చిన్నకోడూరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 31: చిన్నకోడూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ నుండి మాచాపూర్ వెళ్లే రోడ్డులో వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతం. తహశీల్దార్ కార్యాలయంతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు,ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలు, కళాశాలకు ఈ రోడ్డు మార్గం ద్వారానే వెళ్ళాలి. తరుచూ రోడ్డుపై నిలుపుతున్న వాహనాలతో పాటు ఇదే అనువుగా తీసుకుని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రోడ్డుపై బండరాయి ఖని పాతడంతో వాహనదారులు ఈ రోడ్డుపై వెళ్లాలంటే జంకుతున్నారు. ద్విచక్ర వాహనాలు,ఆటోలతో పాటు పలు వాహనాలు రోడ్డుపై ఇష్టారీతిగా నిలుపడం వల్ల రోడ్డున వెళ్లే స్కూల్ బస్సులు, ఆర్టీసీ బస్సులు,కార్లతో పాటు పలు వాహనదారులకు,పాదచారులకు ఇబ్బందులు తప్పడం లేదు. అంబేద్కర్ సర్కిల్ నుంచి మాచాపూర్ రోడ్డులో హాటల్ ముందు అక్రమంగా పాతిన ఖని, మితిమీరిన వేగంతో వెళ్తున్న వాహనదారులతో రోడ్డు ప్రమాదకరంగా మారింది.రోడ్డు పక్కనే పాతిన ఖని విషయమై స్థానిక ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అక్రమంగా రోడ్డుపై పాతిన ఖని తొలగించి,అడ్డదిడ్డంగా నిలుపుతున్న వాహనాలను నియంత్రించి ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా చేయాలని వాహనదారులు కోరుతున్నారు.



