తెలంగాణ అంటేనే త్యాగాలు, పోరాటాలు

  • ఇక్కడ రాచరిక వ్యవస్థకు తావు లేదు
  • పోరాట స్ఫూర్తి ప్రతిబింబించేలా చిహ్నం
  • రాష్ట్ర గీతం రూపకల్పన బాధ్యతలు అందెశ్రీకి..
  •  మీడియాతో చిట్‌చాట్‌లో సిఎం రేవంత్‌ రెడ్డి

న్యూదిల్లీ, మే 28 : తెలంగాణలో రాచరిక వ్యవస్థకు తావులేదని, తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలని, పోరాటాలు, చిహ్నాలు, తెలంగాణ తల్లి, గీతం స్ఫురించేలా తెలంగాణ చిహ్నం ఉంటుందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర గీతం రూపకల్పన బాధ్యతలు కవి అందెశ్రీకి ఇచ్చామని, అందెశ్రీ ఎవరిని ఎంచుకుని గేయ రూపకల్పన చేస్తారనేది ఆయన ఇష్టమన్నారు. ఏ సంగీత దర్శకుడిని పెట్టి గేయ రూపకల్పన చేయాలనేది తనపని కాదన్నారు. రాష్ట్ర గేయ రూపకల్పన బాధ్యత అంతా అందెశ్రీ దేనని, తెలంగాణ చిహ్న రూపకల్పన నిజామాబాద్‌ వ్యక్తికి ఇచ్చామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం  మీడియాతో చిట్‌ చాట్‌లో మాట్లాడుతూ…మేడిగడ్డ ప్రాజెక్టు వెన్నెముక ఇరిగిందని తాను ముందే చెప్పానని, గత ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి విడిచిందని, సముద్రంలో పోసిన నీళ్లకు కరెంట్‌ బిల్లు కట్టామని చెప్పారు.

ఎన్నికల కోడ్‌ రాష్ట్రంలో ఉన్నందున ఫోన్‌ టాపింగ్‌పై సవ్నిక్ష జరపలేదన్నారు. ఫోన్‌ టాపింగ్‌ అంశం అధికారులు చూసుకుంటున్నారని, దానితో తనకు ఎలాంటి సంబంధం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హార్డ్‌ డిస్కులను ధ్వంసం చేశారని, అన్నింటిపై సీబీఐ విచారణ అడిగే కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌ రావులు ఫోన్‌ టాపింగ్‌పై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. తాను ఫోన్‌ ట్యాపింగ్‌ చేయించడం లేదని, అలాంటి పనులు చేయనని స్పష్టం చేశారు. బ్యాకప్‌ డేటాకు సంబంధించిన హార్డ్‌ డిస్కులు ఫామ్‌ హౌస్‌లో ఉన్నాయో..ఇంకా ఎక్కడ ఉన్నాయో విచారణ అధికారులు తేల్చాలని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ సమస్య, కోతలు లేవని, కొన్ని చోట్ల వర్షాల కారణంగా సదుపాయాలలో అవంతరాలు ఉన్నాయని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. పక్క రాష్ట్రంలో పోలీసు అధికారులందరినీ కూడా ఎన్నికల సమయంలో ట్రాన్సఫర్‌ చేశారని, తెలంగాణలో ఎలాంటి ట్రాన్సఫర్‌లు లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు. ప్రతిపక్షాలు ఎలాంటి ఆరోపణలు చేయకుండా, స్వేచ్ఛాయుత వాతావరణంలో రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించామన్నారు.

ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం చేశామని ప్రతిపక్షాలు సైతం ఆరోపణలు చేయలేదన్నారు. కాగా దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డి.. తెలంగాణ అవతరణ దినోత్సవం కార్యక్రమానికి హాజరుకావాలని కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీకి ఆహ్వానం పంపించారు. ఇక మేడిగడ్డపై జ్యుడిషీయల్‌ విచారణ నివేదిక తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. కేసీఆర్‌ అసెంబ్లీకి వొస్తే చాలా విషయాలు చర్చించేది ఉందని చెప్పారు. కాళేశ్వరం కరెంటు బిల్లులు అన్ని సముద్రంలో వదిలిన నీళ్లల్లాంటివని విమర్శించారు. 52 టీఎంసీల నీళ్లు సముద్రం పాలు అయ్యాయని చెప్పారు. తెలంగాణ ఆత్మ, ఉద్యమ స్ఫూర్తి, ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా రాష్ట్ర అధికారిక చిహ్నం తయారవుతుందన్నారు. అధికారిక చిహ్నంపై చిత్రకారులు రుద్ర రాజేశంతో సీఎం రేవంత్‌ రెడ్డి సోమవారం ఆయన నివాసంలో చర్చించారు. ఈ సందర్భంగా పలు నమూనాలను ఆయన పరిశీలించారు. తుది నమూనా ఎలా రావాలన్న అంశంపై సూచనలు  కూడా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *