టీచర్ల మల్టీజోన్‌-2 ‌బదిలీలు, పదోన్నతులపై హైకోర్టు స్టే

  • 13 జిల్లాల్లో నిలిచిన బదిలీలు
  • టీచర్ల బదిలీల పక్రియలో మరోమారు గందరగోళం

హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 21(ఆర్‌ఎన్‌ఎ) : ‌తెలంగాణలో టీచర్ల బదిలీలు, పదోన్నతుల పక్రియకు అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు వివిధ కారణాలతో నిలిచిపోగా..తాజాగా మరోసారి బ్రేక్‌ ‌పడింది. మల్టీజోన్‌-2 ‌బదిలీలు, పదోన్నతులపై హైకోర్టు స్టే విధించింది. దీంతో ఈ జోన్‌ ‌పరిధిలోని 13 జిల్లాల్లో బదిలీలు నిలిచిపోయాయి. అయితే, మల్టీజోన్‌-1 ‌పరిధిలోని 20 జిల్లాల్లోని టీచర్ల బదిలీలు, పదోన్నతులు షెడ్యూల్‌ ‌ప్రకారమే కొనసాగుతాయి. ఇప్పటికే గెజిటెడ్‌ ‌హెచ్‌ఎం‌ల బదిలీలు ముగిశాయి. తాజాగా స్కూల్‌ అసిస్టెంట్లకు గెజిటెడ్‌ ‌హెచ్‌ఎం‌లుగా(జీహెచ్‌ఎం) ‌పదోన్నతులు కల్పించేందుకు సీనియార్టీ, తుది జాబితాలు, జీహెచ్‌ఎం ‌పోస్టుల ఖాళీల జాబితాను విద్యాశాఖ అధికారులు బుధవారం విడుదల చేశారు. ఈ జాబితాలపై అభ్యంతరాలు తెలియజేసేందుకు సెప్టెంబరు 21 వరకు అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా హైకోర్టు ఈ 13 జిల్లాల్లో బదిలీలు, పదోన్నతులపై స్టే విధించింది. రంగారెడ్డి జిల్లాలోని కొందరు టీచర్లు సీనియార్టీ జాబితాలపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ కోర్టునాశ్రయించగా…దీనిపై బుధవారం హైకోర్టులో విచారణ జరగ్గా, హైకోర్టు స్టే ఇచ్చింది.

ఈ 13 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి కొంతమంది టీచర్లు వచ్చినందున సీనియార్టీ జాబితాలను రూపొందించాలని హైకోర్టు విద్యాశాఖను ఆదేశించింది. ఈ కేసుపై అక్టోబర్‌ 10 ‌వరకు స్టే విధించింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులను సంప్రదించగా, మల్టీజోన్‌ -1‌లో బదిలీలు, పదోన్నతుల పక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకు మల్టీజోన్‌ -2 ‌పరిధిలోని 13 జిల్లాల్లో కొత్త సీనియార్టీ జాబితాలను సిద్ధం చేసి, వీలైనంత త్వరగా, కోర్టుకు సమర్పించి స్టేను వెకెట్‌ ‌చేయిస్తామని తెలిపారు. వారంలోపే ఈ పక్రియను ముగిస్తామని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఇక రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్‌ ‌దరఖాస్తు పక్రియ సెప్టెంబరు 20న ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబర్‌ 20‌లోగా నిర్ణీత ఫీజు చెల్లించి, అక్టోబరు 21లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబర్‌ 20 ‌నుంచి 30 వరకు కంప్యూటర్‌ ఆధారిత విధానంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించునున్నారు.

అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెకండరీ గ్రేడ్‌ ‌టీచర్‌ (ఎస్జీటీ) ఉద్యోగాలను డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(‌డీఎడ్‌) అభ్యర్థులతోనే భర్తీ చేయాలని నిర్ణయించింది. ఒకట్రెండు రోజుల్లోనే దీనికి సంబంధించిన జీవో విడుదలయ్యే అవకాశముంది. తాజా నిర్ణయంతో బీఈడీ అర్హత ఉన్న అభ్యర్థులు కేవలం స్కూల్‌ అసిస్టెంట్‌(ఎస్‌ఏ) ‌పోస్టులకు మాత్రమే పోటీపడాల్సి ఉంటుంది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ వారికి అర్హత కల్పిస్తూ 2018లో నేషనల్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ‌టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే రాజస్థాన్‌ ‌ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు వేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ప్రాథమిక పాఠశాలల్లోని టీచర్‌ ‌పోస్టులను డీఎడ్‌ అర్హత ఉన్న వారితోనే భర్తీ చేయాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు కాపీని ఎన్సీటీఈ తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ ‌చేసింది. సుప్రీమ్‌ ‌కోర్టు తీర్పు దేశమంతటా అమలు కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *