పటిష్టపరిచేందుకు నిబద్ధత కలిగిన అధికారిని ఛైర్మన్‌గా నియమించే ఛాన్స్
రాజకీయాలకు దూరంగా సభ్యుల నియామకం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 11 : ఉద్యోగాల భర్తీకి ఇచ్చిన హావిూ మేరకు అధికారంలోకి వొచ్చాక ఆ దిశగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రధానంగా టిఎస్‌పిఎస్‌సిని ప్రక్షాళన చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. దీనిని పకడ్బందీ సంస్థగా తయారు చేసి, సమర్థులైన అధికారులను నియమించి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా నిరుద్యోగులకు భరోసా కల్పించే ప్రయత్నంలో సిఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే యూపిపిఎస్సీ ఛైర్మన్‌ను కలిసి అక్కడ అనుసరిస్తున్న విధానాలను సిఎం తెలుసుకున్నారు. అదే తరహాలో సర్వీస్ కమిషన్‌ను పునరుద్ధరించాలని చూస్తున్నారు. రిటైర్ట్ లేదా సర్వీసులో ఉన్న నిబద్ధత కలిగిన ఐఎఎస్ లేదా ఐపిఎస్‌ను ఛైర్మన్‌గా వేసి పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు.
సభ్యులను కూడ రాజకీయాలతో సంబంధం లేని వారిని, నిష్ణాతులను, అకడమిక్ అనుభవం ఉన్నవారిని వేసే ఆలోచనలో సిఎం ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో పరీక్ష పేపర్లు లీక్ కావడంతో కమిషన్ అభాసుపాలయ్యింది. ఐఎఎస్ అధికారి ఛైర్మన్‌గా ఉన్నా లాభం లేకుండా పోయింది. పేపర్ల లీకేజీల వ్యవహారంలో నాటి కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కలేదు. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం పోరాడుతున్నా పట్టించుకోలేదు. సరికాదా లక్షా 40వేల ఉద్యోగాలను భర్తీ చేశామని బుకాయిస్తూ వచ్చారు. ఎక్కడ, ఎప్పుడు, ఎలా భర్తీ చేశారన్నదానికి సమాధానం లేదు. అందుకే నిరుద్యోగులకు ఇచ్చిన హావిూ మేరకు ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. అధికారంలోకి వొచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కుంది. ఫిబ్రవరి లోనే ఉద్యోగాల నియామకాలు మొదలు పెడుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీంతో ఉద్యోగ నోటిఫికేషన్ కోసం లక్షలాది విద్యార్థులు ఎదురుచూస్తున్న పరిస్థితి.
టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామా ఆమోదంతో ఉద్యోగాల నియామకాలకు అడ్డంకులు తొలగిపోయాయి. అతి త్వరలో టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్, సభ్యులను సర్కార్ నియమించనుంది. పారదర్శకంగా బోర్డు ఉండేలా కసరత్తు చేపట్టారు. ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. టీఎస్పీఎస్సీ బోర్డులో చైర్మన్‌తో పాటు 10 మంది సభ్యులు ఉండనున్నారు. బోర్డులో ఉండాల్సిన నిపుణుల కోసం ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. సీఏం విదేశీ పర్యటన తర్వాత కొత్త బోర్డు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.





