- రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు
- హర్షం వ్యక్తం చేస్తున్న ఉద్యోగ సంఘాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు సంబంధించి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశమై చర్చించారు. పరస్పర బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 2,558 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రయోజనం కలగనుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని జిల్లా, జోనల్, మల్టీ జోనల్ క్యాడర్ల ఉద్యోగుల పరస్పర బదిలీలకు ప్రభుత్వం అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు, ఒక జోన్ నుంచి మరో జోన్‌కు, ఒక మల్టీ జోన్ నుంచి మరో జోన్‌కు పరస్పర బదిలీలు కోరుకునే ఉద్యోగులు, అధికారుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే… ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పరస్పర బదిలీ కోరుకునేవారికి ఎలాంటి సీనియారిటీ రక్షణ ఉండదంటూ మొదట్లో జారీ చేసిన జీవో 21లో ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పరస్పర బదిలీలు కోరుకునేవారి సీనియారిటీని పరిరక్షించాలని సంఘాలు డిమాండ్ చేశాయి.
ఆ మేరకు జిల్లా క్యాడర్ పోస్టుల పరస్పర బదిలీలకు సీనియారిటీ రక్షణ కల్పిస్తూ మళ్లీ 402 జీవోను ప్రభుత్వం జారీ చేసింది. ఈ జీవోపై కొందరు ఉద్యోగులు కోర్టుకు వెళ్లారు. సీనియారిటీ రక్షణతో ఇతర జిల్లాల నుంచి వొచ్చే ఉద్యోగుల కారణంగా అప్పటికే ఆయా జిల్లాల్లో పని చేస్తున్న తమ సీనియారిటీలో తేడాలు వొస్తాయని, కొత్తగా వొచ్చేవారు తమకంటే సీనియర్లు అయ్యే అవకాశముందంటూ కోర్టును ఆశ్రయించారు. ఆ మేరకు కోర్టు 402 జీవోను సస్పెండ్ చేసింది. దాంతో పరస్పర బదిలీలు నిలిచిపోయాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




