అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్‌లను అదుపులోకి తీసుకున్న ఇడి
న్యూ దిల్లీ, నవంబర్ 14 : దిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్‌ను ఇడి అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం అభిషేక్, విజయ్ సిబిఐ అదుపులో ఉన్నారు. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఇద్దరిని ఇడి అదుపులోకి తీసుకుంది. బెయిల్ పిటిషన్‌పై సోమవారం దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కేసులో శరత్ చంద్రారెడ్డి, బినోయ్‌బాబు ఇడి కస్టడీలో ఉన్నారు. శరత్, బినోయ్ సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. దర్యాప్తులో భాగంగా కస్టడీకి ఇవ్వాలని కోర్టులో ఇడి పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌పై మధ్యాహ్నం ఇరువురి వాదనలను ప్రత్యేక కోర్టు విననుంది. దినేస్ అరోరా చెప్పిన వివరాల ప్రకారం సిబిఐ ప్రత్యేక కోర్టు వాంగ్మూలం నమోదు చేసింది. దిల్లీ మద్యం కుంభకోణంలో దినేస్ అరోరా అప్రూవర్‌గా మారారు. సిబిఐ ప్రత్యేక కోర్టు వాంగ్మూలమంతా వీడియో రికార్డు చేసింది.
దిల్లీ లిక్కర్ పాలిసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్ ఇన్-చార్జి విజయ్ నాయర్ , వ్యాపారవేత్త అభిషేక్ బోయిన్‌పల్లికి దిల్లీ కోర్టు సోమవారంనాడు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఇదే కోర్టు లిక్కర్ పాలసీలో మనీ లాండరింగ్ దర్యాప్తునకు సంబంధించి 5 రోజుల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి వీరిని పంపింది. దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహాయకుడైన నాయర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం అరెస్టు చేసింది. ఈ కేసులో సీబీఐ కస్టడీకి వ్యతిరేకంగా ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణకు ముందే ఈయనను ఈడీ అదుపులోనికి తీసుకుంది. ఈ ఏడాది ప్రథమార్థంలో నాయర్, బోయినపల్లిని సీబీఐ అరెస్టు చేయడంతో అప్పట్నించీ వారు జైలులో ఉన్నారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో ఈ ఇద్దరి పాత్ర ఉందని ఈడీ అభియోగంగా ఉంది. మనీ లాండరింగ్ కోణం నుంచి వీరిపై ఈడీ విచారణ సాగిస్తుంది.




