న్యూ దిల్లీ, జూన్ 20 : అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పలు నిరసన బృందాలు సోమవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన సందర్భంగా దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హరియాణ, జార్ఖండ్, పంజాబ్, కేరళ రాష్ట్రాల్లో భద్రతను పెంచారు. హరియాణలోని ఫరిదాబాద్‌లో భారీగా పోలీసులు మోహరించగా వివిధ ప్రాంతాల్లో 2వేల మందికిపైగా పోలీసులు పహరా కాశారు. జార్ఖండ్‌లో సోమవారం పాఠశాలలను ముందస్తుగానే మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం భారత్ బంద్ నేపథ్యంలో ఏపీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు.
ఉదయం 5 గంటల నుంచే విజయవాడలోని రైల్వేస్టేషన్, బస్టాండ్ వంటి రద్దీ ప్రాంతాల్లో పోలీస్ బలగాలు మోహరించాయి. భారత్ బంద్ పేరిట హింసాత్మక ఘటనలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ముందస్తుగానే పోలీసులు హెచ్చరించారు. తిరుపతిలోనూ పోలీసు బలగాలు మోహరించాయి. ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా తిరుపతిలోని వివిధ ప్రాంతాలలో 5 వందల మంది పోలీసులు మోహరించారు.
తిరుపతికి వొచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. కాగా ఈ నెల 17న జరిగిన ఘటనతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ప్రజాసంఘాలు, అభ్యర్థులు ఎవరూ రైల్వే స్టేషన్ వద్దకు రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ప్రయాణీకులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వారిని లోపలికి అనుమతించారు.




