రూ.4,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం
కోస్టల్ సిటీ సామర్థ్యం పెంచేందుకు కృషి
గురువాయూరు దర్శనం అదృష్టం అన్న అదృష్టమన్న ప్రధాని మోదీ
కొచ్చి, జనవరి 17 : కేరళలోని కొచ్చిలో రూ.4,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారంనాడు ప్రారంభించారు. ప్రధాని ప్రారంభించిన మూడు ఇన్ఫాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ న్యూ డ్రై డాక్, ఇంటర్నేషనల్ షిప్ రిపేర్ ఫెసిలిటీ(ఐఎస్ఆర్ఎఫ్), కొచ్చిలోని పుదువ్యాపీన్ వద్ద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎల్పీజీ ఇంపోర్ట్ టెర్మినల్ ఉన్నాయి. ఈ సందర్భంగా కొచ్చిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ, తనకు కేరళలో లభించిన సాదర స్వాగతానికి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కేరళలో ప్రారంభించిన కొత్త ఇన్ఫాస్ట్రక్చర్ ప్రాజెక్టులపై మాట్లాడుతూ…కొచ్చి వంటి కోస్టల్ సిటీల సామర్థాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. దేశానికి ’షిప్ బిల్డింగ్ హబ్’గా కొచ్చి రూపుదిద్దుకోనుందన్నారు. పోర్టుల సామర్థ్యాన్ని పెంచడం, మౌలిక వసతులను మరింత పటిష్టం చేయడం, పోర్టుల అనుసంధానాన్ని పెంచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.
భారతదేశం అంతర్జాతీయ వాణిజ్యానికి కేంద్రంగా మారుతున్న తరుణంలో మన సముద్ర శక్తిని కూడా పెంచుకుంటు న్నామని, ఇందుకు ఉదాహరణగా కొచ్చి అభివృద్ధిని త్వరలోనే చూస్తామని అన్నారు. నూతన మౌలిక వసతుల కల్పన ద్వారా కొచ్చి నౌకాశ్రయం సామర్ధ్యం మరింత పెరగనుందని చెప్పారు. నౌకా నిర్మాణం, మరమ్మతులు, ఎల్పీజీ టెర్మినల్‌తో దేశంలోని అతిపెద్ద డ్రై డాక్‌గా కొచ్చి నిలుస్తుందన్నారు. త్రిసూర్‌లోని గురువాయూరు ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసే అదృష్టం తనకు దక్కిందన్నారు. కొద్దిరోజుల క్రితం మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించినప్పుడు రామాయణానికి సంబంధించిన నాలుగు స్థలాలు కేరళలో ఉన్న విషయాన్ని ప్రస్తావించాను.
అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ముందు కేరళ వొచ్చి తిప్రయర్ శ్రీ రామస్వామి ఆలయంలో ప్రార్థనలు చేసే అవకాశం నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నా నని అన్నారు. ప్రధాని తన రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం త్రిసూరులోని గురువాయూర్ శ్రీకృష్ణస్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దేవస్థానం ఆఫీస్ బ్యారర్లు ప్రధానికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.




