తిరుమల, డిసెంబర్ 23 : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 25 రోజుల పాటు జరుగనున్న అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు రంగనాయకుల మండపంలో అధ్యయనోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు నుంచి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని వివరించారు. ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను శ్రీవైష్ణవ జియ్యంగార్లు గోష్ఠిగానం చేస్తారని అన్నారు. ఆళ్వార్ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను 25 రోజుల పాటు పారాయణం చేస్తారని పేర్కొన్నారు. తొలి 11 రోజులను పగల్‌పత్తు అని, మిగిలిన 10 రోజులను రాపత్తు అని వ్యవహరిస్తారని తెలిపారు. 22వ రోజున కణ్ణినున్ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది, 24వ రోజున శ్రీవరాహస్వామివారి సాత్తుమొర, 25వ రోజున అధ్యయనోత్సవాలు పూర్తవుతాయని వివరించారు.
తొలిరోజు నిర్వహించిన అధ్యయనోత్సవాల్లో తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి తదితరులు పాల్గొన్నారు. మరోవైపు తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 30 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 63,145 మంది భక్తులు దర్శించుకోగా 22,411 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.39 కోట్లు వచ్చిందని తెలిపారు. సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ రామసుబ్రహ్మణ్యం దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి జస్టిస్‌కు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ ప్రసాదం, శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు.



