- 225 కోట్లతో టిసిఎల్ గ్లోబల్ యూనిట్ ఏర్పాటు
- మంత్రి కెటిఆర్ ట్వీట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 28 : తెలంగాణలో మరో పెద్ద కంపెనీ పెట్టుబడి పెట్టబోతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ అయిన టిసిఎల్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వొచ్చింది. ముందుగా రూ.225 కోట్ల పెట్టుబడితో తన యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నది. దాంతో రాష్ట్రంలో 500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభ్యంకానున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ అయిన టిసిఎల్ తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానిస్తుండటం నాకు చాలా సంతోషంగా ఉంది.
ఈ కంపెనీ ఏర్పాటు చేయబోతున్న నూతన ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లో వాషింగ్ మెషిన్లను ఉత్పత్తి చేయనున్నారు. భవిష్యత్తులో రిఫ్రిజిరేటర్లను కూడా ఉత్పత్తి చేసే ప్రణాళికతో కంపెనీ ఉన్నది’ అని మంత్రి ట్విటర్లో పేర్కొన్నారు. ‘ముందుగా సంస్థ రూ.225 కోట్లతో యూనిట్‌ను ప్రారంభించనుంది. దాంతో రాష్ట్రంలోని 500 మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. భవిష్యత్తులో కంపెనీని మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయి. కంపెనీతో కలిసి జాయింట్ వెంచర్ ప్రారంభించనున్న రెసోజెట్ సంస్థకు అభినందనలు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.




