‘‘తాటిచెట్టు ఎందుకెక్కావంటే, దూడ గడ్డి కోసం అన్నాడంట ఓ పెద్ద మనిషి’’ – మీరు బిజెపి కి, టిఆర్‌ఎస్ కి వ్యతిరేకం కదా! చిన్న పార్టీలు గెలవరని తెలిసి కూడా ఎందుకు మీరు బహుముఖ పోటీకి దిగుతున్నారని అడిగితే – ప్రజల్లో వర్గ చైతన్యం తేవడానికని కొంత మంది – బహుజన రాజ్యాధికార అవసరం గురించి ప్రజల్లో చైతన్యం తేవడానికి అని సమాధానం చెబుతున్నారు. వీళ్ల పిచ్చి చేష్టలు వల్ల చివరికి జరిగేదేమిటంటే, బహుముఖ పోటీల పుణ్యమా అని – బిజెపి, టిఆర్‌ఎస్ వ్యతిరేక వోట్లు చీలిన ఫలితంగా, ఇప్పుడు ఉన్న పాలకులే మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని ఫాసిస్ట్ వ్యతిరేక ప్రగతిశీల శక్తులు అర్ధం చేసుకుని, అనవసరంగా ఇబ్బడి ముబ్బడిగా బహుముఖ పోటీ జరగకుండా నివారించేందుకు చొరవ తీసుకోవలసిన అవసరం నేడు ఎంతైనా ఉంది. నేడు దేశానికి ప్రధాన ప్రమాదం ఫాసిస్టు సంఘ పరివార్ బీజేపీ శక్తులు… వారు రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారు. ఫాసిజం నుండి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి అని భావిస్తున్న వారు ఎవరయినా అందుకు అనుగుణంగా ఉన్నామా!లేదా! అని స్వీయ పరిశీలన చేసుకోవడం చాలా అవసరం. తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్, భారాస ప్రచారంలో అందనంత ఎత్తులో ముందుకు దూసుకెళ్తున్నయి. అధికార భారాస ప్రచారానికి ముహూర్తాలు కూడా నిర్ణయించింది. కాంగ్రెస్ అగ్రశేణి నాయకులు కేసీఆర్ వైఫల్యాలను ప్రధాన అంశంగా పలు బహిరంగసభలల్లో వివరిస్తున్నారు. మరోవైపు గత నెల 15వ తారీకుతో మొదలుపెట్టి ప్రతి నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ పెట్టే విధంగా భారాస ముందుకు దూసుకెళ్తుంది.
తెలంగాణ ఎన్నికల్లో రోజురోజుకు అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ వరుసగా చిన్న పార్టీలు పోటీ నుంచి తప్పుకుంటున్నాయి. మొన్న టీడీపీ, టీజేఎస్, తాజాగా వైసీటీపీ పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. అయితే ఇందులో టీజేఎస్, వైసీటీపీ కాంగ్రెస్కు మద్దతు తెలపడం గమనార్హం. కాంగ్రెస్తో కమ్యూనిస్టులు( సీపీఐ) కలిసి పోటీ చేస్తుండగా, బీజేపీతో జనసేన పొత్తు కుదుర్చుకుంది. ఇక అధికార బీఆర్‌ఎస్ మాత్రం ఒంటరిగా బరిలో దిగింది. దీంతో తెలంగాణ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న భారతీయ రాష్ట్ర సమితి మరిన్ని కొత్త పథకాలను, కీలకమైన హామీలను ఇచ్చే దిశగా ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలను ఎత్తి చూపుతూ, నిరుద్యోగం, ఉపాధి, విద్య, సంక్షేమంలో పూర్తిగా విఫలమైందని అలాగే స్థానిక సమస్యలు ప్రధాన అంశాలుగా కాంగ్రెస్ ఇప్పుడు పూర్తిస్థాయి లో దూకుడు పెంచింది. కీలక నేతలను అధికార పార్టీలో అసంతృప్తి నేతలను ఆకర్షించగలిగిన కాంగ్రెస్ ఇప్పుడు అన్ని నియోజకవర్గాలలోనూ డి అంటే ఢీ అనే అభ్యర్థులను సంపాదించుకో కలిగింది . దీంతో రాబోయే ఎన్నికల్లో హోరాహోరీగా జరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కోదండరాం పార్టీ, వైఎస్‌ఆర్టిపి పార్టీలు బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం కలిసొచ్చింది. ఇక తెలుగుదేశం సానుభూతిపరులు సైతం కాంగ్రెస్ కు కొన్ని చోట్ల ప్రత్యక్షంగా మరి కొన్ని చోట్ల పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారు.
అయితే సందట్లో సడేమియాలా ఎన్నికల రణ రంగంలోకి దూసుకొస్తున్న కొన్ని చిన్న పార్టీలు, వామపక్ష పార్టీలు ఈ పెద్ద పార్టీల తలరాతలను మార్చే అవకాశం కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా జనసేన , బిఎస్పి, సిపిఎం , ఫార్వర్డ్ బ్లాక్ వంటి పార్టీలు కనిపిస్తున్నాయి .వీటన్నిటికీ వ్యక్తిగతంగా గెలిచే శక్తి లేనప్పటికీ తమదంటూ కొంత వోటు బ్యాంకు ఉంది. ప్రతి నియోజకవర్గానికి రెండు మూడు వేల వోట్లు ఈ పార్టీలు గనుక చీల్చ కలిగితే అవి ఖచ్చితంగా ప్రధాన పార్టీల జాతకాన్ని మారుస్తాయని చెప్పవచ్చు. తెలంగాణ ఏర్పాటుకు ముందు అధికారం చలాయించిన టిడిపికి నియోజకవర్గం వారిగా కొంత వోట్ బ్యాంక్ ఉంది . దళిత, క్రిస్టియన్ నియోజకవర్గాలలో బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్ కు సపరేట్ వోటు బ్యాంకు ఉంది. దీంతో ఆయా పార్టీలకు పడే వోట్లు ఎవరి వోటు బ్యాంకు ను చీలుస్తాయి అన్నదే పెద్ద ప్రశ్నగా మారింది.హోరాహోరీ పోరులో ఒక్కొక్కసారి 10 వోట్లు కూడా ముఖ్యమవుతాయి అలాంటప్పుడు ఈ చిన్న పార్టీలకు పడే వోట్లు పెద్ద ప్రభావమే చూపించే అవకాశం ఉంది.అందువల్ల ఆయా నియోజకవర్గాల్లో ఇప్పుడు అభ్యర్థులు ఈ చిన్న పార్టీల గురించి టెన్షన్ పడుతున్నట్లుగా తెలుస్తుంది ఈ పార్టీలు ప్రభుత్వ వ్యతిరేకతను వోటు ని చీల్చగలిగితే భారాస మరోసారి గద్దె నేక్కుతుంది.లేకపోతే కాంగ్రెస్ లాభపడుతుంది .
ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఈ చిన్న పార్టీల రాజకీయం గురించి రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో వంద వోట్లు తక్కువకాకుండా ప్రభావితం చేసే కొన్ని పార్టీలు ఆమ్ ఆద్మీ, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ, దేశ్ జనహిత్ పార్టీ, ఆదాబ్ పార్టీ, సామజిక తెలంగాణ పార్టీ, అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్, రెఫార్మిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, పిరమిడ్ పార్టీ, భారత్ స్వదేశీ కాంగ్రెస్ పార్టీ, నక్క యాదేశ్వర్ పార్టీ, ప్రజా శాంతి పార్టీ, విశ్వభారత్ పార్టీ, ఆల్ తెలుగు ప్రజా పార్టీ, జై స్వరాజ్ పార్టీ, బిసిజె పార్టీ ఈ పార్టీలు ఎందుకు నిలబడుతున్నాయో వీటి నాయకులెవరో అంతా గందరగోళంగా ఉంది. మరికొన్ని పార్టీలు ప్రతి ఏటా నిర్వహించే నంది నాటకోత్సవం లాగా మాక్ అసెంబ్లీ మాక్ పార్లమెంట్ నిర్వహించారు.
మునుగోడు ఎన్నికల్లో టిఆర్‌ఎస్ కు పల్లకి మోసిన కమ్యూనిస్టులని ప్రగతి భవన్ పరిసర ప్రాంతాలకు రాకుండా చేశాడు. కవిత పై ఇడి కేసుల నేపథ్యంలో దేశ రాజధానిలో కమ్యూనిస్టు జాతీయ నాయకులతో నిరసనలు తెలియజేసిన మద్దతు తెలిపిన కనికరం లేకపాయె కేసీఆర్ కు అని లోలోన కుంగి పోతున్నారు తెలంగాణ కమ్యూనిస్టులు. తమ సీట్ల కోసం మొన్నటివరకు బిఆర్‌ఎస్ తరువాత ఇండియా కూటమిలో కాంగ్రెస్ పంచన చేరి భంగపడ్డ రెండవతరం నాయకులను ప్రోది చేసుకోలేని కమ్యూనిస్టులు ఎటు వెళ్లాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దేశంలో కమ్యూనిస్టులు, బహుజన పార్టీల పరిస్థితి దారుణంగా తయారైంది. పైకి లౌకికవాదం, బహుజన వాదం భుజానకెత్తుకున్నాం అని నీతులు చెబుతున్న చేసేది అవకాశవాద స్వార్థ రాజకీయాలు అనే అపవాదును మూటగట్టుకున్నారు. గత దశాబ్ద కాలంలో వామపక్ష పార్టీలలో చేరికలు లేవు.. అనుబంధ సంఘాలలో సభ్యత్వం మరచిపోయారు.. క్యాడర్ లేక కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నారు. తమ పార్టీ బలోపేతానికి కృషి చేయకుండా కొత్త తరం నాయకులను పెంపొందించకుండా విద్యార్థులకు యువతకు మార్గదర్శకం కాకుండా వ్యవహరిస్తున్న తీరు ప్రమాదకరంగా మారింది. ˜
డా. ముచ్చుకోట సురేష్‌బాబు,
అధ్యక్షులు,
ప్రజా సైన్స్ వేదిక
9989988912





