తెలంగాణ ఆడపిల్లలకు కళ్ల నుంచి నీళ్లు కాదు..నిప్పులు వొస్తాయి

  • కేంద్రాన్ని వ్యతిరేకిస్తే ఏజెన్సీలతో దాడులు
  • ప్రజాస్వామ్యాన్ని కేంద్రం అపహాస్యం చేస్తుంది
  • వెనక్కి తగ్గేది లేదు…ఎదుర్కుంటం
  • టిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : ‌తెలంగాణ ఆడపిల్లల కళ్ల నుంచి నీళ్లు రావని, నిప్పులు వొస్తాయని టిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత బిజెపి పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి కేసులైనా తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, ముందుకు వెళ్లాలని తెలంగాణ ఉద్యమం తరహాలో కొత్త ఉద్యమాన్ని ప్రారంభిద్దామని ఆమె జాగృతి కార్యకర్తలకు కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో సోమవారం ముషీరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ..కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏజెన్సీలతో దాడులు చేస్తున్నారని కవితరిరోపించారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ ‌దాకా దాడులు చేస్తున్నారని, కానీ దాడులకు తాము భయపడేది లేదన్నారు. తమ సమయాన్ని వృథా చేస్తున్నారని, దాంతో తమకు మిగిలిన సమయంలో డబుల్‌, ‌ట్రిపుల్‌ ‌పని చేయాలని, కానీ వెనక్కి తగ్గొద్దని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

తాము ప్రజల శక్తి, ప్రేమ ఏమిటో తెలిసిన వాళ్లడని, ప్రజలను ఒక శక్తిగా మలిచినటువంటి వాళ్లమని, ప్రతి చోట మన కార్యక్రమాలను అమలు చేయాలంటూ ఆమె పిలుపునిచ్చారు. యువతీయువకులు ఈ దేశం గురించి ఆలోచించాలని కవిత సూచించారు. ఆనాడు తెలంగాణ కోసం గొంతెత్తామని, మన హక్కు అడిగామని, ఈనాడు మన దేశంలో ఎలాంటి పరిస్థితి ఉందనే విషయాన్ని తెలుసుకోవాలని, మన హక్కులను కోల్పోతున్నామన్న విషయం తెలియకుండా ఉన్నామని, మేధావులు మాట్లాడటం బంద్‌ ‌చేసిండ్రని, కవులు గళమెత్తడం మానేసిండ్రని, రచయితలు పుస్తకాలు రాయడం మానేసిండ్రని, అందరూ నిరాశ నిస్పృహల్లో ఉన్నారని, రచయితలు తమకు వొచ్చిన అవార్డులను కేంద్రానికి విసిరికొట్టారని కవిత ఈ సందర్భంగా గుర్తు చేశారు. జాగృతి సంస్థ ప్రతి రాష్ట్రానికి వెళ్లి దేశ వ్యాప్తంగా అనేక అంశాలపట్ల ప్రజలను జాగృతం చేయాలని, ఆ అవసరం కనబడుతుందని కవిత పేర్కొన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన సర్కార్లను బీజేపీ ప్రభుత్వం కూల్చేస్తుంటే, పెద్ద పెద్ద పత్రికలు ప్రజలను తప్పుదోవ పట్టించే వార్తా కథనాలు రాస్తున్నాయని అన్నారు.

ప్రజాస్వామ్యాన్ని కేంద్రం అపహాస్యం చేస్తుందని, తెలంగాణలో చేసిందే దేశంలో చేయాలని, సిస్టమ్‌ను మనం కాపాడుకున్నప్పుడే ఆ సిస్టమ్‌ ‌మనల్ని కాపాడుకుంటుందన్నారు. కేంద్రం తప్పులను దేశ ప్రజలకు వివరించి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అలా బీజేపీ తప్పులను ఎత్తి చూపితే దాడులు చేస్తున్నారని, మీడియాను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారని, ప్రజలకు నష్టం కలిగించే విధంగా కేంద్రం వ్యవహరిస్తుందని కవిత మండిపడ్డారు. ప్రజాసమూహాన్ని చైతన్య పరచాలంటే భావజాల వ్యాప్తి అవసరమన్నారు. సమీకరించు, బోధించు, పోరాడు అని అంబేద్కర్‌ ‌చెప్పారని, ఇదే సిద్ధాంతాన్ని ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌తెలంగాణ ఉద్యమం సందర్భంలో అనేకసార్లు చెప్పారన్నారు. నేడు ఈ విధమైన అన్ని అంశాలపై ఆలోచించాల్సిన సమయం, సందర్భం వొచ్చిందని, దేశ వ్యాప్తంగా జరుగుతున్న అన్యాయాలను ఎదురించాలన్నారు. తెలంగాణ జాగృతి ఒక ప్రబలమైన శక్తిగా ఉందని, సంస్థకు ప్రతి గ్రామంలో కార్యకర్తలు, నాయకులు ఉన్నారని, 18 దేశాల్లో మన కమిటీలు పని చేస్తున్నాయని, ఒక్క పిలుపు ఇస్తే ప్రతి రాష్ట్రంలో శాఖ ఏర్పడే శక్తి ఉందని కవిత తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *