దేశంలోనే ‘దళితబంధు’ తెచ్చింది ఒక్క కేసీఆర్‌..‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీ మాత్రమే…

  • పదేళ్ల పాలనలో అంతా ప్రశాంతతే…  
  • ఒక్క రోజు కూడా కర్ఫ్యూ లేదు…లాఠీచార్జి లేదు…ఫైరింగ్‌ ‌లేదు…
  • ధరణి వల్ల దలారులు, లంచావతారాల బెడద తప్పింది
  • చెరువులను బాగుచేసుకోవడం, చెక్‌ ‌డ్యాంల నిర్మాణాలను కాంగ్రెస్‌ ఎం‌దుకు చేయలేదు..
  • మిషన్‌ ‌భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు
  • లోకమంతా ప్రైవేట్‌ ‌మయం చేస్తున్న మోదీ
  • భైంసా, ఆర్మూర్‌ ‌ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌
  • అం‌కాపూర్‌ అం‌టే తనకు ప్రాణమన్న సీఎం కేసీఆర్‌

భైంసా / ఆర్మూర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 03 : ‌ప్రజాస్వామ్య పరిణతి సాధించిన దేశాలు పురోగతిలో ఉన్నాయని, మన దేశంలో ఇంకా అది రావాల్సిన అవసరముందని, ఎన్నికల్లో నిలబడే వ్యక్తుల గుణగణాలతో పాటుగా ఆ వ్యక్తి వెనుక ఉన్న పార్టీ చరిత్ర ఏంటి? ప్రజల గురించి ఆ పార్టీ దృక్పథం ఏంటి? రైతుల పట్ల వారి ఆలోచన ఏంటి? అనే విషయాలను పరిగణించాలని సిఎం కేసీఆర్‌ ‌కోరారు. వోటును సరైన పార్టీకి వేస్తేనే భవిష్యత్తు సరైన పద్ధతిలో ఉంటుంది. లేదంటే ఐదేండ్లు బాధపడాల్సి ఉంటదని భారత రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి  కేసీఆర్‌ అన్నారు. శుక్రవారం ముథోల్‌ ‌నియోజకవర్గంలోని భైంసా, ఆర్ముర్‌లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్‌ ‌మాట్లాడుతూ…కాంగ్రెస్‌ ‌పార్టీ మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి రైతు బంధు దుబారా అని మాట్లాడుతున్నడని, ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు 24 గంటల కరెంట్‌ అవసరం లేదు 3 గంటలు సరిపోతదంటున్నడని విమర్శించారు.

గృహాలు, పరిశ్రమలు, ఐటి, వ్యవసాయం లకు భారతదేశంలో 24 గంటల కరెంటునిస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణయేనని, మహారాష్ట్ర రైతులు మన దగ్గర బోర్లు వేసుకొని మహారాష్ట్రలో పంటలు పండించుకుంటున్నరన్నారు. ఎక్కడి నుంచి నున్నటి రోడ్డు మొదలైతదో అక్కడి నుండే తెలంగాణ అని మహారాష్ట్ర వాళ్లు అంటున్నరని, అది మన అభివృద్ధికి సూచికని కెసిఆర్‌ అన్నారు. మహారాష్ట్రలో కరెంటు లేదని, మన తెలంగాణలో 24 గంటల కరెంటు ఉంటదని, దీనికి కారణం ఇక్కడ చిత్తశుద్ధితో, మొండి పట్టుదలతో పనిచేస్తున్న మన ప్రభుత్వం ఉండటమేనన్నారు. తెలంగాణ వొచ్చేనాటికి రాష్ట్రంలో మంచినీళ్లు లేవు, కరెంటు లేదు, సాగునీళ్లు లేవు, ప్రజలు వలసలు పోయేది. చెల్లాచెదురయి ఉన్నాం. తెలంగాణలో 70 శాతం రైతులున్న వ్యవసాయాన్ని మొదట స్థిరీకరించేలా దశలవారీగా పనిచేసాం.

మహారాష్ట్రలో వాటర్‌ ‌ట్యాక్స్ ఉం‌ది గానీ, మన దగ్గర లేకుండా చేసాం. నీళ్లు, కరెంటు ఫ్రీగా ఇస్తున్నాం. పెట్టుబడికి రైతుబంధును ఫ్రీగా ఇస్తున్నాం. రైతు బీమాను పెట్టాం. ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. ధరణి పోర్టల్‌ ‌లేకముందు పైరవీకారులు, లంచాలు ఉండేవి. నేడు ధరణి పోర్టల్‌తో మండల కేంద్రాల్లోనే రిజిస్ట్రేషన్లు వేగంగా జరుగుతున్నయని కెసిఆర్‌ ‌పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్‌ ‌పార్టీ నేత రాహూల్‌ ‌గాంధీ, ఆ పార్టీ నాయకులు ధరణి తీసేసి బంగాళాఖాతంలో వేస్తామంటున్నారు.  ధరణి వల్ల దలారులు, లంచావతారాల బెడద తప్పింది. అధికారుల చుట్టూ నెలల తరబడి తిరిగే అవసరం లేకుండా పోయింది. గతంలో ఇక్కడ పత్తి మాత్రమే ఎక్కువగా పండించేవారు. కానీ నేడు వరి, సోయా, ఇతర పంటలనూ రైతులు పండిస్తున్నారు. గతంలో మంచినీళ్ల కోసం ఆడబిడ్డలు బిందెలతో ధర్నాలు చేసేది. నేడు అలాంటి పరిస్థితి లేకుండా చేసాం.

మిషన్‌ ‌భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తున్నాం. యాదాద్రి పవర్‌ ‌స్టేషన్‌ ‌ద్వారా వచ్చే నాలుగు వేల మెగా వాట్స్ ‌పవర్‌ అం‌దుబాటులోకి వస్తే తెలంగాణకు శాశ్వతంగా కరెంటు కోత ఉండదని కేసీఆర్‌ అన్నారు. విమానాలు, ఓడలు, రైల్వేలు..లోకమంతా ప్రైవేట్‌ ‌మయం చేస్తున్నాడు మోదీ. మోదీ కరెంటును కూడా ప్రైవేటైజేషన్‌ ‌చేసి రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలంటే నేను ఒప్పకోలేదు. భవిష్యత్తులోనూ మీటర్లు పెట్టం. ఏడాదికి 5 వేల కోట్ల చొప్పున మొత్తం రూ.25 కోట్ల నష్టం చేసిండు మోది.  మోటార్లకు మీటర్లు ఎట్ల పెడుతరని, రూ.25 వేల కోట్లు కట్‌ ‌చేసి ఏ విధంగా ఓట్లు అడుగుతరని బీజేపీ నేతలను ప్రశ్నించాలి. దేశవ్యాప్తంగా కేంద్రం 157 మెడికల్‌ ‌కాలేజీలు పెడితే ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదు.

ఒక్క మెడికల్‌ ‌కాలేజీ కూడా ఇవ్వని బీజేపీకి మనం ఒక్క ఓటు కూడా వేయొద్దు.కేంద్ర ప్రభుత్వానికి చట్టాలంటే బేఖాతరే. కేంద్రం మనకు రావాల్సిన నవోదయ పాఠశాలలను మంజూరు చేయలేదు. కుల మతాలకు అతీతంగా అభివృద్ధిని చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. కాంగ్రెస్‌ ‌పార్టీ 75 ఏండ్ల క్రితమే దళితుల గురించి ఆలోచన చేస్తే నేడు వారికీ దుస్థితి ఉండేది కాదు. దేశంలో ఏ ప్రధాని, ముఖ్యమంత్రులు కూడా దళితుల కోసం చేయలేదు. కేవలం వారిని ఓటు బ్యాంకుగానే చూసారు. ఇండియాలో ‘దళితబంధు’ అనే పథకాన్ని తెచ్చింది ఒక్క కేసీఆర్‌..‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీ మాత్రమే. రాబోయే రోజుల్లో ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు సాయం అందేలా బీఆర్‌ఎస్‌ ‌హామీనిస్తున్నదని కెసిఆర్‌ అన్నారు.

‘సరస్వతి నమస్తుభ్యం’ ..: భైంసా సభలో  సి ఎం కేసీఆర్‌  
‘‌సరస్వతి నమస్తుభ్యం’ అని చదువు మొదలు పెడుతాం. చదువుల తల్లి బాసర సరస్వతి కొలువైన పుణ్యభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని కెసిఆర్‌ ‌తెలిపారు. గతంలో ఇక్కడ గోదావరి పుష్కరాలు జరగలేదని, తెలంగాణ రాష్ట్రం వొచ్చాక బ్రహ్మాండంగా జరుపుకుంటున్నామని చెప్పారు.  బాసర సరస్వతీ దేవాలయానికి రూ.50 కోట్లు కేటాయించాం.అవసరమైతే ఇంకా మంజూరు చేస్తాం. వందల ఏండ్ల నుంచి బైంసా, ముథోల్‌, అదిలాబాద్‌, ‌హైదరాబాద్‌ ‌లలో హిందువులు, ముస్లింలు కలిసిమెలిసి ఉండి పనిచేసుకుంటున్నారు. బైంసా అంటే రోజూ కొట్టుకుంటరనే అబద్ధాలు ప్రచారంలో పెట్టి మనమధ్యనే చిచ్చు పెడుతున్నారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంలో ఒక్క రోజు కూడా కర్ఫ్యూ లేదు. లాఠీచార్జి లేదు. ఫైరింగ్‌ ‌లేదు. తెలంగాణ ప్రశాంతంగా ఉండాల్నా? లేక మత పిచ్చి మంటలతో నెత్తురు పారాల్నా?  కలిసిమెలిసి బతకడంలోనే శాంతియుతమైన సహజీవనం ఉంటది.

