- సమస్యలపై ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి కెసిఆర్ కు నచ్చదు
- సోషల్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్ ఆకునూరి మురళి
- విద్యా వ్యవస్థ ఎలా ఉండాలనే అంశంపై రౌండ్ టేబుల్
- హాజరైన మేధావులు, విద్యావంతులు, సామాజికవేత్తలు
ఖైరతాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సహా రాష్ట్రంలోని బిఆర్‌ఎస్ సర్కార్ పేదలకు నాణ్యమైన విద్యను అందించడం లేదని సోషల్ డెమోక్రటిక్ ఫోరం(ఎస్‌డిఎఫ్) కన్వీనర్, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఆకునూరి మురళి ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎవరైనా సమస్యలపై ప్రశ్నిస్తే నచ్చదని విమర్శించారు. ఈ మేరకు శనివారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో సోషల్ డెమొక్రటిక్ ఫోరం ఆధ్వర్యంలో ‘తెలంగాణలో విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యా వ్యవస్థ ఎలా ఉండాలనే విషయాలపై రూపొందించిన సావనీరు(ప్రత్యేక సంచిక)ను పలువురు వక్తలతో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన ఆకునూరి మురళి ఆవిష్కరించారు. విద్యను ప్రపంచ స్థాయి నాణ్యతతో ఎంత చక్కగా సులభంగా ఇవ్వవచ్చో పలువురు వక్తలు వివరించారు.
అనంతరం ఆకునూరి మురళి మాట్లాడుతూ తెలంగాణ విద్యా సంస్థలకు కేంద్రం బడ్జెట్లో కేవలం 2.5 శాతం మాత్రమే కేటాయిస్తున్నారని అన్నారు. విద్యా రంగంలో ఖాళీలు భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని, 11 యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు నిలిచి పోయాయన్నారు. 3,179 పోస్టులకు గానూ 818 ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులు మాత్రమే భర్తీ చేశారని చెప్పారు. మిగిలిన 74 శాతం ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యా నాణ్యతలో రాష్ట్రం దేశంలోనే చివరి నుంచి రెండో స్థానంలో ఉందన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న విద్యా హక్కు చట్టాన్ని మొక్క బడిగా అమలు చేస్తున్నారన్నారు. 60 శాతం పర్సంటేజీతో పదో తరగతి పాస్ అవుతున్న విద్యార్థులు ఇంటర్ వరకు వచ్చే సరికి మొత్తానికి నైపుణ్యం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణకు 15 శాతం బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్యావ్యవస్థను బాగు చేయాల్సిన బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవాలని కోరారు. బాలల హక్కుల కమిషన్ మాజీ ఛైర్మన్, ఎస్.డి.ఎఫ్ సలహాదారు ప్రొఫెసర్ శాంత సిన్హా మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా రంగానికి నిధులు పెంచాలన్న ఆవశ్యకతను వివరించారు. ఎస్.డి.ఎఫ్ సలహాదారు ప్రొఫెసర్ కె.మురళీ మనోహర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంపై తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని మండిపడ్డారు. ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్ట్ విఠల్, విద్యా వేత్తలు, సామాజిక వేత్తలు తదితరులు పాల్గొన్నారు.



