సుమారు ఎనమిది దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర తెలుగు శతక ప్రక్రియకు ఉంది. అంతటి మహోన్నత నేపథ్యం కలిగిన శతకం కాలానుగుణమైన మార్పులను అవలోకిస్తూనే అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. తెలుగు శతకం విస్తరిల్లిన తీరును లోతుగా పరిశీలిస్తే సంస్కృత, ప్రాకృత, కన్నడ సాహిత్యాల ప్రభావం ఆ రచనా ప్రక్రియపై ప్రస్పుటంగా ఉన్నట్టు తెలుస్తుంది. తొలి రోజుల్లో భక్తి, వైరాగ్య, నీతి శతకాలు ఎక్కువగా కనిపించాయి. వర్తమానంలో సామాజిక సమీప్యతను కలిగిన శతక రచననే ఎక్కువగా గమనించవచ్చు. కన్నడం, తెలుగులలో నాగవర్మ చంద్రచూడామణి, మల్లికార్జున పండితారాధ్యుడు తొలి దశలలో శతక రచన చేసినట్టు ఆధారాలు ఉన్నాయి. మల్లికార్జున పండితారాధ్యుడు, యధావాక్కుల అన్నమయ్య, పాల్కురికి సోమనాథుడు శతక కవిత్రయంగా పేరొందారు. వందలాది శతకాలను రచించిన తెలుగు కవులు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. తెలంగాణ ప్రాంతానికి వచ్చేసరికి పాల్కురికి సోమన, పోతన, బద్దెన, శేషప్ప వంటి శతక కవులు స్మృతిపథంలో మెదలుతారు. అనాదిగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ముఖ్యంగా యాదాద్రి భువనగిరి ప్రాంతంలో శతక సాహిత్యం ఎంతో గొప్పగా విరాజిల్లింది. పాల్కురికి తరువాత శతకాలు విరివిగా రాసింది యాదాద్రి భువనగిరి ప్రాంత కవులేనని సాహిత్యజ్ఞులు చెబుతారు.
తేట తెలుగు పలుకు తేనె చినుకు అన్న మకుటంతో మంచి భాషా సౌందర్యంతో , భావనాపటిమతో, అద్భుతమైన శైలీ ధారతో 125 పద్యాలను తేట తెలుగు శతకముగా డాక్టర్ పాండాల మహేశ్వర్గౌడ్ అందించారు. సామాజిక, ఆధ్యాత్మికత నిండుకున్న గుణాత్మకమైన పద్యాలు ఇందులో ఉన్నాయి.
తొలి పద్యంలో శ్రీ గణేశుని అక్షరార్చన చేసి శతకానికి కవి శ్రీకారం చుట్టారు.
శ్రీ గణేశు గొలతు శ్రీకారమును చుట్టి
వాణి నలరు మనియు వాణి గొలతు!
మువ్వురమ్మలకును ముదమార మ్రొక్కుదు
తేట తెలుగు పలుకు తేనె చినుకు!
పండితులను ఒప్పించే పాండిత్యం, పామరులను అలరించే భాష తన వద్ద లేదంటూ రాసిన ఈ పద్యం ఎంతో ఆలోచనాత్మకంగా ఉంది.
పండితులకు జెప్పు పాండిత్యమునులేదు
పామరులకు జెప్పు భాషరాదు!
భావ మున్న చాలు భాషలో నేముండు?
తేట తెలుగు పలుకు తేనె చినుకు!
కలసి మెలసి ఉండడంలోని గొప్పతనాన్ని అంతే గొప్పగా చెప్పే ప్రయత్నం ఈ పద్యంలో కవి అద్భుతంగా చేశారు.
కాకులందు గూడి కావు కావనుకుము
లోకులెల్ల పలుకు కాకులగుట!
కలిసియుండు గాని కలహంసవలెనుండు
తేట తెలుగు పలుకు తేనె చినుకు!
కన్న వారి కలలను నిజం చేసే గొప్ప ఆస్తి పిల్లలే అన్న ఈ పద్యం ఎన్నో విశ్లేషణలను ముందుంచుతుంది.
కన్నవారి కలలు కన్న పిల్లలు గదా
ఆస్తి పాస్తి కన్న జాస్తిమీరు!
కలలు కల్లలైన కలుగవే వెతలెన్నొ?
తేట తెలుగు పలుకు తేను చినుకు !
గొప్ప లక్ష్యం, శ్రమించే తత్వం ఉంటే ఉన్నతోన్నత శిఖరాలు అవలీలగా ముందు మోకరిల్లుతాయని చెప్పారు.
మంచి లక్ష్యమెంచి మనసు వీణను మీటు
భక్తి శ్రద్ద లెంచు భవ్య పథము!
హరుని నమ్మినడచు ఆత్మీయుడైవెల్గు
తేట తెలుగు పలుకు తేనె చినుకు !
విద్య మనిషిని క్రాంతిపధాల వైపు నడిపిస్తుంది. మగత నుండి మేల్కొల్పి, జడత నొదిలించి చైతన్య మార్గాలను చూపే మహోన్నత శక్తి విద్య. లోకంలో సర్వస్వం విద్యనే అన్నారు ఈ పద్యంలో కవి.
సకల సుఖము కల్గు సత్కీర్తి నీకబ్బు
విద్యవల్ల నీకు విలువ పెరుగు!
విద్య గురుడు హితుడు విశ్వాసబంధువు
తేట తెలుగు పలుకు తేనె చినుకు !
నడిచే దారిని నిర్దేశించే మార్గదర్శి గురువు. గురువు దారిలో నడిస్తే శిష్యులకు సౌశీల్యమైన గుణం సిద్ధిస్తుందన్నారు.
నీవునడచు దారి నిజమని నమ్మకు
ప్రగతి దారి నెంచి పథము నడచు!
గురువు మార్గ మెంచి గుణమును పెంచరా
తేట తెలుగు పలుకు తేనె చినుకు !
ఇహలోకపు సుఖాల కోసం మోసాలను నేర్చుకోవడం సరైంది కానే కాదంటారు.
ఇహ సుఖాలు తలచి ఇంపుగా మోసాలు
మోక్షమేమి లేక మోసమెంచి!
ఎరను చూసి చేప ఎంగిలి పడ్డట్లు
తేట తెలుగు పలుకు తేనె చినుకు !
హృదయమంతా ఉప్పొంగి పులకింపజేసే దేశభక్తి మనిషికి గొప్ప తేజస్సును ఇస్తుందన్నారు.
తెల్ల మేఘమాల తేజమౌ చంద్రుచే
దేశ భక్తి హృదికి తేజమిచ్చు!
పిల్లబోసి నవ్వు తల్లి కందమునిచ్చు
తేట తెలుగు పలుకు తేనె చినుకు!
కష్టపడితేనే కన్న కలలు నెరవేరుతాయని కవి భరోసాతో ఇలా చెప్పారు.
అందమైన బతుకు అద్దాల మేడరా
రాళ్ళు విసరవద్దు రందిపడకు!
కమ్మనైన కలలు కష్టించి తీడేరు
తేట తెలుగు పలుకు తేనె చినుకు!
తీర్థ యాత్రలు చేసి ఎన్నో దేవుళ్ళను దర్శించినప్పటికీ భక్తి లేని పూజ భావశూన్యతతో సమానమని తెలిపారు.
సకల తీర్థ యాత్ర సాగిచేసిన నేమి
హరిని మదిన నమ్మి హరుని దలచు!
భక్తి లేని పూజ భావ శూన్యంబురా
తేట తెలుగు పలుకు తేనె చినుకు!
గతాన్ని విడిచి ఆ గతానికి లక్ష్య సాధకుడవై సాగిపొమ్మని ఈ పద్యంలో కవి దిశానిర్దేశం చేశారు.
గతము తలచి హృదిని
గతిని మార్చుకుంటూ
భవిత గాంచి నడచు భవ్య పథము !
కలుగు శుభము నీకు కష్టించు రోజునే
తేట తెలుగు పలుకు తేనె చినుకు !
భక్తితో గొప్ప ముక్తి మానవాళికి లభిస్తుందని కవి ప్రగాఢంగా నమ్మారు.
భక్తి కన్న గొప్ప భావంబును లేదు
ముందు జన్మకైన ముక్తినిచ్చు !
గోపి గీత బోధ
గొప్పదే భువిలోన
తేట తెలుగు పలుకు
తేనె చినుకు !
సమత మమత ప్రాధాన్యతను చాటి చెప్పిన గొప్ప పద్యమిది.
సమత మమత చాటె సాందీప శిష్యులు
ఒకరినొకరి ఆత్మ నొకటిగాదె!
కోరి అటుకు తిన్న గోపికుచేలురు
తేట తెలుగు పలుకు తేనె చినుకు!
నిక్కమైన జపము ఒక్క మారె చాలు అని ఇలా వివరించారు.
మాట బొంకులేని మనుషుడే దేవుడు
సకల జగతిలోన సర్వ శ్రేష్టు !
సూర్య కాంతి లాగ సూక్తిని చిందించు
తేట తెలుగు పలుకు
తేనె చినుకు !
మతముల కన్నా మిన్న మానవత్వమేనని స్పష్టంగా ప్రకటించారు.
సాయి మందిరాలు చర్చీమసీదులు
సత్యమతము తీరు శాంతి మతము !
మతము కన్న మిన్న మానవత్వముకాద
తేట తెలుగు పలుకు తేనె చినుకు !
మధ్య తరగతి మందహాసాన్ని ఎంతో స్పష్టంగా అక్షరీకరించారు.
లక్షలున్నవాడు లక్షణంబుగ నుండె
కూలివాడు కూడ కుదుట పడెను !
మధ్య నున్న వాడు మసిబారి పోయెరా
తేట తెలుగు పలుకు తేనె చినుకు !
కట్టుకున్న భార్య, కన్న పిల్లలు కనకంబు కాసులను కోరితే తల్లి మనసు మాత్రం పిల్లల మనసెరిగి తోడ్పడుతుందని చెప్పిన పద్యమిది.
కట్టుకున్న భార్య కనకంబు కోరును
కన్న పిల్లలవని కాసుకోరు !
తల్లి మనసు ఎపుడు పిల్లల మనసెర్గు
తేట తెలుగు పలుకు తేనె చినుకు !
కోపముంటే ఎంత నష్టం జరుగుతుందో తెలిపిన పద్యమిది.
కోప మొద్దు నీకు కోర్కెలు తీరవు
ప్రగతి కుంటుపడును ప్రజ్ఞతగ్గు!
ధర్మరాజు శాంతి దండిదే భువిలోన
తేట తెలుగు పలుకు తేనె చినుకు !
నిన్న, రేపు కన్న నేటి రోజునే మిన్న అని చెప్పిన గొప్ప పద్యమిది.
నిన్న నేడు లేదు నేడు రేపనుకోకు
నేటి క్షణము నీకు మేటి దౌను !
కాల మిలున తెలసి కార్యాన్ని చేపట్టు
తేట తెలుగు పలుకు తేనె చినుకు !
కలిమి లేములను సమంగా స్వీకరించి సాగడమే జ్ఞాని లక్ష్యమని చెప్పారు.
చెరుకు గడరసమును చెరిపి దీసినగాని
పిప్పికొరకు చిన్న చీమచేరు !
కలిమి లేమి లేవు కళహంస జ్ఞానికి
తేట తెలుగు పలుకు తేనె చినుకు !
మిడిసిపడిన మనిషికి చివరకు దుర్దశే మిగులుతుందని చెప్పారు.
పగటికాలమందు పక్షి ఎత్తు ఎగురు
పొద్దు గూకె గూడు పొసగచేరు!
మిడిసి పడిన మనిషి కడకు కాటికి చేరు
తేట తెలుగు పలుకు తేనె చినుకు !
కాకి కమ్మని వార్తలను మోసుకొస్తుందని, కోకిల కోమలంగా పాడుతుందని చెబుతూ మనిషే మానవతను మర్చిపోయాడని వేదన పడ్డారు. బతుకు దెరువు కోసం బాధ్యతను చేపట్టడంతోనే సిరి సంపదలు సమకూరుతాయని తెలిపారు.
ఇల్లు అలుకగానె ఇంటిలో పండుగ
జరుగ బోదు సిరులు దరికిరావు !
బతుకు తెరువు కొరకు బాధ్యతా చేపట్టు
తేట తెలుగు పలుకు తేనె చినుకు !
గురువు దారిలో నడిచి మంచి గుణములను వారి నుండి సాధించాలని హితవు పలికారు.
గురువు దారి తెలిసి గుణమును పెంచుకో
జ్ఞాన మెంచి నడుచు జగతిలోన !
గాలిలేని టైరు గమ్యాన్ని చేర్చునా ?
తేట తెలుగు పలుకు తేనె చినుకు !
తమ ఊరు గోసుకొండ గురించి ఎంతో గొప్పగా ఇలా చెప్పుకున్నారు.
నల్లగొండ జిల్ల నయమొప్ప నాయూరు
గోసుకొండ నాకు గొప్ప ఆస్తి !
గౌడ కులము నాది కౌండిన్య గోత్రంబు
తేట తెలుగు పలుకు తేనె చినుకు
ఎవరికి వారే గొప్ప అని అనుకోవద్దని సంఘానికి మంచి చేసే వ్యక్తి ఆదర్శప్రాయమని ఇలా అన్నారు.
నీకు నీవె గొప్ప నాకు నేనేగొప్ప
కీర్తి దాహమునకు కీచులాట !
సంఘహితము కోరు సామాన్యుడేగొప్ప
తేట తెలుగు పలుకు తేనె చినుకు !
తెలుగు వారి గుండెల్లో ప్రజ్ఞతో కూడిన వెన్నెల వెలుగు నింపిందని సినారెను ఉదాహరిస్తూ చెప్పిన ఈ పద్యం ఆయన రచనా ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తుంది.
పగలు వెన్నెలెంతొ ప్రజ్ఞతో పూయించె
తెలుగు గుండెలల్ల వెలుగునింపె !
దివిజ లోకమెల్లె దీప్తిగా సీనారె
తేట తెలుగు పలుకు తేనె చినుకు !
సూటిగా, సరళంగా, సౌందర్యానుభూతిని మిగిల్చే ధారతో ఎంతో ఆకట్టుకునేలా పద్యాలను కవి హృద్యంగా మలిచారు. విభిన్న అంశాలను కవితా వస్తువులుగా చేసుకొని ఈ పద్యాలను రాశారు. నిత్య జీవితంలో చూసే సంఘటనలనే పద్యాలుగా మలచి సామాజికతను దృఢంగా చూపారు. కొత్త ఆలోచనలకు పద్యాలలో పునాదులు వేశారు. కమ్మదనంతో తేనెలొలుకుతూ ప్రతి మనిషికి కర్తవ్య నిర్దేశాన్ని చేసిన ఈ శతకానికి జనాదరణ తథ్యంగా దక్కుతుంది.
– డా.తిరునగరి శ్రీనివాస్
8466053933
తేట తెలుగు పద్యం…





