తెలంగాణ రాష్ట్రంలో మిగతా శాఖలలో పదోన్నతి కల్పిస్తూ విద్యాశాఖలోని ఉపాధ్యాయుల విషయానికి వచ్చేసరికి వివాదాస్పద అంశాలను ముందుకు తేవటం,పదోన్నతులు ఇవ్వకపోవడం భావ్యం కాదు. ముప్పై సంవత్సరాల సర్వీసులో ఒక్క ప్రమోషన్ పొందని, ఒకే క్యాడర్‌లో అర్హతలు, ఖాళీలు ఉండీ ప్రమోషన్స్ పొందలేకపోతున్న ఉపాధ్యాయుల మనోభావాలను ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి.
తెలంగాణ రాష్ట్రంలో అసంతృప్తికి గురవుతున్న ఒక ప్రధాన వర్గం ఉపాధ్యాయ వర్గం. రాష్ట్రం ఆవిర్భవించగానే పదోన్నతుల పండుగేనని ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ రూపకల్పనకు రెండు రోజులు చాలని ఆయన అన్నారు. పదవీ విరమణ నాడు ప్రభుత్వ వాహనంలో ఉద్యోగిని ఇంటి వద్ద దింపి అతనికి అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలన్నీ అందే విధంగా ఉండాలనీ, వేరువేరు ప్రాంతాల్లో పని చేస్తున్న భార్యాభర్తలైన ఉద్యోగ ఉపాధ్యాయులను ఒకే దగ్గరికు తీసుకురావాలని,పదోన్నతులు కల్పిస్తామని,ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి ఉద్యోగులలో ఆశలు రేకెత్తించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 మే 16న వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి 18 అంశాల విషయంలో హామీలు ఇచ్చారు. అయితే ఈ హామీలు హామీలుగానే ఉండిపోయాయి. అసెంబ్లీలో ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని పలుమార్లు హామి ఇచ్చారు.సమస్యలను పరిష్కరించటం అటుంచి, వాటిని కనీసం ఆలకించటం లేదనే అసంతృప్తి ఉపాధ్యాయ వర్గంలో నెలకొన్నది.ప్రమోషన్ల విషయంలో తీవ్ర జాప్యం జరగడం ఉపాధ్యాయ వర్గాల్లో అసంతృప్తికి దారితీస్తున్నవి.
ముఖ్యంగా ఉపాధ్యాయవర్గంలో అసంతృప్తికి ప్రధాన కారణం 2015 జులై నుంచి అంటే దాదాపుగా ‘ఏడు సంవత్సరాల నుంచి’ పదోన్నతులు లేకపోవడం. వీటి విషయంలో మిగతా ఉద్యోగులతో పోల్చితే ఉపాధ్యాయవర్గం కాస్త ఆలస్యంగా ప్రయోజనం పొందడం ఆనవాయితీగా ఉంది. దీనికి తోడుగా అర్హతలు, అవకాశాలు ఉండి కూడా ఏడు సంవత్సరాలుగా పదోన్నతులు లేకపోవడంతో వారిలో తీవ్ర నిరాశ, నిర్లిప్తతలు నెలకొన్నాయి.
2009 జనవరి 26 నాటి జీఓ. నెం. 15 ద్వారా నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1 మొదలు తరువాతి సంవత్సరం ఆగస్టు 31 వరకు ఉన్న ఖాళీలకు సంబంధించి ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చే వీలు కల్పించింది. 2010 నవంబర్ 20 నాటి జీవో నెం. 67 ద్వారా ఉపాధ్యాయుల పదోన్నతులు ఏ నెల ఖాళీలకు తదుపరి నెలలో పదోన్నతులు కల్పించే విధంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జీవో నెం. 67 ను రద్దుచేస్తూ, జీవో నెం. 15 ప్రకారం ప్రతి సెప్టెంబర్ 1 నుంచి తరువాత సంవత్సరం ఆగస్తు 31 వరకు ఏర్పడిన ఖాళీలను, పదోన్నతుల ద్వారా భర్తీ చేసే విధంగా ప్రభుత్వం 2016 సెప్టెంబర్ 12న జీవో నెం. 32 జారీ చేసింది. అయినప్పటికీ గతఏడు సంవత్సరాలుగా టీచర్ల ప్రమోషన్లు లేకపోవడంతో అటు టీచర్లకే కాక, విద్యావ్యవస్థకు కూడా తీవ్ర నష్టం జరుగుతోంది. కోర్టు కేసుల పేరుతో ప్రమోషన్లకు సంవత్సరాల తరబడి వాయిదా వేయడం శ్రేయస్కరం కాదు. సంవత్సరాల తరబడి సర్వీస్ చేసి అర్హతలు, ఖాళీలు ఉండి కూడా ప్రమోషన్స్ పొందలేకపోతున్న ఉపాధ్యాయుల మనోభావాలను ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి.
పిన్నింటి బాలాజీ రావు
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టిపియూఎస్)
వరంగల్ జిల్లా అధ్యక్షులు