19 రాష్ట్రాల్లో ఉన్న బీడీ కార్మికులకు ఏ రాష్ట్రంలోనూ పెన్షన్‌ ఇవ్వడం లేదు. కేవలం మన తెలంగాణలో మాత్రమే బీడీ కార్మికులకు, ప్యాకర్స్ ‌కు, హాకర్స్ ‌కూ రూ.2 వేల పెన్షన్‌ ఇస్తున్నం. వచ్చే ప్రభుత్వంలో వారి పెన్షన్‌ ‌నూ పెంచుతాం. మీరందరూ కారు గుర్తుకు వోటేసి, బీఆర్‌ఎస్‌ ‌పార్టీని బలపరుస్తూ విఠల్‌ ‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు కేసీఆర్‌. ‌గడ్డెన్నవాగు ద్వారా 14 వేల ఎకరాలకు పంట నీరందించాలి. బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రాకముందు కేవలం 4 వేల ఎకరాలకు కూడా సరిగ్గా వచ్చేది కాదు. ఎమ్మెల్యే విఠల్‌ ‌రెడ్డి నాతో అభివృద్ధి పనులు చేయించడంతో 12 వేల ఎకరాలకు నేడు నీరందుతున్నది. త్వరలోనే పూర్తిస్థాయిలో పంటలకు నీరొస్తుంది. ఎస్సారెస్పీ పనులు కూడా పూర్తయితే ముథోల్‌, ‌తానూర్‌, ‌లోకేశ్వరం మండలాల్లో 50 వేల ఎకరాలకు నీరు అందుబాటులోకి వస్తుంది. చెరువులను బాగుచేసుకోవడం, చెక్‌ ‌డ్యాంల నిర్మాణాలను యాభై ఏండ్లు పాలించిన కాంగ్రెస్‌ ఎం‌దుకు చేయలేదు? కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో ఎరువుల బస్తాల కోసం రైతులు పోలీస్‌ ‌స్టేషన్లలో తమ చెప్పులను లైన్లలో పెట్టి వెళ్లేది.  ఎరువులు, కల్తీలేని విత్తనాలను మన ప్రభుత్వం రైతులకు అందుబాటులోకి తెచ్చింది అని బీ ఆర్‌ ఎస్‌ అధినేత,సి ఎం  కేసీఆర్‌ అన్నారు.

అంకాపూర్‌ అం‌టే నాకు ప్రాణం..: ఆర్మూర్‌ ‌ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌
‌జీవన్‌ ‌రెడ్డి ఉద్యమంలో ఉండి ఎర్రజొన్న రైతుల కోసం ఆమరణ దీక్ష చేసారని, ఆనాడు ఆర్మూర్‌లో కాల్పులు జరిగితే వెంటనే తాను వొచ్చి అండగా ఉన్నానని, కుటుంబసభ్యుడిలా ఉంటూ బీఆర్‌ఎస్‌ ‌పార్టీని బలంగా ముందుకు తీసుకుపోతున్న నాయకుడు జీవన్‌ ‌రెడ్డి అని కెసిఆర్‌ ‌ప్రశంసలు కురిపించారు. జీవన్‌ ‌రెడ్డి నమ్ముకున్న ప్రజల కోసం పట్టుబట్టి ఆరూరు, డొంకేశ్వర్‌ ‌మండలాలు కావాలని సాధించింగని అన్నారు. ఇక అంకాపూర్‌ అం‌టే తనకు ప్రాణమని, ఆ గ్రామం గురించా తాను ప్రచారం చేసినంత ప్రపంచంలో ఎవరూ చేయలేదని, అంకాపూర్‌ ‌చైతన్యంతో వందలాది గ్రామాలు అభివృద్ధిలో పయనిస్తూ ఆర్థికంగానూ ఎదిగాయని కెసిఆర్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *