తెలుగు పాఠ్యపుస్తకాల్లో ముందుమాట

తప్పులపై సర్కార్‌ దిద్దుబాటు చర్యలు

ఇద్దరు అధికారులపై వేటు వేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 14 : తెలుగు పాఠ్యపుస్తకం ముందు మాటలో తప్పులపై ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విభాగం డైరెక్టర్‌ శ్రీనివాసచారి, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ రాధారెడ్డిపై చర్యలకు ఆదేశించింది. పాఠ్యపుస్తకాల బాధ్యతల నుంచి శ్రీనివాసచారి, రాధారెడ్డిని తొలగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌గా పాఠశాల విద్య అదనపు డైరెక్టర్‌ రమేశ్‌కు బాధ్యతలు అప్పగించారు. టీఆర్‌ఈఐఎస్‌ కార్యదర్శి రమణ కుమార్‌కి ముద్రణ సేవల విభాగం డైరెక్టర్‌గా బాధ్యతలు కేటాయించారు. తెలంగాణలో ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందజేసిన తెలుగు వాచకం పాఠ్య పుస్తకాలను వెనక్కి తీసుకోనున్నారు.

పంపిణీ చేయని వాటిని పిల్లలకు ఇవ్వకుండా నిలిపివేశారు. 24 లక్షల పుస్తకాల్లోని ముందుమాటలో మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రులు, అధికారుల పేర్లను ముద్రించారు. ఏళ్ల క్రితం నాటి ముందుమాటలో మార్పులు చేయకుండా రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహించారు. బుధవారం పుస్తకాలను విద్యార్థులకు అందజేస్తున్న సమయంలో ముందుమాటలోని తప్పులను చాలాచోట్ల ఉపాధ్యాయులు గుర్తించి విద్యాశాఖ దృష్టికి తీసుకొచ్చారు. తొలుత ఆ పేజీని చించేయాలని ఆదేశించిన అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఆ పేజీని తొలిగిస్తే దాని వెనుకున్న వందేమాతరం, జాతీయ గీతం, ప్రతిజ్ఞ లేకుండా పోతాయి. అప్పుడు మరిన్ని విమర్శలు వస్తాయని  భావించారు. దాంతో పిల్లలకిచ్చిన, ఇవ్వని పుస్తకాలన్నీ వెనక్కి తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన డీఈఓలను ఆదేశించారు. వాటిని మండల వనరుల కేంద్రాలకు తరలించాలని సూచించారు. ఆ పేజీ మొత్తం కనిపించకుండా స్టిక్కర్‌ వేసి అందజేయనున్నారు. తెలుగు వర్క్‌ బుక్స్‌నూ వెనక్కి తీసుకుంటున్నారు.

పుస్తకాలను తిరిగి  ముద్రించడం లేదు

ముందుమాట పేజీ మాత్రమే మార్పు
కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి వివరణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 14 : పుస్తకాలను మళ్లీ ముద్రిస్తున్నామనే ప్రచారంలో నిజం లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి వివరణ ఇచ్చారు. కేవలం ముందుమాట పేజీ మార్చి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దీనివల్ల ప్రభుత్వంపై ఎలాంటి భారం పడదని స్పష్టం చేశారు. విద్యార్థులకు తప్పుడు సమాచారం వెళ్లకూడదనే ఈ రకమైన నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలోని విద్యార్థులకు అందజేసిన పాఠ్యపుస్తకాల్లో ముద్రితమైన మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, కడియం శ్రీహరి పేర్లను తొలగించాలని తాజాగా సర్కారు నిర్ణయించింది. ఈ పేర్లున్న పేజీపై మరో పేజీని అతికించి ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. గమ్‌ స్టిక్కర్లు ఉన్న పేజీని ఆ పేజీపై అతికించనున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

గతంలో ఇలాగే పొరపాటు జరిగినప్పుడు పేజీని అతికించామని, ఇప్పుడు అలాగే చేయనున్నట్టు ఆయా వర్గాల   ద్వారా తెలిసింది. రాష్ట్రంలో 1 నుంచి 10వ తరగతుల్లోని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేసిన విషయం తెలిసిందే. దాదాపు ఈ పుస్తకాల సంఖ్య 25లక్షల వరకు ఉంటుంది.ఈ పుస్తకాల్లోని ముందుమాట లో కేసీఆర్‌ సహా మాజీ మంత్రుల పేర్లను ప్రస్తావించారు. ఈ విషయం సోషల్‌వ్నిడియాలో రావడంతో ఏదో తప్ప జరిగిందన్నట్టుగా పాఠశాల విద్యాశాఖ ఆగమేఘాల వ్నిద ఆయా పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. అన్ని పాఠ్యపుస్తకాలను వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులిచ్చింది. పుస్తకాలను ఎమ్మార్సీలో అందజేయాలని, ఎంఈవోలు వాటిని జిల్లా పుస్తకాల గోడౌన్‌లో వాపస్‌ చేయాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నది. ఇది అత్యంత ముఖ్యమైన అంశమని ప్రస్తావించింది. కొన్ని ప్రాంతాల్లో ఆయా పేజీని చింపివేయాలని మంగళవారం మౌఖిక ఆదేశాలిచ్చారు. ఇదే పేజీ వెనక వందేమాతరం, జనగణమన లుండటం, వాటిని అవమానం జరుగుతుందన్న అభ్యంతరాలు టీచర్ల నుంచి రావడంతో ఆఖరుకు పేజీని అతికించాలని నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *