దమ్ముంటే రా…లేక పోతే తోక ముడిచినట్లే

  • హామీలు అమలు చేస్తే మళ్ళీ పోటీచేయ..అయితే రాజీనామా లేఖ జేబులో పెట్టుకో
  • రైతు రుణమాఫీపై కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం   

పార్లమెంటు ఎన్నికల వేళ రైతు రుణమాఫీ అన్నది పార్టీల మధ్య సవాల్‌గా మారింది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణకు దారితీసింది. ఈ విషయంలో రాజీనామాలు, పార్టీలను రద్దు చేసుకునే ఛాలెంజీల వరకు దారితీసింది. కేవలం పార్టీల మధ్యనే కాకుండా వ్యక్తిగత దూషణలు, సవాళ్ళతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తానన్న హామీపైనే రాష్ట్రంలో ఇప్పుడు తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది. ఆరు గ్యారంటీలు 420 అంశాలను అమలు చేస్తామని నమ్మబలికి అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్‌ అన్నమాటను నిలుపుకోలేదన్నది అటు బిఆర్‌ఎస్‌, ఇటు బిజెపి వర్గాలు విమర్శిస్తున్నాయి. శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామాలనే నిలుపుకోలేకపోయిన కాంగ్రెస్‌ ఇప్పుడు తగుదునమ్మా అంటూ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ జాతీయ స్థాయిలో మరికొన్ని హామీలను గుమ్మరించడాన్ని విపక్షాలు ఎత్తిచూపుతున్నాయి.

డిసెంబర్‌ 9న రుణ మాఫీ గ్యారంటీగా అమలు చేస్తామని, రైతులు కొత్త అప్పుల కోసం బ్యాంకుల వద్దకు పరిగెత్తాలని శాసన సభ ఎన్నికల సందర్భంగా రేవంత్‌ రెడ్డి పేర్కొన్న విషయాన్ని విపక్షాలు ఎత్తిచూపుతున్నాయి. డిసెంబర్‌ దాటి నాలుగు నెలలవుతున్నా గ్యారంటీకి గ్యారంటీ లేకుండాపోయిం దన్నది ఆ పక్షాలు వాదిస్తున్నాయి. గత శాసనసభ ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారంటీలను కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ గ్యారంటీలన్నిటినీ వంద రోజుల్లోనే అమలు పరుస్తామని కూడా ఆ పార్టీ చెప్పిన మాటలను నమ్మిన ప్రజలు ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే అధికారం చేపట్టిన వెంటనే ఆ గ్యారంటీల అమలు విషయంలో కాంగ్రెస్‌ తీవ్రస్థాయిలో కసరత్తు మొదలుపెట్టిప్పటికీ,  వందరోజుల్లో దాదాపు అయిదు గ్యారంటీలను మాత్రం అమలు చేసినట్లు ఆ పార్టీ చెప్పుకుంటుంది, ఆరవ గ్యారంటీ విషయానికి వొచ్చేప్పటికీ పార్లమెంటు ఎన్నికల కోడ్‌ అడ్డం వచ్చిందంటుంది. ఒక్కో రైతుకు రెండు లక్షల రుణ మాఫీ విషయంలో పారదర్శకంగా వ్యవహరించేందుకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ ఆలోచిస్తున్న నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికలు ముంచుకువచ్చాయి.

అదే విషయాన్ని ఈ ఎన్నికల సందర్భంగా ప్రజలకు విన్నవిస్తున్న కాంగ్రెస్‌, ఎన్నికల తంతు ముగిసిన వెంటనే ఆగస్టు 15లోపుగా రైతుల రుణమాఫీని తప్పకుండా అమలుచేసి చూపిస్తామని హామీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా వివిధ జిల్లాలు పర్యటిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రుణమాఫీ విషయంలో రైతులు అధైర్యపడవద్దని, ఆగస్టు 15లోగా మాఫీ అవుతుందని చెబుతున్న దాన్ని, బిఆర్‌ఎస్‌, బిజెపిలు ఛాలెంజీ చేస్తున్నాయి. కాంగ్రెస్‌ ఇప్పటికే అనేక హామీలను నిలుపుకోలేక పోయినప్పుడు రుణమాఫీ హామీని కూడా ఎలా నిలుపుకుంటుందని ఆ పక్షాలు నిలదీస్తున్నాయి. ఇప్పటికే రైతు భరోసా కింద ఇస్తామన్న ఎకరానికి 15 వేలు, వ్యవసాయ కూలీలకు ఇస్తామన్న 15 వేలు, క్వింటాల్‌ ధాన్యానికి ఇస్తామన్న అదనపు బోనస్‌ 500 రూపాయలు అమలుకు నోచుకోకపోవడాన్ని ఆ పక్షాలు గుర్తుచేస్తున్నాయి. అలాంటి పరిస్థితిలో రాష్ట్రంలోని రైతులందరి రుణాలను మాఫీ చేయాలంటే కనీసం 35వేల కోట్ల రూపాయలు అవసరం. అంత సొమ్మును కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎక్కడి నుండి తీసుకువస్తుందన్నది వారి సవాల్‌. అంతేగాక మహాలక్ష్మీ పథకం కింద ప్రతీ మహిళకు నెలకు 2500 ఇస్తామన్న ఈ ప్రభుత్వం గత నాలుగునెలలుగా ఇవ్వటంలేదు. వాటన్నిటినీ ఏకమొత్తంగా ఇచ్చేదీ..లేనిది

ఇంతవరకు చెప్పలేదు. అలాంటిదే కల్యాణ లక్ష్మీ పథకం కింద అడబిడ్డలకు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ కూడా అమలు కావడం లేదు. ఈ నాలుగు నెలల కాలంలో వేల సంఖ్యలో పెండ్లిళ్ళు జరిగి ఉంటాయి.  అలాగే నిరుద్యోగ భృతి, చేయూత పథకం ఇలా అనేక పథకాల విషయంలో కాంగ్రెస్‌ మాట తప్పిందంటున్నాయి ఆ పక్షాలు. కాగా, ఈ పథకాలతో పాటు, రైతు రుణమాఫీ ఏకకాలంలో ఆగస్టు 14 అర్థరాత్రిలోపు అమలు కాకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని సిద్దిపేట బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ, మాజీమంత్రి హరీష్‌ రావు డిమాండ్‌ చేయడం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ తాను చెప్పిన ప్రకారం రేవంత్‌రెడ్డి పథకాలను అమలుచేస్తే తాను రాజీనామాకు సిద్దంగా ఉన్నానని, తర్వాత ఎన్నికల్లో పోటీచేయనని కూడా ఆయన ప్రకటించడం కాంగ్రెస్‌కు ఛాలెంజీగా మారింది.

అంతే కాదు తామిద్దరు రాజీనామా లేఖలను శుక్రవారం ఉదయం పది గంటలకు అమర వీరుల స్తూపం దగ్గర మేధావులకు అందజేయాలని, తాను ఛాలెంజీ చేసినట్లు పథకాలు అమలవుతే తన రాజీనామాని స్పీకర్‌కు, కాని పక్షంలో రేవంత్‌రెడ్డి రాజీనామాను గవర్నర్‌కు ఆ మేధావులు అందజేస్తారని పేర్కొన్న హరీష్‌రావు.. ‘అందుకు సిద్ధమా? దమ్ముం దా.. రా.., మాటమీద నిలబడు.. రాకపోతే తోకముడిచినట్లే..అన్న మాటలను  సిఎం రేవంత్‌రెడ్డి కూడా సీరియస్‌గానే తీసుకున్నారు. ఆగస్టు 14 అర్థరాత్రిలోగా తానిచ్చిన హామీని అమలుచేసి చూపిస్తా..రాజీనామా లేఖ జేబులో పెట్టుకుని సిద్ధంగా ఉండు. నామాట నిలబెట్టుకుంటే బిఆర్‌ఎస్‌ పార్టీని రద్దు చేసుకుంటారా..అంటూ ఆయన ప్రతి ఛాలెంజీ చేయడంతో అందరి దృష్టి ఇప్పుడు ముందుగా శుక్రవారం ఏమవుతుందన్నది, ఆ తర్వాత ఆగస్టు 15 వైపుకు మళ్ళింది. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు రెండు స్థానా లొచ్చినా తాను రాజీనామాకు సిద్ధమని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరో ఛాలెంజీ విసరడం ఇందులో కొసమెరుపు.
ి -మండువ రవీందర్‌రావు
సీనియర్‌ జర్నలిస్ట్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *