దమ్ముంటే మల్కాజిగిరిలో పోటీ చేయ్‌..

  • సిఎంకు రేవంత్‌కు బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ సవాల్‌
  • బిజెపి రైతు రుణమాఫీ గురించి మాట్లాడడం..దయ్యాలు వేదాలు వల్లించడమే
  • ఈటల వ్యాఖ్యలపై కెటిఆర్‌ ధ్వజం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 27 : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి సవాల్‌ విసిరారు. దమ్ముంటే రాజీనామా చేసి..ఎంపీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేయాలని రేవంత్‌కు కేటీఆర్‌ ఛాలెంజ్‌ చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ సమావేశంలో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. బీఆర్‌ఎస్‌ పని అయిపోయింది..కెసీఆర్‌ శకం ముగిసింది…ఒక్క ఎంపీ సీటు కూడా గెలవరు అని రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కెటిఆర్‌ కౌంటర్‌ ఇస్తూ..దమ్ముంటే ఒక్క సీటు గెలిచి చూపెట్టాలని రేవంత్‌ సవాల్‌ విసిరారు. రేవంత్‌ రెడ్డి నువ్వు గొప్పోడివి కాదా..? ఒక్క సీటు కూడా గెలవరు అన్నావు కదా..మల్కాజ్‌గిరి సీటులో పోటీ చేద్దాం..తేల్చుకుందాం రా..అంటూ సవాల్‌ విసిరినా కానీ స్పందన లేదని, మళ్లీ నోరు ఎత్తలేదని కేటీఆర్‌ గుర్తు అనాంనరు. మల్కాజ్‌గిరిలో ఈ ఐదేండ్లలో రేవంత్‌ ఒక్క పని చేయలేదని, ఎవర్నీ పలుకరించినా పాపాన పోలేదని, కాబట్టి ఆవేశానికి పోతే ఓడిపోతానని రేవంత్‌ భయపడ్డాడని, అందుకే పలుకలేదన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మల్కాజ్‌గిరిలో నిలబడేందుకు భయపడుతున్నాడని, ఏప్రిల్‌ 18న నామినేషన్లు.. సమయం చాలా ఉంది కాబట్టి రేవంత్‌కు ధైర్యం వచ్చి రాజీనామా చేసి వస్తే నేను వస్తా.. తప్పకుండా నిలబడుతాను. నాకు తెలుసు ఆయన రాడు..పిరికోడు…నరుకుడు ఎక్కువ..అసలు విషయానికి వొస్తే పారిపోతాడని కెటిఆర్‌ ఎద్దేవా చేశారు. చాలా పెద్ద మాటలు, డైలాగులు చెబుతాడని, కానీ ఆచరణలో మాత్రం చూపించడని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. మల్కాజ్‌గిరిలో జరిగే పోటీ.. కేవలం వ్యక్తుల మధ్య కాదని, పోటీ మూడు పార్టీల మధ్య. కేసీఆర్‌ నిలబడ్డారని భావించి పని చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎంపీ నియోజకవర్గం పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో తుఫానులా మెజార్టీ ఇచ్చారని, మూడు లక్షల యాభై వోట్ల మెజార్టీ వొచ్చిందని, కాబట్టి ఇప్పుడు ఇతర పార్టీలు మూడున్నర లక్షలు దాటి ముందుకు వొచ్చి గెలవాలన్నారు.

అయినా కూడా ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని, కార్పొరేట్‌ ఎన్నికల్లో మాదిరిగానే ప్రతి ఇంటికి వెళ్లాలని సూచించారు. దేశంలోనే అత్యంత పెద్ద నియోజకవర్గం మల్కాజ్‌గిరి అని, కాబట్టి ప్రతి వాడ తిరిగి ప్రచారం చేయాలని, రాగిడి లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులు బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నారని కేటీఆర్‌ తెలిపారు.

బిజెపి రైతు రుణమాఫీ గురించి మాట్లాడడం..దయ్యాలు వేదాలు వల్లించడమే
మల్కాజ్‌గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులు రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటదని కేటీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ…ఈటల రాజేందర్‌..హుజురాబాద్‌, గజ్వేల్‌లో ఓడిపోయి.. ఇక్కడ టికెట్‌ తెచ్చుకున్నాడన్నారు. మేడ్చల్‌లో రాజేందర్‌ మాట్లాడుతూ రైతులపై ప్రేమ కురిపించాడని, 2 లక్షల రుణమాఫీ ప్రకటిస్తే తాను పోటీ నుంచి తప్పుకుంటానని కాంగ్రెస్‌ సర్కార్‌కు సవాల్‌ విసిరాడని, ఆయన టీఆర్‌ఎస్‌లో ఉన్నా అనుకుంటున్నాడని, బీజేపోళ్లు రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటదని ఆయన ఎద్దేవా చేశారు.

మోదీ 10 ఏండ్లలో బడా బడా బాబులు, కార్పొరేట్‌ సేట్లు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు, అదానీ, అంబానీల రుణాలు పద్నాలుగున్నర లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిండని, అలాంటి పార్టీలో కూర్చుని రుణమాఫీ గురించి మాట్లాడితే చాలా చండాలంగా, దరిద్రంగా ఉందని ఈటల రాజేందర్‌పై కేటీఆర్‌ విరుచుకుపడ్డారు. దమ్ము, ధైర్యం ఉంటే.. మోదీ ప్రభుత్వం కంటోన్మెంట్‌, మల్కాజ్‌గిరికి ఏం చేసిందో చెప్పి వోటు అడుగాలని హితవు పలికారు. ఈ పదేండ్లలో ఏం చేసిండ్రని గట్టిగా అడిగితే జై శ్రీరాం అంటున్నరని, అది తప్ప ఏం లేదని అన్నారు. ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో 11,560 కోట్ల రూపాయాలు ఇవాళ బీజేపీ ఖాతాలో ఉన్నాయని, దిల్లీ లిక్కర్‌ స్కాంలో ఒకాయన వద్ద రూ. 60 కోట్లు తీసుకుని బయటకు పంపింది వాస్తవం కాదా..లంటూ ప్రశ్నించారు.

మోదీ నీతిమంతుడని అంటున్నారని, 609వ స్థానంలో ఉన్న అదానీని 2వ స్థానంలో కూర్చోబెట్టినందుకా మోదీ నీతిమంతుడా..అంటూ ప్రశ్నించారు. బీజేపోళ్లు గోస ముఖం పెట్టంగానే ఆగం కావొద్దని, రాజేందర్‌ మంచి డైలాగులు కొడుతారని, హుజురాబాద్‌లో సాదుకుంటారా.. సంపుకుంటారా అని డైలాగులు వేశారని, వోటు వేసిన పాపానికి హుజురాబాద్‌ను మళ్లీ చూడలేదని విమరిÊ:చారు కెటిఆర్‌. రాగిడి లక్ష్మారెడ్డికి రాజేందర్‌లాగా సీనియార్టీ లేకపోయినా.. సీన్సియారిటీ ఉందని, కాంగ్రెస్‌, బీజేపీల నుంచి పోటీ చేస్తున్న ఆ ఇద్దరు కేసీఆర్‌ వద్ద పదవులు పొంది వెన్నుపొటు పొడిచి పోటీలో నిలబడ్డారని, కష్టకాలంలో కేసీఆర్‌ వెంట నడుస్తున్నా లక్ష్మారెడ్డిని గెలిపించాలని, ఇక్కడ లక్ష్మారెడ్డి కాదు.. కేసీఆర్‌ నిలబడ్డారని గెలిపించాలని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *