- ఆధారాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్
- ధరణి పోర్టల్‌తో కెసిఆర్ కుటుంబం దోచుకుంటున్నది
- అందుకే రద్దు చేస్తామంటే భయపడుతున్నారు
- కేంద్రం తలుచుకుంటే ధరణి వెనకున్న ఆర్థిక నేరాలు బహిర్గతం చేయొచ్చు
- పెట్టుబడిదారులు ఎవరో కేంద్రం నిగ్గు తేల్చాలి
- టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
- భూమి డిక్లరేషన్ విడుదల చేసిన పిసిసి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 6 : ప్రజలకు, మీడియాకు ధరణికి సంబంధించి టెర్రాసిస్ కంపెనీ మాత్రమే కనిపిస్తుందని, కానీ దీని వెనక పెద్ద మాఫియా దాగుందని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అందుకు సంబంధించి ధరణి ఫైల్స్‌ను ఆధారాలతో సహా సీరియల్‌గా బయటపెడతామని, దోపిడీలపై అన్ని ఆధారాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని వెల్లడించారు. ధరణిలో పెట్టుబడిదారులు ఎవరో కేంద్ర ప్రభుత్వం నిగ్గు తేల్చాలని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. ధరణి రూపేణా ప్రజల ఆస్తులు, భూములు, వ్యక్తిగత వివరాలు విదేశీయుల చేతుల్లోకి వెళుతున్నాయని ఆయన ఆరోపించారు. గురువారం గాంధీ భవన్‌లో రేవంత్ మీడియాతో మాట్లాడుతూ..ధరణి పోర్టల్‌లో బ్రిటిష్ ఐల్యాండ్‌కు సంబంధించిన పెట్టుబడులు ఉన్నాయని, ధరణి మొత్తం యువరాజు మిత్రుడు గాదె శ్రీధర్ రాజు చేతుల్లో ఉందని, దారిదోపిడీ దొంగల కంటే భయంకరమైన దోపిడీ జరుగుతుందని ఆరోపించారు. లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు మాయం అవుతున్నాయని, అన్ని వివరాలు తమ దగ్గర ఉన్నాయని రేవంత్ తెలిపారు.
ధరణి పోర్టల్ నిర్వహణ విదేశీయుల చేతుల్లోకి వెళ్లిపోయిందని, అందరి వివరాలు విదేశీయుల గుప్పిట్లో ఉన్నాయని, ఇది అత్యంత ప్రమాదకరమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న సంస్థలో పెట్టుబడి పెట్టిన వారు ఆర్థిక నేరగాళ్లని, వారిలో విదేశీయులు ఉన్నారని, పోర్టల్ ఏ దేశ పౌరుడి చేతిలో ఉందో, అతడు ఎలాంటివాడో, దావూద్ ఇబ్రహీం కంటే పెద్ద మాఫియా నాయకుడో, ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ అమ్ముకునే డ్రగ్ లార్డో మనకు తెలియదని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ పోర్టల్ ద్వారా మన వివరాలన్నీ విదేశీయుల చేతుల్లోకి వెళ్తున్నాయని, అనేక చేతులు మారి చివరకు.. ధరణి పోర్టల్ బ్రిటిష్ ఐల్యాండ్ చేతికి వెళ్లిందని అన్నారు. ధరణిలోని అనేక లోటుపాట్లను ఆసరాగా తీసుకొని నిషేధిత జాబితాలోని భూములను అనుచరులకు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని, ప్రభుత్వ భూములను అనుచరులకు రిజిస్ట్రేషన్ చేసి వెంటనే ప్రొహిబిషన్ లాక్ చేస్తున్నారని, ధరణి పోర్టల్ మొత్తం కేటీఆర్ మిత్రుడు శ్రీధర్ గాదె చేతిలో ఉందని, శ్రీధర్ గాదె వద్ద ఉన్న తాళంతో ధరణిని ఎప్పుడైనా తెరవొచ్చని, ఒకరి పేరు మీద ఉన్న భూమిని మరొకరి పేరు మీద మార్చేయొచ్చు అని రేవంత్ రెడ్డి వివరించారు.
