‌దేశం పేరు మారిస్తే పేదల జీవితాల్లో వొచ్చే మార్పేమీ లేదు

• దేశంలో దళితులకు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది
• బీజేపీకి మద్దతు ఇచ్చినందుకు బీఆర్‌ఎస్‌ను గెలిపించాలా
• తెలంగాణకు పట్టిన చీడ, పీడ బీఆర్‌ఎస్‌
•‌ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 7 : దేశం పేరు మారిస్తే పేదల జీవితాల్లో వొచ్చే మార్పేమీ లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి విమర్శించారు. బీజేపీ వల్ల ప్రజలకు ముప్పు ఏర్పడిరదన్నారు. దీనికి మణిపూర్‌ అల్లర్లు నిదర్శనమన్నారు. 2014లో ఎన్డీఏ అధికారంలోకి వొచ్చాక దేశ ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడిరది..దేశంలో దళితులకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మోదీ ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర జరిగి ఏడాది అయిన సందర్భంగా ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం హైదరాబాద్‌ సోమజిగూడ రాజీవ్‌ గాంధీ విగ్రహం నుంచి నెక్లెస్‌ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. తర్వాత రేవంత్‌ రెడ్డి ప్రసంగింస్తూ…ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ మాట తప్పారు..నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆపలేని పరిస్థితి కల్పించారని విమర్శించారు. ఏమీ చేయలేని మోదీ దేశం పేరు మారుస్తామంటున్నారు. ఇండియా కూటమి పేరు పలకడం ఇష్టం లేకనే పేరు మారుస్తామంటున్నారు. మోదీకి చేతనైతే ఇండియా కూటమిని ఎదుర్కునాలన్నారు.
పెరిగిన ధరలు, మణిపూర్‌ అంశాలపై మోదీ పార్లమెంటులో చర్చించడం లేదు. కేవలం కాంగ్రెస్‌ను తిట్టడానికే ఆయన ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ఏం చేసిందన్న మోదీ…గుజరాత్‌లో మోదీ తిరుగుతున్న ఎయిర్‌ పోర్ట్‌ కాంగ్రెస్‌ నిర్మించిందని గుర్తు తెచ్చుకోవాలని సెటైర్‌ వేశారు. హరిత విప్లవంతో అందరికీ ఆహారం అందించేందుకు కాంగ్రెస్‌ పార్టీ కృషి చేసిందన్నారు రేవంత్‌ రెడ్డి. నిజాం రాజుల నుంచి హైదరాబాద్‌కు విముక్తి కల్పించింది కాంగ్రెస్‌ పార్టీనే అని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణకు స్వాతంత్య్రం కల్పించింది కాంగ్రెస్‌ కాదా? మా పార్టీ నాయకుడు జవహర్‌ లాల్‌ నెహ్రూ కాదా? అని ప్రశ్నించారు. దేశంలో మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న విచ్ఛిన్న, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా గాంధీ స్ఫూర్తితో రాహుల్‌ గాంధీ శాంతి, సమగ్రత కోసం 135 రోజులపాటు మండుటెండల్లో, మంచుకొండల్లో భారత్‌ జోడో యాత్ర చేపట్టారు. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర ద్వారా ‘నఫ్రత్‌ చోడో భారత్‌ జోడో’ అనే సందేశాన్ని దేశ ప్రజలకు ఇచ్చారన్నారు. కోట్లాది ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ నాటి నుంచి నేటి వరకు అండగా నిలబడ్డదన్నారు.
ఈ దేశ స్వాతంత్య్రం కోసం, అందరికి సమాన హక్కుల కోసం కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించిందన్నారు. జీఎస్టీ, ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతి ఇలా ప్రతి సందర్భంలో బీజేపీకి మద్దతు ఇచ్చినందుకు బీఆర్‌ఎస్‌ను  గెలిపించాలా అని అసదుద్దీన్‌ను రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. లక్ష కోట్లు దోచిన కేసీఆర్‌కు మద్దతు తెలపడంలో వారి ఆంతర్యం ఏంటి అసద్‌ భాయ్‌ అని వ్యాఖ్యానించారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చినందుకు కాంగ్రెస్‌ పార్టీ ఓడిరచాలా అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. కారు దిల్లీకి వెళ్లి కమలంగా మారుతుందన్నారు. తెలంగాణకు పట్టిన చీడ,పీడ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. రాబోయో వంద రోజులు అంకుఠిత దీక్షతో పని చేసి తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేద్దామని రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. సీడబ్ల్యూసీ సమావేశం తర్వాత నిర్వహించే బహిరంగ సభ కోసం పరేడ్‌ గ్రౌండ్‌ బుక్‌ చేసుకుంటే…అధికారం ఉందని బీజేపీ గ్రౌండ్‌ గుంజుకుందని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. హోమ్‌ మంత్రి అమిత్‌ షా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. బీజేపీ, బీఆరెస్‌ కుట్ర చేసి కాంగ్రెస్‌ సభను జరగకుండా కుట్ర చేస్తున్నాయి. సీడబ్ల్యూసీ సమావేశాలకు భద్రత కోసం పోలీసులను అపాయింట్‌మెంట్‌ అడిగితే స్పందించడం లేదు. మోదీ, కేసీఆర్‌ అధికారం అడ్డు పెట్టుకుని అధికారులను భయపెడుతున్నారు. 16,17,18 తేదీల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలారా హైదరాబాద్‌ నగరాన్ని కప్పేయండి. కదలండీ..మన నాయకులను కాపాడుకుందాం అని రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు.
అనగనగా ఓ కేసీఆర్‌..‌వరి వేస్తే ఉరే అన్నాడు
ట్విట్టర్‌ ‌వేదికగా రేవంత్‌ ‌వ్యాఖ్య
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్‌ ‌రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి విమర్శలు గుప్పించారు. వ్యంగ్యంగా ట్వీట్‌ ‌చేస్తూ కేసీఆర్‌ ‌హామీలను నిలదీశారు. అనగనగా ఓ కేసీఆర్‌ అం‌టూ మొదలుపెట్టి కథలు కంచికి- కేసీఆర్‌ ‌ఫాంహౌస్‌కి అంటూ ముగించారు. వరి వేస్తే ఉరన్నాడు..ఆయనే 150 ఎకరాల్లో వేశాడు. 24 గంటల కరెంట్‌ అన్నాడు..లాగ్‌ ‌బుక్‌ ‌చూస్తే పట్టుమని పది గంటలు లేదు. యూరియా కోసం రైతులు తిప్పలు పడుతున్నారంటూ ఓ దినపత్రిక ప్రచురించిన కథనాన్ని తన ట్వీట్‌కు జోడించారు. ఎండలో రైతులు గంటల తరబడి నిలుచునేలా చేశాడంటూ కేసీఆర్‌పై మండిపడ్డారు. రైతులకు కావాల్సిన ఎరువులను ఉచితంగా ఇస్తానన్న హామీ ఏమైందని రేవంత్‌ ‌ప్రశ్నించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *