జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18: దళిత బందు కోసం దళితులు గ్రామపంచాయతీ వద్ద నిరాహార దీక్షకు దిగిన సంఘటన జగదేవపూర్ మండలం పరిధిలోని బస్వాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం గ్రామంలో మొత్తం 60 దళిత కుటుంబాలు ఉన్నాయి. అందులో భాగంగా ఐదు యూనిట్లు దళిత బంధు మంజూరైనట్లు తెలిపారు. దళితులకు తెలియకుండానే నిజమైన లబ్ధిదారులకు కాకుండా కొంతమంది రాజకీయ నాయకులకు తొత్తులుగా వ్యవహరించే వారికి దళిత బంద్ యూనిట్లు అందిస్తున్నారని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానిక సర్పంచ్ తన అనుచరులకు దళిత యూనిట్లు అందించడం ఏంటని ప్రశ్నించారు. బిఅరెస్ పార్టీకి అందరు అనుకూలమేనని తెలిపారు. మేము అందరం కూడా బిఅరెస్ పార్టీ కార్యకర్తలమే అని తెలిపారు. ఇందులో ఎవరు వ్యతిరేక పార్టీ వారు ఉన్నారో తెలుపాలి అన్నారు. గ్రామంలోని దళితులమందరం కూడా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మేనని గతంలో కేసీఆర్ గెలుపుకు అహర్నిశలు కృషి చేశామని తెలిపారు. అలాంటి సమయంలో నిజమైన లబ్ధిదారులను ఎన్నిక చేసి అందించాల్సింది పోయి ఇష్టారీతిన ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. నిజానికి నిరుపేదలైన వారికి ఇస్తే ప్రతి ఒక్కరు సంతోషిస్తారని అన్నారు.ఎకరాల కొద్దీ భూములు ఉన్నవారికి దళితబందు ఇవ్వడం సరైంది కాదని తెలిపారు.కలసి మెలసి ఉన్న దళిత మధ్య స్థానిక నాయకులు సిచ్చు పెట్టారని స్వార్ధ రాజకీయాలు మానుకోవాలి అని అన్నారు. తమ స్వార్థం కోసం దళితులను వాడుకోవడం సిగ్గు చేటు అన్నారు.ఎవ్వరికీ తెలియకుండా ఎన్నిక చేయడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. కమిషన్లకు ఆశపడి దళిత బంధం అనుచరులకు ఇస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి నాయకులు, అధికారులు కలగజేసుకొని నిజమైన లబ్ధిదారులకు దళిత బంధు అందించాలని లేకుంటే ఎంతటి ఉద్యమాలకైనా సిద్ధమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సయ్య ,యాదగిరి, మల్లేష్, ప్రశాంత్, రాజు ,నాగరాజు, మల్లయ్య, నరసయ్య , బాలయ్య, పద్మ, చింటూ, లక్ష్మి ,కిష్టవ, నాగమణి, భాగ్య ,యాదమ్మ, బాలయ్య ,ఎల్లయ్య, గౌరీ, రవి, సురేందర్ ,చంద్రయ్య, ముత్తయ్య ,భాస్కర్, పోషవ్వ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