ప్రభుత్వ భూములకు యజమానులను సృష్టించడం, అనంతరం ఆ భూములను బదలాయించడం, ఆ తర్వాత వాటిని లే అవుట్లు వేసి అమ్ముకోవడం… ఈ తతంగం ఇలా నడుస్తుందని రేవంత్ వెల్లడించారు. ధరణి పోర్టల్ సాయంతో కేసీఆర్ కుటుంబం దోచుకుంటుందని అన్నారు. దీనికంతటికీ కారకుడు శ్రీధర్ గాదె అలియాస్ గాదె శ్రీధర్ రాజు అని, హైటెక్ సిటీ ప్రాంతంలో క్వాంటెల్లా అనే సంస్థ పేరిట ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, కోదండరెడ్డి కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి అనేక భూ అక్రమాలు జరుగుతున్నట్టు ప్రాథమిక వివరాలు రాబట్టిందని రేవంత్ రెడ్డి వివరించారు. దేవాదాయ భూములను అక్రమంగా ఫార్మా కంపెనీలకు కట్టబెట్టాలని చూశారని, ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తానంటే కేసీఆర్ భయపడుతున్నారన్నారు. ఈ విషయంలో సీఎం.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ధరణిని రద్దు చేసి అంతకంటే మెరుగైన పోర్టల్‌ను తీసుకొస్తామని, కేసీఆర్ భూ అక్రమాలను కూడా బయటపెడతామని రేవంత్ స్పష్టం చేశారు. ధరణిలో జరిగిన అక్రమాలను జులై 15 తర్వాత బయటపెడతామని, కేంద్రం తలచుకుంటే ధరణి వెనకున్న ఆర్థిక నేరాలను బహిర్గతం చేయొచ్చని రేవంత్ పేర్కొన్నారు.
గజ్వేల్ లో 1500 ఎకరాల అసైన్డ్ భూములను చట్టవిరుద్దంగా ప్రభుత్వం గుంజుకుందన్నారు. అమూల్ డైరీకి వందల ఎకరాల కట్టబెట్టారు. మంత్రి గంగుల కమలాకర్‌కు భూములు కేటాయించారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి దేవాదాయ భూములను ఫార్మా కంపెనీలకు కట్టబెట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే ధరణి రద్దు చేస్తామంటే తండ్రి కొడుకులు పెడబొబ్బలు పెడుతున్నారన్నారు. కేటీఆర్ దిల్లీ పర్యటనతో బీజేపీ, బీఆర్‌ఎస్ ఫెవికాల్ బంధాన్ని బలోపేతం చేసేందుకు బీజం పడిందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎన్నికల అభ్యర్థులను మొట్టమొదట ప్రకటించాలని పార్టీలో చర్చలు జరిపామని, పేదల పక్షాన కాంగ్రెస్ ఉందని చాటే ప్రయత్నం చేసే దిశగా అధిష్టానం ఆదేశాలు ఇచ్చిందని రేవంత్ తెలిపారు. ఈటల రాజేందర్‌ను ఫిరాయింపుల కమిటీ నుంచి ఎన్నికల కమిటీకి మార్చారని, ఆయనను బీజేపీ మోసం చేసిందని, భద్రత పెంచినా… అనుమానితుడిపై ఎందుకు కేసు పెట్టలేదని రేవంత్ ప్రశ్నించారు. ఎవరి వల్ల ప్రమాదం ఉందో రాజేందర్ స్పష్టంగా చెప్పారని, అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. తన రక్షణ విషయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోని ప్రభుత్వం…రాజేందర్‌కు భద్రత ఏర్పాటు చేయడం సంతోషమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.




