తెలంగాణ పోరా టం లేచింది.. ఉద్యమానికి ఊతమిచ్చింది నల్లగొండ జిల్లా. ఉద్యమ నాయకులు ముందు వరుసలో నిలబడి నిలిచిన ముఖ్యమైన వ్యక్తుల్లో రావి నారాయణరెడ్డి అగ్రగణ్యుడు. స్వాతంత్ర సమర యోధుడు మానవతావాది నిజాయతీతో నిఖార్సుగా నిలబడ్డ ఆదర్శ కమ్యూనిస్టు తెలంగాణ సాయుధ పోరాటానికి చిరునామా రావి నారాయణరెడ్డి. దేశ్‌ముఖ్‌ల కుటుంబంలో పుట్టినప్పటికి దేశం కోసం దేశ విముక్తి కోసం దోపిడీ వ్యవస్థను మట్టు పెట్టడానికి ప్రజా ఉద్యమాలను నిర్మించి నిర్వహించి విప్లవాగ్ని విరజిమ్ముతూ వీర తెలంగాణ పోరాటాన్ని విశ్వమే విస్తుపోయేలా నడిపిన విప్లవవీరుడు రావి నారాయణరెడ్డి. రావి నారాయణరెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లా భువనగిరి తాలూకా బొల్లెపల్లి గ్రామంలో 1908 జూన్ 4వ తేదీన గోపాల్ రెడ్డి వెంకట రామమ్మ దంపతులకు జన్మించారు. వీరిది భూస్వామ్య కుటుంబం.. ప్రాథమిక విద్య బొల్లెపల్లి గ్రామం భువనగిరిలో చదివిన నారాయణరెడ్డి ఉన్నత చదువుల నిమిత్తం రెడ్డి హాస్టల్లో హెచ్.ఎస్.ఎల్.సి పూర్తి చేసి నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్ విద్య పూర్తి చేశారు. నిజాం కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, జయప్రకాశ్ నారాయణ రచనలు చదివి జాతీయ భావాల పట్ల ప్రభావితులయ్యారు.
విద్యార్థి దశలో కళలు క్రీడలు వ్యక్తిత్వం వంటి అంశాలలో చాలా చురుకుగా పాల్గొనేవారు. కొండా వెంకట రామిరెడ్డి ప్రియమైన శిష్యుడుగా పేరు పొందారు. హైదరాబాద్ సంస్థానంలో పోరాటాలు ప్రారంభానికి ముందే ఆయన కాకినాడ వెళ్లి సత్యాగ్రహంలో పాల్గొ న్నారు. ఆ ఉత్తేజంతో తమ ఊరు బొల్లెపల్లి గ్రామంలో ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించారు. 1933లో హైదరా బాదులో ఏర్పాటు కాబడ్డ హరిజన సేవా సంఘానికి కార్యదర్శిగా హరిజనోద్ధరణకు కృషి చేశారు. అస్పృశ్యత నివారణ, సహపంక్తి భోజనాలతో ప్రజల విద్యా వికాసా నికి కృషి చేశారు. నిజాం పాలనలో ఇబ్బందులు ఎదుర్కొ ంటున్న ప్రజల లో జాగృతం చేయడానికి తెలంగాణ పల్లెలు, రైతు సంఘాలు, వర్తక సంఘాలు, గ్రంథాలయ సంఘాలు వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ప్రజా సంఘాలు ఆవిర్భవించాయి. ఈ సంఘాలన్నింటికి ఒక కేంద్రం ఉండాలనే ఆలోచనతో 1930లో ఆంధ్ర మహాసభ ఏర్పడింది. యువనాయకుడిగా ఆంధ్ర మహాసభలు పాల్గొన్న రావి నారాయణరెడ్డి మూడుసార్లు ఆ మహాసభకు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఆంధ్ర మహాసభ అధ్యక్ష పదవి అంటే పదవి ఆ రోజుల్లో చాలా గొప్ప పదవి. 1930లో గాంధీ పిలుపు మేరకు శాసనోల్లంఘన ఉద్యమంలో చురుకైన పాత్రలో పాల్గొన్న రావి నారాయణరెడ్డి నిజాం నిరంకుశ పాలనలో సత్యాగ్రహంలో పాల్గొనడం మామూలు విషయం కాదు. రావి నారాయణరెడ్డి ఒక్కరే సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టు అయ్యారు. దేశమంతటా ఉప్పుసత్యాగ్రహం పేరుతో జరిగిన శాసన ధిక్కారం సమయంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు.1944 రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన భువనగిరిలో జరిగిన ఆంధ్ర మహాసభలోనే అతివాద మితవాద వర్గాల మధ్య తీవ్రమైన అభిప్రాయభేదాలు వచ్చాయి. ఆ తర్వాత ఆంధ్ర మహాసభ రెండుగా చీలిపోయింది . భారత స్వతంత్ర సమరంలో తెలంగాణ పోరాటం ఉధృతంగా ముందుకు సాగుతుంటే భయాందోళనకు గురైన నిజాం ప్రభుత్వం 1946 నవంబరులో కమ్యూనిస్టు పార్టీని నిషేధించింది.
1948 సెప్టెంబర్ వరకు నైజాం పోలీసులు రజాకార్లకు వ్యతిరేకంగా బ్రహ్మాండమైన పోరాటం జరిగింది. పోలీసు చర్య తరువాత కూడా పోరాటాన్ని సాగి•ంచాలనే వాదనను రావి నారాయణ రెడ్డి తిరస్కరించారు. సోషలిస్టు సమాజ స్థాపనకు హింస వాదమే ఏకైక లక్ష్యం అన్న పిడి వాదాన్ని ఆయన అంగీకరించలేదు. తెలంగాణ రైతాంగ సాయుధ గెరిల్లా పోరాటంలో పోలీసు చర్య కంటే ముందు తక్కువ మంది ప్రజలు మరణించారని ప్రజలు వారిని సమయస్ఫూర్తితో కాపాడుతున్నారని రావి నారాయణ రెడ్డి అభిప్రాయం. అభిప్రాయభేదాలు వచ్చాయి. ఆ తరువాత ఆంధ్రమహాసభ రెండుగా చీలిపోయింది. ఒకటి జాతీయ ఆంధ్ర మహాసభ, రెండవది రావి నారాయణరెడ్డి నాయకత్వంలో కమ్యూనిస్టు ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో తెలంగాణాలో జరిగిన రైతాంగ సాయుధ గెరిల్లా పోరాటం భూస్వామ్య వర్గాలకు వెన్నులో చలిపుట్టించింది. రైతులను జాగృతం చేయండంలో ఆ పార్టీ జరిపిన కృషి తెలంగాణలో చారిత్రాత్మకమైంది. భూస్వాముల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే పోరాటం తప్ప మార్గం లేదని ఆంధ్రమహాసభ అభిప్రాయపడింది. గెరిల్లా యుద్దాలు ప్రారంభించాలని తెలంగాణ రథసారథి రావి నారాయణరెడ్డి, కమ్యూనిస్టు పార్టీనేతలు బద్దం ఎల్లారెడ్డి, ముఖుం మొహినుద్దీన్లు నిర్ణయించారు. ఈ నాయకుల పిలుపు మేరకు తెలంగాణలో సాయుధ పోరాటం ఉదృతంగా ముందుకు సాగింది. బ్రహ్మాం డమైన ఈ పోరాటానికి రావి నారాయణరెడ్డి నాయకత్వం వహించారు.
భారత స్వాతంత్య్ర సమరంలో తెలంగాణా సాయుధ పోరాటం సువర్ణాక్షరాలతో లిఖిం పదగింది. కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణా పోరాటం ఉధృతంగా ముందుకు సాగుతుంటే భయాందోళనలకు గురైన నిజాం ప్రభుత్వం 1946 నవంబర్లో కమ్యూనిస్టు పార్టీని నిషేధించింది. 1946-1951 వరకు జరిగిన తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటానికి రావి నారాయణరెడ్డి నాయకత్వం వహించారు. 1948 సెప్టెంబర్ వరకు నైజాం పోలీసులు, రజాకర్లకు వ్యతిరేకంగా బ్రహ్మాండమైన పోరాటం జరిగింది. పోలీసు చర్య తరువాత కూడా పోరాటాన్ని సాగించాలనే వాదనను రావి నారాయణరెడ్డి తిరస్కరించారు. సోషలిస్టు సమాజ స్థాపనకు హింసావాదమే ఏకైక లక్ష్యమన్న పిడి వాదాన్ని ఆయన అంగీకరించలేదు. తెలంగాణా రైతాంగ సాయుధ గెరిల్లా పోరాటంలో పోలీసు చర్యకంటే ముందు తక్కువ మంది ప్రజలు మరణించారని, ప్రజలు వారిని సమయస్పూర్తితో కాపాడుకొన్నారని రావి నారాయణరెడ్డి అభిప్రాయం. పోలీసు చర్య తరువాత పార్టీ సభ్యులు, ముఖ్యనాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో మరణించారని, ఇది యదార్ధసత్యమని రావి నారాయణరెడ్డి పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. యూనియన్ ప్రభుత్వ బలగాలు రంగంలోకి దిగినప్పుడు పోరాటాన్ని నిలిపివేస్తే పార్టీకి ఎక్కువ నష్టం జరిగేది కాదు. 1951లో పోరాటాన్ని నిలిపివేయక తప్పలేదు.
