‌తెలంగాణేతర పార్టీలకు ద్వారాలు తెరిచిన బిఆర్‌ఎస్‌

ఆం‌ధ్ర పార్టీలు ఇక్కడ అవసరమా అని ప్రశ్నించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌, ‌తన పార్టీని టిఆర్‌ఎస్‌ ‌నుండి బిఆర్‌ఎస్‌గా మార్చడంతో ఇప్పుడాయన తన మాటను కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిన్నటి వరకు కాళోజీ చెప్పినట్లు ప్రాంతేతరులు ద్రోహం చేస్తే, ప్రాంతం వరకు తరిమికొట్టాలె అన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సీమాంధ్ర నాయకుల పాలన అంతమయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో ఎక్కువకాలం పాలన చేసింది సీమాంద్ర తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఆ సమస్యను పరిష్కరించింది. ప్రాంతేతర పార్టీలు ఇక్కడికి రావడానికే వెరిచాయి.  గత ఎనిమిదేళ్ళుగా మన రాష్ట్రం, మన నిధులు, మన నియామకాలకు అవకాశం ఏర్పడింది. కాని, ఈ రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానని చెబుతూ వొచ్చిన టిఆర్‌ఎస్‌ ‌రెండవ సారి అధికారం చేపట్టి నాలుగేళ్ళు పూర్తి అవుతున్న దశలో జాతీయ రాజకీయాలను ప్రక్షాళన చేయాలన్న సంకల్పం చేసింది.

దేశంలో బిజెపి ప్రభుత్వం సుపరిపాలనను అందించలేక పోతున్నదన్న ఆరోపణతో బిజెపిని వ్యతిరేకించే పార్టీలన్నిటినీ కూడగట్టే దిశగా టిఆర్‌ఎస్‌ అధినేత అడుగులు వేస్తుంటే, అదేదో కొత్త కూటమి ఏర్పడుతుందనుకున్నారు. కాని, తెరాస పేరునే మార్చి భారత్‌ ‌రాష్ట్ర సమితిగా నామకరణం చేసారు. ఎప్పుడైతే జాతీయ పార్టీగా ప్రకటించారో మరోసారి సీమాంధ్ర పార్టీలకు ఆయనే పరోక్షంగా ద్వారాలు తెరిచినట్లైంది. ఇప్పుడు తెలంగాణలో కొత్త పార్టీలను ఏర్పాటు చేయడంలోనూ, గతంలో ఉన్న పార్టీలను పునరుద్ధరించడంలోనూ సంబధిత నాయకులు చెబుతున్న మాట ఒక్కటే. బిఆర్‌ఎస్‌కు ఎలాగైతే  అన్ని రాష్ట్రాల్లో విస్తరించాలన్న హక్కు ఉందో, అలాగే తమ పార్టీలకు కూడా ఉంటుందంటున్నాయి. మన ప్రజాస్వామ్య దేశంలో అలాంటి హక్కును మన రాజ్యాంగం మనకు కల్పించింది కూడా. ఎవరూ కాదని అభ్యంతరం పెట్టేందుకు వీలులేదు కూడా. కాని, ఆంధ్ర పార్టీలు తెలంగాణలో అవసరమా అన్న నాయకత్వం, ఇప్పుడెలా కాపలా కుక్కలా ఉంటుందన్నదే తెలంగాణ ప్రజల మధ్య నలుగుతున్న ప్రశ్న. రానున్న ఎన్నికల్లో ఒకటికి నాలుగు సీమాంధ్రకు చెందిన రాజకీయ పార్టీలు పోటీచేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.

ఒకరు నేను ఇక్కడే పుట్టానంటే, మరొకరు నా పార్టీయే ఇక్కడ పుట్టిందంటున్నారు. ఈ నాలుగు పార్టీల్లో కొన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ డైరెక్షన్‌లో పనిచేస్తున్నాయన్న ఆరోపణ కూడా ఉంది. ఇప్పుడప్పుడే ఈ విషయంలో నిర్ధారణకు వొచ్చే పరిస్థితిలేదు. కాని, బిజెపి చాలాకాలంగా తెలంగాణపైన కాషాయ జండాను ఎగురవేయాలన్న లక్ష్యంగా ఇక్కడ రాజకీయ వాతావరణాన్ని సృష్టిస్తున్నది. నిధుల విషయంలో నైతేనేమీ, ప్రాజెక్టుల ఏర్పాటు, పరిశ్రమలు నెలకొల్పడం, విభజన హామీలు నెరవేర్చడం, కేటాయింపులు తదితర విషయాల్లో నిత్యం కేంద్ర, రాష్ట్రాల మద్య వివాదం జరుగుతూనే ఉంది.  మునుగోడు లాంటి ఒక శాసనసభ స్థానంలో జరిగే ఉప ఎన్నికలో తమ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం ఈ రెండు పార్టీలు కోట్ల రూపాయలను ఎలా గుమ్మరించారో, ఎంత మంది పార్టీ శ్రేణులను దింపాయన్నది బహిరంగ రహస్యమే. రాజకీయంగా ఎవరికివారు తమది పై చెయ్యిగా ఉండేందుకు వేస్తున్న అనేక ఎత్తుగడల్లో భాగంగా ఆకర్ష్ ‌లాంటి పథకాలతో ఎదుటి పార్టీని బలహీన పర్చే కార్యక్రమాలు ఇంకా చేస్తున్నాయి. ఈ తగాదాలు ఉన్నత న్యాయస్థానాల వరకు చేరుకున్నాయి కూడా. అందులో భాగంగానే వైఎస్‌ఆర్‌టి పార్టీ వెనుక భారతీయ జనతాపార్టీ ఉందన్న చర్చ కూడా ఒకటి.

ఆ పార్టీ అధినేత్రి వైఎస్‌ ‌షర్మిల ఇటీవల గవర్నర్‌ను కలవటం, సాక్షాత్తు ప్రధాని ఫోన్‌ ‌చేయడం లాంటి సంఘటనలను ఎత్తి చూపుతూ షర్మిల బిజెపి విడిచిన బాణమేనని బిఆర్‌ఎస్‌ ‌నేతలు ఆరోపిస్తున్న విషయం తెలియంది కాదు. బిజెపికి సహకరించడానికే  తాజాగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు మరోసారి తన పార్టీని తెలంగాణలో విస్తృతించే కార్యక్రమానికి శ్రీకారం చుట్డాడని కూడా బిఆర్‌ఎస్‌ ‌నేతలు ఆరోపిస్తున్నారు. నిన్నగాక మొన్న ఖమ్మంలో ఏర్పాటు చేసిన బ్రహ్మాండమైన బహిరంగ సభ ఒక విధంగా విజయవంతమైందనే చెప్పాలె. తెలంగాణలో ఆంధ్ర పార్టీ అవసరమా అని కెసిఆర్‌ అన్నట్లుగానే తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక విధంగా కనుమరగైందనే చెప్పాలె. ఆ పార్టీలోని ముఖ్యనాయకులంతా తమ రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని వివిధ రాజకీయ పార్టీల్లో చేరిపోయారు.

ఈ సభ సందర్భంగా వారందరు తిరిగి తమ పార్టీలోకి రావాల్సిందిగా చంద్రబాబు నాయుడు వారిని ఆహ్వానించాడు. అంతో ఇంతో ఇంకా తెలుగుదేశం పార్టీ వాసనలున్న వారిని పునరేకం చేయడం ద్వారా తెలంగాణలో తమపార్టీకి బలముందని చూపించుకోవడం ద్వారా బిజెపికి దగ్గరవ్వాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉందని బిఆర్‌ఎస్‌ ‌విమర్శిస్తుంది. బిఆర్‌ఎస్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తున్న బిజెపికి టిడిపి మద్దతు ఇక్కడ తీసుకున్న పక్షంలో ఏపిలో జరిగే ఎన్నికల్లో కూడా టిడిపికి బిజెపి మద్దతు లభిస్తుందన్నది బాబు ఆలోచనగా వారు పేర్కొంటున్నారు. మొత్తానికి  కాపలా కుక్కలాగా ఉంటుందనుకున్న పార్టీయే మరోసారి ఈ పార్టీలకు రంగప్రవేశం కల్పిస్తున్న దశలో రాష్ట్రం మళ్ళీ ఎవరి చేతికి పోతుందోనని తెలంగాణ ప్రజలు చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *