదుగా లాలాపేట్‌కు చేరుకున్న కేంద్ర మంత్రి.. అక్కడ స్థానిక ప్రజలను ఉద్దేశించి స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. అనంతరం లాలాపేట్ లేబర్ అడ్డా, వినోబా నగర్. విజయ డెయిరీ, చింతల్ బస్తి, తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్, నారాయణ కాలేజ్ స్ట్రీట్, విజయపురి కాలనీలో పర్యటించారు.
మెట్టుగూడ డివిజన్లో శివాలయం, ముద్ర సంఘం, బొందల గడ్డ గవర్నమెంట్ నుంచి మెట్టుగూడ వై జంక్షన్ వరకు కొనసాగిన యాత్రలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ…500 సంవత్సరాల నాటి కలను నెరవేరుస్తూ.. ప్రధాని మోదీ దివ్య, భవ్యమైన రామ మందిరాన్ని నిర్మించారని, దేశంలో ప్రతి పేద కుటుంబానికి వంట గ్యాస్ కనెక్షన్ ఉజ్వల పథకం అమలు చేశారని, స్వచ్ఛభారత్ మిషన్ లో భాగంగా దేశంలో13 కోట్ల టాయిలెట్లు కట్టించారని, కోట్లాది మంది పేదలకు ఉచితంగా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి ఇచ్చారని, రైల్వేలు, జాతీయ రహదారులు, ఎయిర్ పోర్టుల అభివృద్ధి, వ్యవసాయ రంగానికి సహకారం, ముద్రా రుణాలు ఇలా.. గత పదేళ్లలో ఎంతో చేశారని, అందుకే మరోసారి మోదీ నాయకత్వాన్ని బలపర్చాలని కిషన్ రెడ్డి ప్రజలను కోరారు.
ఎన్నికల్లో గెలిచేది మోదీనే..
ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించేది కమలం పార్టీనేనని, గెలిచేది…పేదలకు అండగా నిలిచేది…మోదీనేనని, ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానం అక్కర్లేదని కిషన్ రెడ్డి అన్నారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత ప్రధాని మోదీకి దక్కిందని ఆయన గుర్తు చేశారు. ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ చాటుతున్నారని, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్‌లో పనిచేస్తూ దేశ రక్షణలో ముందుంటున్నారని, మోదీ వారికి అన్ని రంగాల్లో అవకాశాలు పెంచారని తెలిపారు. ముస్లిం మహిళలకు అండగా నిలిచేందుకు మోదీ త్రిపుల్ తలాక్ పద్ధతిని రద్దు చేశారని, ముస్లిం ఆడబిడ్డల మెడపై కత్తిలా వేలాడే ఆ విధానాన్ని తొలగించారని, కానీ కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వొస్తే.. మళ్లీ త్రిపుల్ తలాక్ మళ్లీ తెస్తామని అంటుందని, దీనిపై ముస్లిం ఆడబిడ్డలే వారికి సమాధానం చెబుతారన్నారు.
కొరోనా కష్టకాలంలో దేశ ప్రజల ప్రాణాలు కాపాడిన ఘనత ప్రధాని మోదీదని, ఆ సమయంలో ప్రారంభించిన ఉచిత బియ్యం ఇప్పటికీ ఇస్తున్న విషయం తెలిసిందేనని కిషన్ రెడ్డి వివరాంచారు. పొదుపు సంఘాలకు కేంద్రం రూ.20 లక్షల వరకు లోన్ ఇస్తున్నదన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం రూ. 720 కోట్లు మంజూరు చేయడమే కాకుండా.. ప్రధాని స్వయంగా స్టేషన్ ఆధునీకరణకు శంకుస్థాపన చేశారన్నారు. ఎయిర్ పోర్టు తరహాలో ఈ స్టేషన్ అత్యాధునిక వసతులతో అందుబాటులోకి రానుందని, దేశం కోసం మోదీకి వోటు వేయాలని, సికింద్రాబాద్ నుంచి మరోసారి తనను మరోసారి ఆశీర్వదించాలని కిషన్ రెడ్డి ప్రజలను కోరారు.





