- మరణించిన 22లక్షల మంది వివరాలు వెల్లడించాలి
- బీహార్‌లో ఓట్ల తొలగింపు వ్యవహారంపై విచారణ
- ఎన్నికల సంఘానికి గట్టి దెబ్బ
- ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశం
న్యూదిల్లీ, ఆగస్టు 14: సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నికల సంఘానికి గట్టి దెబ్బ తగిలింది. బీహార్ ఓటరు జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది పేర్లను ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని, వారి పేర్లను తొలగించడానికి గల కారణాలను కూడా అప్‌లోడ్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రతి ఓటరు దానిని యాక్సెస్ చేయగలిగేలా ఈ జాబితాను ప్రచారం చేయాలని సూచించింది. ఈ నెల 22 నాటికి సంబంధిత నివేదికను తమ ముందుంచాలని సూచించింది. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న బీహార్‌లో ఓటర్ జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ సూర్యకాంత్ విచారించారు. తొలగించిన 65 లక్షల మందిలో 22 లక్షల మంది మరణించారని ఎన్నికల సంఘం కోర్టుకు తెలపగా మరణించిన వారి పేర్లను బూత్ స్థాయిలో ఎందుకు వెల్లడిరచలేదని ప్రశ్నించింది. పౌరుల హక్కులు రాజకీయ పార్టీలపై ఆధారపడి ఉండాలని తాము కోరుకోవడం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. 65 లక్షల మంది పేర్లను, వారిని తొలగించడానికి గల కారణాన్ని గరిష్ట సర్క్యులేషన్ ఉన్న స్థానిక భాషా వార్తాపత్రికల ద్వారా, దూరదర్శన్, ఇతర చానెళ్ల ద్వారా ప్రచారం కల్పించాలని సూచించింది. జిల్లా ఎన్నికల అధికారికి సోషల్ విూడియా హ్యాండిల్ ఉంటే అక్కడా నోటీసును ప్రదర్శించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ జాబితాలో పేరు ఉన్న వ్యక్తులు తమ పేరును ఎందుకు తొలగించకూడదో పేర్కొంటూ తమ ఆధారాలను జిరాక్స్ కాపీలతో సమర్పించుకోవడానికి అవకాశాలు కల్పించాలని పేర్కొంది. ఓటరు జాబితా నుంచి తొలగించిన పేర్లను అన్ని పంచాయతీ భవనాలు, బ్లాక్ డెవలప్‌మెంట్, పంచాయతీ కార్యాలయాల నోటీసు బోర్డుపై కూడా ప్రదర్శించాలని, తద్వారా ప్రజలు జాబితాను మాన్యువల్‌గా యాక్సెస్ చేసుకునే వీలుంటుందని తెలిపింది. ఎన్నికల సంఘం తన వాదనలు వినిపిస్తూ ఓటర్ల జాబితా సవరణ వంటి నిర్ణయాలు తీసుకునేందుకు ఈసీకి అధికారాలు ఉన్నాయని తెలిపింది. రాజకీయ వాతావరణంలో పనిచేస్తున్న నేపథ్యంలో వివాదాస్పదం కాని నిర్ణయమంటూ ఏదీ లేదని, పార్టీల పోరు మధ్యలో చిక్కుకున్నామని, గెలిస్తే ఈవీఎంలు మంచివి.. ఓడిపోతే చెడ్డవని ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. ఓటర్ల జాబితాలో మరణించిన, వలస వెళ్లిన, ఇతర నియోజకవర్గాలకు తరలిన ఓటర్ల పేర్లను ఎందుకు వెల్లడిరచలేదని ఈసీని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. తొలగించిన వ్యక్తుల జాబితాను పార్టీలకు ఇచ్చినట్లు ఈసీ వెల్లడిరచింది. జిల్లాస్థాయిలో ఈ వివరాలను పంచుకునేందుకు సిద్ధమని తెలిపింది.
తొలంగించిన 65లక్షల పేర్లను ప్రచురించండి


