తెలుగుదేశం పార్టీ తిరిగి రంగ ప్రవేశం చేయడం తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పుకు కారణమయింది. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో అధికారం కోల్పోయినప్పటి నుండి తెలంగాణ ఏర్పడిన ఈ ఎనిమిదేళ్ళలో టిడిపి ఇక్కడి ప్రజలకు దూరమవుతూ వొచ్చింది. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా దాదాపు మూడున్నర దశాబ్ధాల కింద ఎన్టీ రామారావు సారథ్యంలో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ, కేవలం తొమ్మిది నెలల కాలంలోనే అధికారాన్ని హస్తగతం చేసుకోవడం ద్వారా చరిత్రను సృష్టించింది. వాస్తవంగా ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో ఒక కొత్త తరాన్ని రాజకీయాలకు పరిచయం చేసిన ఘనత కూడా ఆ పార్టీకి దక్కుతుంది. ఎన్టీఆర్‌ను గద్దెదించడం, చంద్రబాబు ఏకచ్ఛత్రాధిపత్యంగా దశాబ్ధకాలం ఏలిన క్రమంలోనే తెలంగాణ మలివిడుత పోరాటం రూపుదిద్దుకున్న అనంతర పరిణామాలు టిడిపిని అధికారానికి దూరం చేశాయి. అటు కేంద్రంలో ఇటు ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాలు రాష్ట్రాన్ని విడగొట్టలేవన్న ధీమాగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చాలాకాలం తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించడం, వొత్తిడి పెరిగిన దశలో గోడమీది పిల్లిలాగా మాట్లాడటం కారణంగా టిడిపి తెలంగాణలో డామేజీ అయింది.
విడిపోయిన ఏపి కొత్తరాష్ట్రంలో మాత్రం అధికారాన్ని నిలబెట్టుకోగలిగాడు చంద్రబాబునాయుడు. ఆ తర్వాత క్రమంలో ఆ పార్టీకి చెందిన ఒక్కో నాయకుడు తమ రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్, బిజెపి, టిఆర్‌ఎస్ పార్టీల్లో చేరిపోయారు. అయినప్పటికీ తెలంగాణలో పార్టీని నిలబెట్టుకునేందుకు టిఆర్‌ఎస్ ప్రజానాయకులను కొనే క్రమంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడిన నేపథ్యంలో ఇక తెలంగాణ రాజకీయాల్లో తలదూర్చడం కష్టమని ఆయన తన పార్టీని ఏపి వరకే పరిమితం చేసుకున్నాడు. అక్కడ కూడా వైఎస్‌ఆర్‌పార్టీ ధాటికి తట్టుకోలేక మరుసటి ఎన్నికల్లో ఏపీలో కూడా అధికారం కోల్పోవాల్సివచ్చింది. ఇప్పుడు మరో సంవత్సర కాలంలో ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయి. అందుకు రెండు రాష్ట్రాల్లో కూడా అప్పుడే ఎన్నికల వేడి వాతావరణం చోటుచేసుకుంటుంది. ఈ పరిస్థితిలో ఏపితో పాటు తెలంగాణలో కూడా మరోసారి తమ సత్తా చూపించుకోవాలని టిడిపి ఉబలాటపడుతున్నది. గత ఎనిమిదేళ్ళుగా స్థబ్దతగా ఉన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీకి వెనుకబడిన వర్గాలకు చెందిన కాసాని జ్ఞానేశ్వర్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించి, పార్టీని ఇక్కడ పునర్ నిర్మించేందుకు చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నాడు.
అందులో భాగంగా మొట్టమొదటి భారీ బహిరంగ సభను ఖమ్మంలో ఏర్పాటు చేశారు. ఒక విధంగా ఈ సభ విజయవంతం అయిందనే చెప్పాలె. ఈ సభ ద్వారా చాలా చాకచక్యంగా ఆయన ప్రసంగించాడనే చెప్పాలె. చంద్రబాబునాయుడు మొదటి నుండి వల్లెవేసే అవు వ్యాసాన్ని మరోసారి ప్రజలకు సోదాహరణంగా ఇక్కడ వినిపించాడు. హైదరాబాద్‌ను బాగుచేసింది తానే అన్న విషయం దగ్గరనుండి, ఆయన ముఖ్యమంత్రిగా ఇక్కడ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలన్నిటినీ ఏకరువుపెడుతూ, ప్రజలేమైనా మరిచి పోయారేమో అన్నట్లుగా ప్రతీ మాటకు ఒకసారి ‘అవునా కాదా తమ్ముళ్ళూ’ అంటూ గుర్తుచేస్తూ వొచ్చాడు. ఆ పనులను చూపించి తమకు ఇక్కడ వోట్లు అడిగే హక్కు ఉందని అంటుంది టిడిపి. చంద్రబాబు నాయుడికి మొదటి నుండీ ఇక్కడున్న సెటిలర్స్‌పైన ప్రగాఢ నమ్మకం ఉంది. తెలంగాణ ఉద్యమ కాలంలో, ఆ తర్వాత రాష్ట్రం రెండుగా విడిపోయినప్పుడు ఆయన వారికేదో అన్యాయం జరుగబోతున్నదని తెగ ఆరాట పడిన విషయం తెలియందికాదు. వారిని కట్టుబట్టలతో వెళ్ళగొడుతారన్న అభద్రతా భావాన్ని వారిలో కలిగించే ప్రయత్నం చేశాడు. కాని, గడచిన ఎనిమిదేళ్ళుగా అలాంటి సంఘటన ఒక్కటంటే ఒక్కటి కూడా జరుగలేదు.
