ఈటలను మాట్లాడకుండా..అసెంబ్లీకి రాకుండా కుట్రలు
కెసిఆర్‌ను మించిన ఫాసిస్ట్ మరొకరు లేరు
ప్రధాని మోడీపై కెసిఆర్ దుష్ప్రచారం
వి•డియా సమావేశంలో మండిపడ్డ కిషన్ రెడ్డి
నారాయణరావు పవార్ కుటుంబానికి పరామర్శ
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13 : సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. స్వాతంత్య్ర ఉద్యమంలో గుర్తింపు దక్కని ఉద్యమకారులను కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారిని స్మరించుకోనున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా న్యూ నల్లకుంటలోని నారాయణరావు పవార్ ఇంటికి చేరుకొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏడాది పాటు వారిని స్మరించుకుంటూ వారి జయంతి, వర్ధంతులను ఘనంగా నిర్వహిస్తామన్నారు. 1948లో అప్పటి హోమ్ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ నగరంలో జాతీయ జెండాను ఎగురవేసి నిజాం పాలనకు చరమగీతం పాడారని…సెప్టెంబర్17న నగరంలో ప్రస్తుత హోమ్ మంత్రి అమిత్ షా జాతీయ జెండా ఎగురవేస్తారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ బిజెపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రం పై సీఎం కేసీఆర్ దుష్పచ్రారం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌ను మించిన నియంత, అప్రజాస్వామికవాది మరొకరు లేరన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం గెజిట్‌లో ఎక్కడా లేదని తెలిపారు.
విద్యుత్ సంస్థల బకాయిలు తేల్చాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని, డిస్కంలు బాగుండాలని కోరుకుంటూ కేంద్రం గెజిట్ విడుదల చేసిందని తెలిపారు. భవిష్యత్‌లో కోతలు లేని విద్యుత్ అందించాలని చెప్పామన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని తామెందుకు చెబుతామని ప్రశ్నించారు. ఉచితంగా ఇస్తుంటే ఎందుకు వద్దంటామని అన్నారు. రైతుల కోసం కేంద్రం కూడా అనేక కార్యక్రమాలు చేస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. మాటల గారడీతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని..వొచ్చే ఎన్నికల్లో తెరాసను ప్రజలు ఊడ్చేస్తారని కిషన్‌రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ఈటలపై కక్ష సాధిస్తూ రాజకీయంగా దెబ్బ తీయాలని కుట్రల చేస్తున్నారని మండిపడ్డారు. సికింద్రాబాద్‌లో నిన్న రాత్రి జరిగిన అగ్నిప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలుచేయకుండా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. మాటల గారడీతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని మండిపడ్డారు. వేల కోట్లు అప్పులు చేసి రాష్టాన్న్రి అప్పులకుప్ప చేశారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే తెరాసను ఊడ్చేస్తారని అన్నారు. ’ఈటలను అసెంబ్లీకి రానివ్వను.. మాట్లాడనివ్వను.. అంటున్నారు. ఈటల ముఖం చూడను అంటున్నారు.. కేసీఆర్ కంటే ఫాసిస్ట్ ఎవరు ? ఈటలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఈటలను రాజకీయంగా దెబ్బతీసేందుకు అనేక కుట్రలు పన్నుతున్నారు. హుజురాబాద్ ప్రజల తీర్పును కాలరాసేలా మాట్లాడుతున్నారు. తెలంగాణ ఏమన్నా మీ జాగీరుగా భావిస్తున్నారా? మరమనిషి అనేమాట అప్రజాస్వామికమా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.


