దురుద్దేశ్యంతో ఆరోపణలు చేయడం తగదు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, జనవరి 03 :  పూర్వ ఉద్యోగుల పేరిట హిందీ ప్రచార సభ హైదరాబాద్ సంస్థ సభ్యులపై చేసిన ఆరోపణలు అవాస్తమని హిందీ ప్రచార సభ హైదరాబాద్ ఉద్యోగుల సంఘం స్పష్టం చేసింది. హిందీ ప్రచార సభ సంస్థ భవిష్యత్ ను అంధకారంలోకి తీసుకెళ్లే విధంగా దురుద్దేశ్యంతో ఆరోపణలు చేయడం తగదని, సంస్థకు పూర్తిగా నష్టం చేసే చర్యలు విడనాడాలని తెలియచేసింది. ఈ మేరకు బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హిందీ ప్రచార సభ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నామ్ దేవ్ వాగ్మొడే, కార్యదర్శి శివలింగం గౌడ్, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని మాట్లాడారు. సంస్థ విస్తరణలో భాగంగా రాజేంద్ర ప్రసాద్ కపూర్ ను మూడేళ్ల క్రితం బదిలీ చేస్తే అక్కడ విధుల్లో చేరలేదని గుర్తు చేశారు. మహేష్ సింగ్, నమ్రత లు ఆంధ్రప్రదేశ్ హిందీ ప్రచార సభ ఉద్యోగులని, రాష్ట్ర విభజన తర్వాత అనంతపురం కు సంస్థ కార్యాలయం అక్కడకు వెళ్లిందని, సంస్థ తరలివెళ్లిన వీళ్ళు మాత్రం అక్కడకు వెళ్ళలేదని చెప్పారు. లక్షల మంది ఉపాధ్యాయులను తయారు చేసిన ఘనత హిందీ ప్రచార సభకు ఉందని, వందల మంది జీవితాలు సంస్థపై ఆధారపడి ఉన్నాయని, వీటిని మర్చిపోయి బాధ్యత రహితంగా సంస్టపై, సభ్యులపై ఆరోపణలు చేసి సంస్థ ప్రతిష్టను దిగజార్చడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. హిందీ ప్రచార సభ హైదరాబాద్ కార్యకలాపాలు, సంస్థ సభ్యులపై తప్పుడు ప్రచారం చేసి అగౌరవ పరిచిన రాజేంద్ర ప్రసాద్ కపూర్, నరేందర్, మహేష్ సింగ్, నమ్రతలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భవిష్యత్ లో ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో ఉద్యోగుల సంఘం నేతలు భానుదాస్ పూజారి, మాయా పాండే, జీఆర్ నర్సింగ్, ప్రతిభ, వినోద్ కుమార్ రెడ్డి, సునీత, అరుణ, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *