- పేద సామాన్య కర్షకులు రైతులు కార్మికుల పార్టీ కాంగ్రెస్
- దేశవ్యాప్తంగా ఒకటే జిఎస్టి అమలు చేస్తాం
- ప్రేమ ఉత్సాహంతో శక్తివంతంగా జోడో యాత్ర కొనసాగుతుంది
- టిఆర్‌ఎస్, బిజెపిలు ఒకటే ప్రజలను మోసం చేస్తున్నారు
- నోట్ల రద్దుతోనే నిరుద్యోగ సమస్య మరింత పెరిగింది
- ధరణి పోర్టల్‌తో కేసీఆర్ భూమాయ చేస్తున్నారు
తెలంగాణ రాష్ట్రంలో రాజరికపు నియంత పాలన సిఎం కేసీఆర్ కొనసాగిస్తున్నారని టిఆర్‌ఎస్, బిజెపి పార్టీలు రెండు కలిసి ప్రజలను మాయమాటలతో మభ్యపెడుతూ మోసం చేస్తున్నారని, నోట్ల రద్దుతోనే నిరుద్యోగ సమస్య పెరిగిందని ఆర్‌ఎస్‌ఎస్ బిజెపిలు కుట్రపూరితంగా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ భారత్ యాత చేపట్టి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నామని కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ ఉద్ఘాటన చేశారు. శుక్రవారం భారత్ జోడో యాత్రలో భాగంగా మహబూబ్‌నగర్ పట్టణ శివారులోని మన్నెంకొండ దేవస్థానం స్టేజి వద్ద రాహుల్ గాంధీ ప్రసంగించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను నిలువునా నట్టేట ముంచుతున్నారని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ ద్వారా పేదవారి భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని, ఎన్నికల సమయంలో టిఆర్‌ఎస్ బిజెపి పార్టీలు వేరువేరు అని ప్రజలకు పగటి వేషాలు చూపించి ఎన్నికల తర్వాత ఆ రెండు పార్టీలు కలిసి ప్రజలను నిలువునా మంచుతున్నారన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా వారి కుట్రలను కుతంత్రాలను ఎదుర్కుంటూ ప్రజలందరినీ మమేకం చేసుకుంటూ యాత్ర కొనసాగిస్తున్నామని ఈ యాత్రకు అన్ని వర్గాల వారు అన్ని మతాలవారు కలిసిమెలిసి యాత్రలో ఉత్సాహంతో ప్రేమతో కొనసాగుతుందన్నారు.
ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలతో మాట్లాడుతున్నామని ప్రతిరోజు 6, 7గంటల సమయాన్ని సమస్యలపై కేటాయిస్తూ వింటున్నామన్నారు. కేవలం 15 నిమిషాలు మాత్రం ప్రసంగం చేస్తున్నామన్నారు. ప్రజలు ఈ విషయాలను గమనించాలన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ బిజెపి ద్వేశాన్ని, హింసను ప్రేరేపిస్తూ చట్టసభలలో వారు చెప్పిందే సమర్థనీయమని టిఆర్‌ఎస్ పార్టీ అందుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారన్నారు. రెండు చట్టసభలలో ఆమోదానికి టిఆర్‌ఎస్ సహకరిస్తున్నారని ప్రజలు గమనించాలన్నారు. నిరుద్యోగ సమస్య పెరుగుతూ ఉన్నా కానీ ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడంలేదని ఎద్దేవా చేశారు. కొంతమంది యువతతో మాట్లాడితే కొందరు ఐఏఎస్, ఐపీఎస్, ఆర్మీ, సివిల్ ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్ లుగా అవుతామని చెబుతున్నారు. విద్యార్థుల కోసం ప్రభుత్వాలు లక్షల రూపాయలు వెచ్చించి శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తున్నామని కేవలం మాటలకే పరిమితం చేస్తూ డబ్బులు దండుకుంటున్నారన్నారు. రేపటి భవిష్యత్తులో యువత ప్రశ్నార్థకంగా నిల్వనుందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్ పేరుతో వేల ఎకరాల పేదల భూమిని భూ బకాసురుల్లాగా మింగేస్తున్నారని, ప్రతిరోజు ధరణి పోర్టల్ రిపోర్ట్ కేసీఆర్ ముందు అధికారులు ప్రవేశపెడతారని, ఆ పోర్టల్ ద్వారా భూమి క్రయవిక్రయాలు ఎంత మేర జరిగాయని ముఖ్యమంత్రి చూస్తారని, అనంతరం తాము లాక్కున్న భూమిలో ఎన్ని ఉన్నాయని ఆ రిపోర్ట్‌లో పరిశీలన చేసుకుంటారని, దళితుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 25 లక్షల దళితులకు భూమిని కేటాయిస్తే ఆ భూమిని దళితులను వద్ద నుండి టిఆర్‌ఎస్ సీఎం కేసీఆర్ రద్దుచేసి లాక్కునేందుకు ప్రణాళికలు రచించారన్నారు. అటవీ హక్కుల చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 100 శాతం అమలు చేస్తామని, పేద రైతుల వద్ద నుండి భూమి లాక్కుంటున్న అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎదిరించడం జరుగుతుందన్నారు. నోట్ల రద్దు ద్వారా నిరుద్యోగంతో పాటు చిన్న చిన్న వ్యాపారస్తులకు మధ్యతర వారికి నష్టం వాటిలిందని తెలిపారు. భారతదేశం మొత్తం ఒకే జీఎస్టీ విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక చేస్తామన్నారు. అలాగే రైతుల కోసం గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పక్రియ చేపట్టి చేసిందని భవిష్యత్తులోనూ మళ్లీ రైతులకు పూర్తి రుణమాఫీని ఒకే దఫాలో చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద వర్గాలు రైతులు కార్మికులు కర్షకుల పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు పేదవారి కోసమే కట్టుబడి ఉంటుందన్నారు. జోడయాత్ర కాశ్మీర్ వరకు శక్తివంతంగా విరామం లేకుండా కొనసాగుతుందని, ఈ యాత్రకు సహకరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.