కాబట్టి ఖమ్మం ప్రసంగంలో ఆ మాట ఎత్తకుండా కేవలం తన కాలంలో చేసిన అభివృద్థి పనులను నెమరువేసుకునే ప్రయత్నం చేశాడు. అన్నిటి కన్నా ముఖ్యంగా ఇప్పుడు పూర్వపు తన క్యాడర్‌ను పునరేకీకరించుకోవాలన్న ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. అందుకే గత దశాబ్ధాకాలంగా ఏవో కారణాలతో వివిధ పార్టీల్లో చేరినవారినందరినీ తిరిగి టిడిపి గూటిలో చేరాలంటూ సభా ముఖంగా ఆహ్వానం పలుకడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీని కంతకూ ఇక్కడున్న అధికార పార్టీయే కారణమని తెలంగాణ అభిమానులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. గత ఎనిమిదేళ్ల పాలనా విషయం ఎలా ఉన్నా గతంలో టిఆర్‌ఎస్ చెప్పినట్లు తెలంగాణకు కాపలా కుక్కగానైనా ఉంటుందనుకుంటే ఇప్పుడు ఆ పార్టీ స్థానికతను వొదిలివేయడమే మరోసారి సీమాంధ్ర పార్టీల రంగప్రవేశానికి కారణమైందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రా పార్టీలు ఇక్కడెందుకు అనే అవకాశం ఇప్పుడు బిఆర్‌ఎస్‌గా మారిన టిఆర్‌ఎస్‌కు లేదని ఆ పార్టీలు వాదించడంలో తప్పేమీలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చి ఇతర పార్టీలకు కెసిఆర్ తలుపులు బార్లా తెరిచాడు. ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయకుండా బిఆర్‌ఎస్ జాతీయ పార్టీ కాలేదు. అలాంటప్పుడు తమను నిలదీసే హక్కు ఆ పార్టీకి లేదని ఆంధ్ర పార్టీలు చేస్తున్న వాదన.
ఇదిలా ఉంటే వొచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పరిస్థితేమిటన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఒకటికి నాలుగు సీమాంధ్ర నాయకత్వంలోని ప్రాంతీయ పార్టీలు ఇక్కడ ఎన్నికలకు రంగం సిద్దంచేసుకుంటున్నాయి. ఈ పార్టీలన్నీ బిజెపి కనుసన్నల్లో కొనసాగుతున్నాయన్న ప్రచారం కూడా ఉంది. తెలంగాణ బిజెపి ఎట్టి పరిస్థితిలో అధికారంలోకి వొస్తామంటుంది. అలాంటప్పుడు టిఆర్‌ఎస్ వోట్లను చీల్చి, బిజెపికి లాభం చేకూర్చే ఉద్దేశ్యంగానే టిడిపి ఇక్కడ అనూహ్యంగా రంగప్రవేశం చేసిందన్న చర్చ కూడా జరుగుతున్నది. ఏపిలో అధికారంలోకి వొచ్చేందుకు బిజెపితో సహకారం కావాలనుకుంటున్న టిడిపి ఇక్కడ బిజెపికి సహాయ పడడానికే రంగ ప్రవేశం చేస్తుందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. కాగా, కామ్రెడ్‌ల మద్దతుతో హ్యాట్రిక్ సాధిస్తామనుకుంటున్న బిఆర్‌ఎస్‌లో లెఫ్ట్‌పార్టీల కోసం ఎన్ని స్థానాలు వొదులుకోవాల్సి వొస్తుందోనన్న భయం ఇప్పటి నుండే పట్టుకుంది. దానికి తోడు దాదాపు ప్రతీ జిల్లాలో నాయకుల మధ్య ఆధిపత్య పోరుంది. ఇంచుమించుగా కాంగ్రెస్ పరిస్థితికూడా అలానే ఉంది. మరోపక్క బిజెపి బలమైన నాయకుడు ఏ పార్టీ నుంచి వొచ్చినా చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ పరిణామాలన్నీ తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పుకు కారణమవుతున్నాయి.




