- నెక్లెస్ రోడ్డులో యాత్రను ప్రారంభం
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 14: దేశం అభివృద్ధి చెందాలంటే దేశభక్తి, జాతీయవాదం (నేషనలిజం) అవసరమని, ఆ నేషనలిజం స్ఫూర్తిగా దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేపట్టినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో తిరంగా యాత్రను ఆయన జెండా ఊపి గురువారం ప్రారంభించారు. ఈ ర్యాలీలో జంట నగరాలకు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ కళాశాలల విద్యార్థులు, యువకులు, పౌరులు జాతీయ జెండాలను చేతబూని పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచందర్‌రావు మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమం, తిరంగా యాత్ర దేశంలో ప్రతి పౌరుడి గుండెలో దేశభక్తిని నింపుతోందన్నారు. ప్రతి ఇంటి మీద జాతీయ పతాకం ఎగరేయడం ద్వారా దేశ ఐక్యత, గౌరవం, సమగ్రత, దేశభక్తిని నింపేలా గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. రాబోయే తరాలకు ఈ స్ఫూర్తిని అందించాలన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో చేపట్టిన తిరంగా ర్యాలీలో యువత, విద్యార్థులు, మహిళలు అందరూ పెద్ద ఎత్తున భాగస్వామ్యమయ్యారని ఆయన చెప్పారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం సుపరిపాలనతో ముందుకు సాగుతోందని, ప్రపంచంలో నాలుగో స్థానంలో ఆర్థిక శక్తిగా ఎదిగిందంటూ రాబోయే రోజుల్లో సూపర్ పవర్‌గా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్య్రం రావడానికి వేలాదిమంది పోరాటయోధులు, మహనీయుల త్యాగాలే కారణమని, వారి త్యాగాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకమని చెప్పారు. మతం ఆధారంగా దేశాన్ని విడగొట్టిన బ్రిటిషర్లకు, మన దేశ సంపద దోచుకున్న పాకిస్థాన్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోందన్నారు. మరోసారి దేశ విభజన ప్రసక్తే ఉండకూడదని, ఆ సంకల్పంతో భారతదేశ ఐక్యతను, సమగ్రతను, సంస్కృతిని కాపాడేలా తిరంగా యాత్ర ద్వారా సంకల్పం తీసుకున్నట్లు రామచందర్‌రావు తెలిపారు.
దేశభక్తి పెంపొందించేందుకే ‘హర్‌ఘర్ తిరంగా’





