హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 01 : తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో తొలిసారిగా పోటీ చేస్తున్నామని రాష్ట్రీయ మరాఠా పార్టీ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అంకుష్ శివాజీరావ్ పాటిల్ మాట్లాడుతూ నాంపల్లి నియోజక వర్గం నుంచి శివాజీరావ్ బెల్కోని, గోషామహాల్ నుంచి నందకుమార్ తాంబేలే పోటి చేస్తారని, ఈ నెల 8వ తేదీన మొత్తం అభ్యర్థుల పేర్లును ప్రకటిస్తామన్నారు. మరాఠాలు కొన్ని నియోజక వర్గాల్లో అభ్యర్థుల గెలుపు ఓటమిలను నిర్ణయించే స్థాయిలో ఉన్నారని తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఉచితంగా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర అందిస్తామని, రాష్ట్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎకనామిక్ పాత్స్ డెవలఫ్ మెంట్ కార్పోరేషన్ ఏర్పాటు చేసి, విద్యావంతులైన నిరుద్యోగ యువతకు రూ.5 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని, గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలైన నీరు, రోడ్లు, విద్యుత్ వంటి తదితర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. నవజాత శిశువుల సంక్షేమానికి భరోసా ఇచ్చేలా ఆస్పత్రిలు, వైద్య సౌకర్యాలు కల్పిస్తామని, వారికి 18 సంవత్సరాలు వచ్చే నాటికి రూ.5 లక్షలు వచ్చేలా బ్యాంకుల్లో డబ్బులు జమ చేస్తామని, మరాఠీ మాట్లాడే వారి కోసం ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యాలయాలు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు సూర్యకాంత్ సయాద్రి మహారాజ్, అమర్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ‘మరాఠా పార్టీ’ పోటీ