పోరాటం ఆపినప్పటికీ పోలీస్ చర్య తరువాత జరిగిన సాయుధ పోరాటం గురిం, జరిగిన నష్ట గురించి, కోల్పోయిన పార్టీ క్యాడర్ గురించి పార్టీ వేదిక పై చర్చించే పోవడాన్ని కూడా రావి నారాయణరెడ్డి తప్పు పట్టారు. నైజాం నిరంకుశ పాలనకు భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నల్లగొండ, వరంగల్, ఖమ్మం,కరీంనగర్ మెదక్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 4వేల గ్రామాల్లో లక్షలాదిమంది ప్రజలు ఈ పోరాటంలో పాల్గొన్నారు. రావి నారాయణరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ పోరాటం ఫలితంగా 4వేల గ్రామాలలో నైజాం పాలన అంతమొందింది. గ్రామ రాజ్యాలు ఏర్పడ్డాయి. హైదరాబాద్ సంస్థానంలో వయోజన ఓటింగ్ ఆధారంగా ప్రజాస్వామిక ప్రభుత్వం స్థాపించడానికి ఈ పోరాటవే కారణభూతమైంది. నైజాంను గద్దెదించి సంస్థానాన్ని రద్దుచేసి భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పర్చడానికి, తెలుగు భాష సంస్కృతిని రక్షించుకోవడానికి, వెట్టి చాకిరీనుండి ప్రజలకు విముక్తి లభించడానికి, అక్రమ లెవీ వసూళ్ళు పోవడానికి ఈ పోరాటమే కారణం. తెలంగాణా సాయుధ పోరాటమే భూసంస్కరణలను ప్రవేశ పెట్టడానికి బాటలు వేసిందని రావి నారాయణరెడ్డి అన్నారు. భారతదేశంలో ఏరాష్ట్రంలో లేని ఒక అభ్యుదయ ‘‘కౌల్జారీ’’ చట్టం ఇక్కడ ప్రవేశ పెట్టడం కూడ ఈ పోరాట ఫలితమే. ఈ పోరాటం ద్వారా దాదాపు 10 లక్షల ఎకరాల భూమి పేద రైతుల స్వాధీనమైంది. రైతుల నుండి అక్రమంగా భూస్వాములు లాక్కును భూములను తిరిగి రైతులు స్వాధీనం చేసుకున్నారు. ఉద్యమనేత, సాయుధ పోరాటయోధులకు తలమానికంగా నిలిచిన రావి నారాయణరెడ్డి తనకు అను 700 ఎకరాల భూమిలో 500 ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేశారు. దానితో భూదానోద్యమానికి ఆయన చేయూత నందిం చారు. రావి నారాయణరెడ్డి వ్యక్తిత్వం సమున్న తమైంది. స్వభావం ఉత్తమ సంస్కార విలసితమైంది. ఆ ఉదార హృదయం. ఆయన ఐదు సంవత్సరాలు జైలు, రహస్య నిర అనుభవించారు. నారాయణరెడ్డి సిద్ధాంతవాది మాత్రమే కాదు కార్యదీక్షాపరుడు.
1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంటునియోజకవర్గం నుంచి పోటీచేసి భారతావని మొత్తంమీద ఏ వ్యక్తికి రానటువంటి అతి పెద్ద మెజారిటీతో ఎన్నికై భారత ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ద్వారా పార్లమెంట్ లో ఘనంగా సన్మానం పొందిన వ్యక్తి రావి నారాయణ రెడ్డి. 1957 ఎన్నికల్లో భువనగిరి నుంచి శాసనసభకు ఎన్నికై ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. 1962లో కూడా తిరిగి భువనగిరినుంచి పోటీచేసి శాసనసభకు ఎన్నికయ్యారు. 1967నుండి రావి నారాయణరెడ్డి స్వచ్చంధంగా రాజకీయాలనుంచి నిష్క్రమించారు.
కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆయన ఎప్పుడో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యేవారు. ఎందరో కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీలో ఆహ్వానించిన చివరి శ్వాస వరకు కమ్యూనిస్ట్ జెండాను వీడలేదు. ఉద్యమమే ఊపిరిగా మానవత్వమే మనుగడగా సాగిన రావి నారాయణరెడ్డి నిరాడంబర జీవితం ఈనాటి యువతకు స్పూర్తి దాయకం.
సురేష్ కాలేరు




