నేను నల్లగొండలో రాజీనామా చేసొస్తా
బిఆర్‌ఎస్ నేత కెటిఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి సవాల్
అవినీతి డబ్బుతో గెలిచిన అహంకారంలో కెటిఆర్
విూడియా సమావేశంలో మంత్రుల విమర్శలు
హైదరాబాద్, ప్రజాతంరత, మార్చి 1 : మల్కాజిగిరిలో పోటీ చేసి గెలవాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ సిఎం రేవంత్ రెడ్డికి చేసిన సవాల్‌పై రాష్ట్ర మంత్రులు ఘాటు స్పందించారు. దమ్ముంటే సిరిసిల్లలో రాజీనామా చేయి..తమలో ఎవరో ఒకరు పోటీ చేస్తారని ప్రతిసవాల్ విసిరారు. వందలకోట్లు ఖర్చు పెట్టి అత్తెసరు మెజార్టీతో గెలిచిన కెటిఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు కేటీఆర్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. తాను నల్లగొండ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, కేటీఆర్‌ఎస్ కూడా రిజైన్ చేయాలన్నారు. సిరిసిల్లలో తాను పోటీ చేసి గెలుస్తానని, అలా అయితే కారు షెడ్డు మూసుకుంటారా..? అని ప్రశ్నించారు. కేటీఆర్ ఓడితే పార్టీ క్లోజ్ చేస్తానని ప్రకటించేందుకు కేసీఆర్ సిద్ధమా? అని ప్రశ్నించారు. తాను సిరిసిల్లలో ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. కేటీఆర్‌కు టెక్నికల్ నాలెడ్జ్ లేదని చెప్పారు. కేటీఆర్ ఓ చిన్న పిల్లగాడని, తన స్థాయి కేటీఆర్ ది కాదని అన్నారు. కేటీఆర్‌కు క్యారెక్టర్ లేదని, లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయని విమర్శించారు. కేటీఆర్ 200 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 30 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారని, తానైతే రాజీనామా చేసేవాడినని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
మంత్రి పొన్నం మాట్లాడుతూ.. బండి సంజయ్, అర్వింద్ పెద్ద లీడర్లు అనుకుంటున్నారని, ఎంపీ ఎన్నికల తర్వాత పిచ్చి లేసి పోతారని అన్నారు. వీళ్లిద్దరూ పొలిటికల్ లీడర్లు కాదని గాల్లో గెలిచారన్నారు. బ్రేకింగ్ కోసం మాత్రమే మాట్లాడుతారని విమర్శించారు. ఆ నలుగురు ఎంపీలు రాష్ట్రం కోసం ఎప్పుడూ పార్లమెంట్ లో మాట్లాడలేదని అన్నారు. దమ్ముంటే కరీంనగర్ లో కేటీఆర్ పోటీ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. ముందు కరీంనగర్ లో తమపై గెలిచి చూపించి మాట్లాడాలన్నారు. కేసీఆర్ మానసపుత్రిక బొందలగడ్డగా మారడానికి కారణం ఎవరు చెప్పాలన్నారు. మేడిగడ్డలో ఒకట్రెండు పిల్లర్లే కుంగాయంటూ అవహేళన చేస్తున్నారని విమర్శించారు. ఇంట్లో ఒక పిల్లర్ కూలినా ఇల్లు కూలిపోయినట్లేనన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామన్నారు పొన్నం ప్రభాకర్. ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే నాలుగు హావిూలు అమలు చేశామన్నారు. ఇది చూసిన బీఆర్‌ఎస్ నేతలకు కళ్లు మండుతున్నాయని..అందుకే ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అధికారం కోల్పోయే సరికి కేటీఆర్ మతి భ్రమించినట్లు మాట్లాడుతు న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ గెలుపును జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.



