తెలంగాణ కోటిన్నర ఎకరాల మాగాణ చేసిన కేసీఆర్‌

‌రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌

‌ములుగు జిల్లాలో రూ 133 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

రామప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు

ములుగు, ప్రజాతంత్ర, జూన్‌ 7 : ‌తెలంగాణ కోటిన్నర ఎకరాల మాగాణ చేసిన మహానాయకుడు కేసీఆర్‌ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ములుగులో నిర్వహించిన వాటర్‌ ‌డే వేడుకల్లో కేటీఆర్‌ ‌పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ములుగు జిల్లాలో 133 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్‌ ‌పాలనలో రాష్ట్రం వెనుకబడిందని వారిని నమ్మి మోసపోతే గోసపడతామన్నారు జిల్లాకు అడగకుండా అన్ని ఇచ్చామని

మెడికల్‌ ‌కాలేజీ మంజూరు చేసిన ఘనత కేసిఆర్‌ ‌ది అన్నారు. ఒక్క ములుగు జిల్లాలోనే 17 ఎకరాలకు పోడు పట్టాలిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం తొమ్మిదేళ్లు నిండిన సందర్భంలో దశాబ్ది సంబురాల్లో భాగంగా సాగునీటి దినోత్సవం జరుపుకుంటున్నాం. ఒకనాడు మహాకవి దాశరథి ఆనాడు స్వాత్రంత్యోద్రమ సమయంలో జైలులో పెట్టిన సందర్భంలో బొగ్గుతో నా తెలంగాణ కోటి రతనాల వీణ అని జైలు గోడలపై రాశారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పట్టుదలతో నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణకు న్యాయం జరగాలంటే స్వరాష్ట్రం ఏర్పడాలని 14 సంవత్సరాల పాటు పోరాటం చేశారు. ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌లాంటి మేథావుల సహకారం, సారథ్యంలో తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతం చేసి ఎత్తిజెండా దించకుండా పోరాటం చేసి ఆ నాడు దాశరథి అన్న నా తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు. కోటిన్నర ఎకరాల మాగాణ అని రుజువు చేసిన మహానాయకుడు కేసీఆర్‌ అన్నారు.

ఎర్రటెండల్లో చెరువులు మత్తళ్లు దుంకుతయని కలలో అనుకున్నామా ముఖ్యమంత్రి సారథ్యంలో ఇవాళ సాగునీటి దినోత్సవ సంబురాలు జరుపుకుంటున్నాం. ఇక్కడికి హెలికాప్టర్‌లో వచ్చిన సమయంలో అంతా చూసుకుంటు వచ్చాం. ఎంతటి అద్భుతమైన దృశ్యం మన కండ్ల ముందటే కనిపిస్తున్నది. ఎక్కడ చూసినా చెరువులు నిండుకుండల్లా నిండుగా కనిపిస్తున్నయ్‌. ‌మాడుపలిగేలా ఉన్న ఎర్రటి ఎండల్లో చెరువులు మత్తళ్లు దుంకుతయని కలలో కూడా అనుకున్నమా ఆలోచించాలి. ఒకప్పుడు ఎండకాలం వచ్చిందంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు ఊళ్లకు వెళ్లాలంటే భయపడేవారు. ఊరికి వెళ్తే బిందెలు అడ్డం పెడతారో.. ఎక్కడ బోరింగ్‌ అడుగుతరో.. మోటరు అడుగుతరో.. అటు పైసలు లేక.. ప్రభుత్వం పట్టించుకోక అదోగతిపాలై ఆ నాడు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ పాలనలో, సమైక్య రాష్ట్ర పాలనలో ఎంతో గోస ఉండేదే అందరూ గుర్తు చేసుకోవాలి. ఆ బాధ, ఆ గోస నేడు ఉన్నదా? ఒకసారి గుండెలమీద చేయివేసుకొని చెప్పాలి అన్నారు.ఎలక్షన్లు రాంగనే కాంగ్రెస్‌, ‌బీజేపోళ్ల వస్తున్నరు. 67 సంవత్సరాలపాటు తెలంగాణ రాక ముందు మనం అధికారం ఇచ్చింది కాంగ్రెస్‌కు కాదా? దేశాన్ని, రాష్ట్రాన్ని ఏలింది కాంగ్రెస్‌ ‌పార్టీ కాదా? మా కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తాగునీరు ఇవ్వక సావగొట్టింది కాంగ్రెస్‌ ‌కాదా? సాగునీరు ఇవ్వకుండా సతాయించింది కాంగ్రెస్‌ ‌కాదా? ఇవాళ మళ్లీ వాళ్లే ముందటపడి అడ్డంపొడువు మాట్లాడితే నమ్ముదామా? లేదంటే మన గొంతు తడిపిన కేసీఆర్‌తో గళం కలిపి, భుజం తట్టి కేసీఆర్‌ ‌మీరు ముందుకు నడవండి.. మీరు బాగుంటేనే పేదవారు బాగుంటారు.. రైతులు బాగుంటరు, వ్యవసాయం బాగుంటది అని చెప్పి వెన్నుతట్టి ప్రోత్సహిద్దామా? ఆలోచించాలి. సంక్రాంతి గంగిరెద్దులోళ్లు బయలుదేరి వచ్చినట్లు ఎలక్షన్లు రాంగనే బయలుదేరి వచ్చినట్లు కాంగ్రెస్‌, ‌బీజేపోళ్లు వస్తున్నరు. నోటికి వచ్చినట్లు అడ్డంపొడువు మాట్లాడుతరు. మాటలు ఎన్నైనా చెప్పొచ్చు. పక్కకే ఉన్నది ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రం. అక్కడ ఉన్నది కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం. నేను సూటిగా తెలంగాణ రైతులను అడుగుతున్నా ఆలోచించాలి అని కోరారు.

రామప్పలో కేటీఆర్‌ ‌ప్రత్యేక పూజలు

సుప్రసిద్ధ రామప్ప రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మంత్రి కేటీఆర్‌ ‌సందర్శించారు. వారికి ఆలయ అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. దర్శనం అనంతరం టూరిజం గైడ్లతో రామప్ప శిల్ప సంపద గురించి తెలుసుకున్నారు. రామప్ప సరస్సులో భాగంగా ప్రత్యేక పూజలు చేశారు .ఈ సందర్భంగా పలువురు సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరుతూ మంత్రి కేటీఆర్‌ ‌కు వినతి పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ , ‌సంక్షేపంచాయతీరాజ్‌ ‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు, హోం శాఖ మాత్యులు మహమూద్‌ అలీ , ఎంపీ మాలోత్‌ ‌కవిత ,రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ ‌రెడ్డి ,నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ ‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌ ‌రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ అజ్మీర సీతారాం నాయక్‌, ‌జల వనరుల సంస్థ చైర్మన్‌ ‌వీరమల్ల ప్రకాష్‌ ‌రావు ,రెడ్కో చైర్మన్‌ ‌సతీష్‌ ‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ ‌కుసుమ జగదీష్‌, ‌వైస్‌ ‌చైర్మన్‌ ‌నాగజ్యోతి ,జిల్లా కలెక్టర్‌ ‌కృష్ణ ఆదిత్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ‌గోవింద నాయక్‌, ‌నాగూర్ల వెంకన్న ,అజ్మీర ప్రహ్లాదు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *