తెలంగాణకు అన్యాయం జరిగితే పులిలా గర్జిస్తా…

మన హక్కుల సాధన కోసం సద్ది కట్టుకుని తరలిరావాలి 

అధికారం ఉన్నా..లేకున్నా రాష్ట్రం కోసం పోరాటం ఆగదు
5 జిల్లాల నీళ్ల గోసను వినిపించేందుకు కుంటుతూ వొచ్చా….

కేసీఆర్‌ను చంపితే ప్రజలు ఉరుకుంటారా…
కాంగ్రెపోళ్లు బలాదూర్‌గా తిరిగితే నిలదీస్తాం…
మేడిగడ్డలో 250 పిల్లర్లు, 200 కి.మీ టన్నెల్స్‌, 1500 కిమీ కాల్వలు, 19 సబ్‌ స్టేషన్‌లు, 20 రిజర్వాయర్లు
వోటమి తర్వాత నల్లగొండలో తొలి బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌
 
image.png

image.png

image.png

నల్గొండ(మిర్యాలగూడ), ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : కృష్ణా నది జలాలలో తెలంగాణకు రావల్సిన నీటి వాటా సంపూర్ణంగా వొచ్చే వరకు బిఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని, అన్యాయం జరిగితే పులిలా గర్జిస్తానని, రాష్ట్రానికి సంబంధించి ఏ విషయంలోనైనా  గొంతు లో ప్రాణం ఉన్నంత వరకు అన్యాయం జరగనివ్వనని, కాంగ్రెస్‌ ప్రభుత్వం కృష్ణా నది జాలాలను పక్క రాష్ట్రానికి అప్పజెప్పడం సిగ్గుమాలిన చర్య అని బిఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమం త్రి కేసీఆర్‌ అన్నారు. మంగళవారం కృష్ణనదీ జలాలలో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఛలో నల్లగొండ కార్యక్రమంలో భాగంగా నల్లగొండ బైపాస్‌ రోడ్డు వెంబడి భారీ భహిరంగ సభను నిర్వహించారు. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, సూర్యాపేట, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని బిఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున హజరయ్యారు. అయితే సభకు వొస్తున్న నాయకులకు పెద్ద ఎత్తున నిరసన సెగ  తగిలింది. ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తలు, ఆందోళనకారులు వారికి అడ్డు తగిలి సభా ప్రాంగణానికి వెళ్ళనీయకుండా నిరసన చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ భారీ బహిరంగ సభకు ముఖ్య అతిధిగా విచ్చేసిన బిఆర్‌ఎస్‌పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ.. తన కాలు విరిగినా, కుంటి నడకన, ఆయాసంతో జరిగిన..జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల ముందుకు ఉంచేందుకు వొచ్చానని, ఇది ఉద్యమ పోరాట సభయే కానీ రాజకీయ సభ కాదన్నారు. గత 24ఏండ్ల నుండి పక్షి లాగా తిరుగుతూ నీళ్ళ కోసం కొట్లాడుతూ వొస్తున్నానన్నారు. నల్లగొండలో మన బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాకముందు ఫ్లోరైడ్‌ సమస్యతో బాధపడుతూ నడుములు ఒంగి పోయిన వారిని ఎత్తుకుని డిల్లీకి పోయి ప్రధాన మంత్రి టేబుల్‌పై పడుకోబెట్టి ఉధ్యమాలు చేశామని ఆ నాటి ఉద్యమ ఫలితంగా ఏర్పడిన తెలంగాణ వొచ్చినాంక ఫ్లోరైడ్‌ సమస్య లేకుండా చేసి. మిషన్‌ భగీరథ నీళ్లు తీసుకు వొచ్చి  ప్రజల బాధలను పోగొట్టినామన్నారు. కొంతమంది సన్నాసులకు తెలియక పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని, మన నీటిని మనం కాపాడుకోలేకపోతే ఆగమై పోతామన్నారు. తెలంగాణలో మన నీటి వాటా మనకివ్వాలని కేంద్రానికి హెచ్చరిక చేస్తూ 5 జిల్లాల ప్రజలు పడుతున్న గోసను వెళ్లబుచ్చేందుకే ఈ నల్లగొండ సభ పెట్టామని, మీ అందరి దీవెనలతో ఈ తెలంగాణ గడ్డను పదిఏండ్లు పరిపాలించానని నిమిషం పాటు కరెంటు పోకుండా చూశానని, ప్రతి ఇంట్లో  నల్లా  పెట్టించి నీళ్లు ఇచ్చానని, లక్షల టన్నుల బత్తాయి పంటను పండిరచుకున్నామని, మిషన్‌ కాకతీయతో చెరువులు బాగుచేసుకున్నామని, రైతుబంధు వంటి పథకాలను ఇచ్చామని, ఇవన్నీ చేయాలంటే దమ్ము ఉండాలని ఇది నా సమస్య, ఇది నాకుటుంబం అనుకుంటే ఏదైనా సాధ్యం అన్నారు. ఆ రోజు రాష్ట్రం కోసం, జలసాధన కోసం కష్టపడ్డానని, కృష్ణా, గోదావరి నీళ్లతో బ్రహ్మాండంగా ప్రాజెక్ట్‌లు నిర్మించుకుంటూ ముందుకు పోయామన్నారు. ఢల్లీిలో మోడీ ప్రభుత్వానికి వందల కొద్దీ ఉత్తరాలు రాసి నీళ్ళ పంపిణీ చేయాలని మొరపెట్టుకున్నామని, అయినా న్యాయం జరగకపోతే సుప్రీం కోర్టుకు వెళ్ళామన్నారు. ఆ తర్వాత కేస్‌ వాపస్‌ తీసుకోండి, నీళ్లు ఇస్తాం అని కేంద్రం అంటే వెనక్కు తగ్గామన్నారు. తెలివిలేని నాయకులు ఉమ్మడి రాష్ట్రమే మంచిగా ఉండే అంటున్న తెలంగాణ ద్రోహులకు,  మరి ఎందుకు శ్రీకాంతాచారి ఆత్మత్యాగం చేసుకోవాలి, ఉధ్యమం ఎందుకు ముందుకు సాగిందో తెలియని సన్నాసులు మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. అసెంబ్లీలో హరీష్‌రావు నిలబెట్టి మాట్లాడితే నీళ్ళు నమిలిన మంత్రులు ప్రజల ముందే తేల్చుకునేందుకే నల్లగొండలో సభ పెట్టామని రానున్న రోజుల్లో  మన హక్కుల సాధన కోసం చేపట్టే ఉధ్యమాలకు సద్ది కట్టుకుని రావాలని పిలుపునిచ్చారు. పొద్దున లేస్తే కేసీఆర్‌ను తిడితే ఏమి వస్తదని అనుకుంటున్నారో తెలియదని, గెలుపోటములు ఏదీ శాశ్వతం కాదని ప్రజా సమస్యలను పక్కన పెట్టి అసెంబ్లీలో నోటికి వచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదన్నారు. అంతకు ముందు ఉన్న  ప్రభుత్వం కంటే మెరుగుగా పనిచేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం ఉండాలే కానీ , కేసీఆర్‌ ప్రభుత్వం పై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీలో జనరేటర్‌ పెట్టి మీటింగ్‌ పెట్టిన ఘనత ఈ ప్రభుత్వానికే ఉందన్నారు. రైతుబంధు అడిగిన వాడిని చెప్పుతో కొడతాం అంటున్నారని, నోటి దురుసుతో మాట్లాడే వారికి గట్టిగా హెచ్చరించి చెబుతున్న చేతనైతే అభివృద్ధి చేయండి, లేకుంటే దద్దమ్మలుగా దిగిపోండి పరిపాలన అంటే ఏమిటో మేం చూపిస్తామన్నారు. కేసీఆర్‌ను నల్లగొండలో దిగనీయము, తిరగనీయము అంటున్న వారికి కేసీఆర్‌ను చంపితే తెలంగాణ ప్రజలు ఊరుకుంటార, చంపుతారా, తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌నే మీరు తిరగనివ్వరా  చూద్దాం రండి అని హెచ్చరించారు.  ఖమ్మంలో సీతారామ ప్రాజెక్ట్‌, గురుకులాల పెంపు, మంచిగా కరెంట్‌ ఇవ్వడం, భగీరధ నీళ్లు ఇవ్వడం, పాలమూరు రంగారెడ్డి, డిరడి ప్రాజెక్ట్‌లు పూర్తి చేయాలే గానీ బలాదూర్‌గా తిరిగితే ఎండగడతామన్నారు. కేసీఆర్‌ను బదనామ్‌ చేసేందుకు మేడిగడ్డ పోతామంటున్న కాంగ్రెస్‌ వాళ్లకు బుద్ధి లేదని మేడిగడ్డలో 250 పిల్లర్లు ఉంటాయని, 200 కిలోమీటర్ల టర్నెలు ఉంటాయని, 1500 కిలోమీటర్ల మేర కాల్వలు ఉంటాయని, 19 సబ్‌ స్టేషన్‌లు, 20 రిజర్వాయర్లు ఉంటాయన్నారు. రెండు, మూడు పిల్లర్లు క్రుంగిపోయినంత మాత్రాన దాన్ని బూతద్దంలో చూడడం,  రాజకీయం చేయడం సిగ్గుమాలని చర్య అన్నారు. అంతకుముందు కట్టిన సాగర్‌ కానీ ఇతర ప్రాజెక్టులు గానీ క్రుంగిపోలేదా అని ప్రశ్నించారు. ఒకసారి ఓడిపోవచ్చు, మరో సారి గెలవవచ్చు ఏదీ శాశ్వతం కాదని అహంకారమదంతో మాట్లాడితే సహించబోనని మళ్ళీ డబుల్‌ స్పీడుతో అధికారంలోకి వస్తామన్నారు.  ప్రధాని నరేంధ్రమోడీ కరెంటు మీటర్లు పెట్టాలి అంటే నా తలకాయ పోయినాగానీ పెట్టనివ్వనని అన్న మాటలను గుర్తు చేశారు. 9ఏండ్లుగా నీళ్ల కోసం కొట్లాడుతూ వచ్చాం గానీ ఏ నాడు నీటి వాటాలను అప్పజెప్పలేదని దొంగచాటుగా కేంద్రంకు లొంగి సంతకాలు పెట్టారని, దొంగనాటకాలు మానుకుని అభివృద్ధి చేయాలని హితవు పలికారు. నీళ్ల వాటా కోసం బ్రిజేష్‌ ట్రిభ్యునల్‌కు 6నెలలోగా తేల్చండి అని కేంద్రం మీద ఒత్తిడి తేవాలని కోరారు. ప్రస్తుతం ఎలక్షన్‌లు లేవని రాజకీయం కోసం కాకుండా న్యాయమైన పోరాటం చేసేందుకు తెలంగాణ కోసం 15ఏండ్లు ముందుండి పోరాడిన మీ బిడ్డగా వచ్చానని, తెలంగాణాకు రావాల్సిన సంపూర్ణ వాటా వచ్చే వరకు బిఆర్‌ఎస్‌ పార్టీ కొట్లాడతామన్నారు. అంతకు ముందు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడారు. సభకు ముందు కళాకారుల బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన  ఆటపాటలు అలరించాయి.  బహిరంగ సభకు ఎలాంటి సమస్యలు రాకుండా, ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు గట్టి బంధోబస్తును చేపట్టారు.  ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ పార్టీ అధ్యక్షుడు కెటీఆర్‌, మాజీ మంత్రులు హరీష్‌రావు, జగదీశ్వర్‌రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్‌, శ్రీనివాసగౌడ్‌, గాదెరి కిషోర్‌, మిర్యాలగూడ మాజీ ఎమ్యెల్యే నల్లమోతు భాస్కర్‌రావు,  తిప్పన విజయసింహరెడ్డి, సత్యావతి రాథోడ్‌, మెహమూద్‌ ఆలీ, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, పల్లారాజేశ్వర్‌రెడ్డి, చిరుమర్రి లింగయ్య, అన్నభీమోజు నాగార్జునచారి, ప్రభాకర్‌రెడ్డి, నామిరెడ్డి యాదగిరిరెడ్డి,  రంగారెడ్డి, బిఆర్‌ఎస్‌వి విద్యార్ధి సంఘం నాయకులు షోయబ్‌, నాగరాజు, తదితరులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *