తిరుమలలో వైభవంగా కృత్తికా దీపోత్సవం

తిరుమల, డిసెంబర్‌ 8 : శ్రీ‌వారి అలయంలో కృత్తిక పౌర్ణమి దీపోత్సవం ఘనంగా జరిగింది.  పున్నమిని పురస్కరించుకుని సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు నివేదనలు పూర్తయిన తరువాత ఈ దీపోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై దీపాలను వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. ఇందులో భాగంగా సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 గంటల వరకు అత్యంత ఘనంగా జరిగిన ఈ పర్వ దీపోత్సవంలో తొలుత శ్రీ యోగ నరసింహస్వామి ఆలయం ప్రక్కనవున్న పరిమళం అర దగ్గర 100 కొత్త మూకుళ్ళలో నేతి వత్తులతో దీపాలను వెలిగించారు. తదుపరి వీటిని ఛత్రచామర, మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ ఆనందనిలయంలో శ్రీవారికి హారతి ఇచ్చారు.

అనంతరం గర్భాలయంలో అఖండం, కులశేఖరపడి, రాములవారిమేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణమండపం, సభఅర, తాళ్లపాకంఅర, భాష్యకారుల సన్నిధి, యోగనరసింహస్వామి, విష్వక్సేనులు, చందనంఅర, పరిమళంఅర, వెండివాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి సుమారుగా 100 నేతి జ్యోతులను మంగళ వాయిద్యల నడుమ వేదమంత్రోచ్ఛారణలతో ఏర్పాటు చేశారు.

తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని కృత్తికా దీపోత్సవం జరిగింది. సాయంత్రం 6 గంటలకు గర్భాలయంలో ఆ తరువాత శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయ గోపురం, శ్రీ కామాక్షి అమ్మ ఆలయ గోపురం, ధ్వజస్తంభంపైన దీపారాధన చేశారు. ఈ సందర్భంగా ఊంజల్‌ ‌మండపంలో ఆకట్టుకునేలా శివలింగం, శూలం ఆకృతిలో ప్రమిదలు వెలిగించారు. అనంతరం జ్వోలాతోరణం వెలిగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *