ఏజెన్సీ ఏరియాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
అండమాన్ తీరంలో వాయుగుండంతో వర్షాలకు ఛాన్స్
హైదరాబాద్, నవంబర్ : తెలుగు రాష్టాల్లో్ర చలి పంజా విసురుతోంది. ఏజెన్సీలో చలి పెరుగుతోంది. రెండు రోజులుగా ఉష్టోగ్రతలు పడిపోతున్నాయి. సాధారణం కంటే ఐదు డిగ్రీలు తక్కువ నమోదు అవుతోంది. అల్లూరి జిల్లా చింతపల్లిలో 9.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై.. ఇటు కొమురం భీం జిల్లా సిర్పూర్(యు)లో 9.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఏజెన్సీ ఏరియాలో పాడేరు,అరకులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇటు చింతపల్లి ఏజెన్సీలో సాయంత్రం నుంచే మంచు కురుస్తోంది. చలిగాలులు వీస్తుండడంతో మన్యం వాసులు వణికిపోతున్నారు. పొగమంచుతో మన్యం తడిసి ముద్దవుతోంది. చలి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య ప్రాంతాల నుంచి తెలంగాణ లోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నందున చలి పెరుగుతున్నట్లు వాతావరణశాఖ వివరించింది. పగటిపూట పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది.తెలంగాణలో వచ్చే వారంపాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది.
అక్కడక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పడిపోతాయని పేర్కొన్నది. 21, 22 తేదీల్లో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. రాష్ట్రంలో శుక్రవారం అత్యల్పంగా మెదక్‌లో 12 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 13.2, హైదరాబాద్‌లో 14.2, దుండిగల్‌లో 15.2, నల్లగొండలో 15.4, హనుమకొండలో 15.5, రామగుండంలో 15.6, హకీంపేటలో 15.9, నిజామాబాద్‌లో 16.1, ఖమ్మంలో 17, మహబూబ్‌నగర్‌లో 18.1, భద్రాచలంలో 19 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణశాఖ తెలిపింది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్‌కి మరోసారి వాన ముప్పు ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ అండమాన్ సపంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో గురువారం ఏర్పడిన అల్పపీడనం..పశ్చిమ వాయవ్యదిశగా ప్రయాణించి వాయుగుండం గా బలపడుతున్నదని, ఈ నెల 19 నాటికి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని అంచనా వేసింది.
ఈ ప్రభావంతో రాబోయే మూడు రోజులు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతున్న క్రమంలో తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధప్రదేశ్ తీరాల వైపు వెళ్లే అవకాశం ఉంది. ఈ ద్రోణి ప్రభావం వల్ల ఈ నెల 20 నుంచి ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు పడొచ్చునని, అలాగే తమిళనాడు, పుదుచ్చేరిలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. 20, 21, 22 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 21, 22 తేదీల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అటు 40-55 కి వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు.




