దివ్యాంగుల సహకారానికి భారత్‌, ‌దక్షిణ ఆఫ్రికా మధ్య ఎమ్‌ఒయు

సంతకాలకు మంత్రి మండలి ఆమోదం  
హైదరాబాద్‌, ‌పిఐబి, ఫిబ్రవరి 15 : దివ్యాంగ జనులకు సంబంధించిన రంగంలో సహకారానికి గాను భారతదేశ ప్రభుత్వానికి, దక్షిణ ఆఫ్రికా గణతంత్ర ప్రభుత్వానికి మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం(ఎమ్‌ఒయు) పై సంతకాలు చేయడానికి  ప్రధాన  మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదాన్ని ఇచ్చింది. ఈ ద్వైపాక్షిక అవగాహన పూర్వక ఒప్పందం దివ్యాంగ జనుల సంబంధిత రంగంలో సంయుక్త కార్యక్రమాలను అమలు పరచడం ద్వారా భారత గణతంత్ర ప్రభుత్వానికి చెందిన దివ్యాంగ జనుల సాధికారిత విభాగానికి, దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వానికి మధ్య సహకారాన్ని ప్రోత్సహించనుంది. ఇది భారతదేశానికి, దక్షిణ ఆఫ్రికాకు మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుంది.

పరస్పరం అంగీకారం కుదిరే మేరకు, రెండు దేశాల మధ్య సహకారానికి సంబంధించిన నిర్దిష్ట ప్రతిపాదనలను ఎమ్‌ఒయు చెల్లుబాటు అయ్యే కాలంలో ఆచరణలోకి తీసుకు రావడం జరుగుతుంది.  రెండు దేశాలలో దివ్యాంలు, వయోవృద్ధులకు మరీముఖ్యంగా అవసరం అయ్యేటటువంటి ఆధునికమైన, విజ్ఞాన శాస్త్ర సంబంధమైన, మన్నికైన, తక్కువ ఖర్చులో లభ్యం కాగల ఉపకరణాలను, సహాయక సాధనాలను అందించాలనేది ఈ ఎమ్‌ఒయు యొక్క ముఖ్య ఉద్దేశ్యంగా ఉంది. గాంధీ మహాత్ముడు ఒక వంద సంవత్సరాల కాలాని కంటే పూర్వం దక్షిణ ఆఫ్రికాలో సత్యాగ్రహ ఉద్యమాన్ని మొదలు పెట్టిన కాలం నుండి స్వాతంత్య్రం కోసం మరియు న్యాయం కోసం పోరాటం సాగిన నేపథ్యంలో దక్షిణ ఆఫ్రికా, భారతదేశం ఒక సుదీర్ఘమైనటువంటి  చరిత్రాత్మక బంధాన్ని, సంబంధాలను ఏర్పరచుకున్నాయని చెప్పాలి.

జాతి విచక్షణకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమానికి సంఘీభావాన్ని వ్యక్తపరచిన అంతర్జాతీయ సముదాయంలో భారతదేశం ముందువరుసలో నిలబడింది. స్వాతంత్య్రం సిద్ధించిన అనంతర కాలంలో, 1993 వ సంవత్సరంలో దక్షిణ ఆఫ్రికా తో దౌత్య సంబంధాల పునరుద్ధరణ చోటు చేసుకుంది. ఆ తరువాత కాలంలో అంటే 1997 వ సంవత్సరంలో మార్చి మాసంలో ఇరు దేశాలు ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నెలకొల్పుకొన్నాయి. తదనంతరం, దక్షిణ ఆఫ్రికాతో ద్వైపాక్షిక స్థాయిలోను, బిఆర్‌ఐసిఎస్‌, ఐబిఎస్‌ఎ ‌తదితర వేదిక ల ద్వారాను మన మధ్య సన్నిహిత, మిత్రపూర్వక సంబంధాలు దృఢ తరంగా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *