న్యూ దిల్లీ, డిసెంబర్ 21 : చైనా తదితర దేశాల్లో మరోసారి కొరోనా విజృంభిస్తుంండగా ప్రపంచవ్యాప్తంగా మరోసారి పడగవిప్పే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ కారణంగా తమ రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి చెందే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తూ.. రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు ఎంపీలు డిసెంబర్ 20వ తేదీన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు లేఖ రాశారు. ఇటీవల యాత్రలో పాల్గొన్న హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ కొరోనా బారిన పడినట్లు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
యాత్రలో కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని, మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించాలని, వ్యాక్సిన్ వేసుకున్నవారినే యాత్రకు అనుమతించాలని కోరారు. ఈ లేఖపై స్పందించిన కేంద్ర మంత్రి..రాహుల్ గాంధీకి లేఖ రాశారు. జోడో యాత్రలో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, లేనిపక్షంలో దేశ ప్రయోజనాల దృష్ట్యా యాత్రను కొంతకాలం పాటు వాయిదా వేసుకోవాలని కోరారు. కాగా, రాహుల్ జోడో యాత్ర బుధవారం రాజస్థాన్ నుంచి హరియాణాకు చేరుకుంది.
దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభించనున్నట్లు ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తన భారత్ జోడో యాత్రను నిలిపివేసే విషయాన్ని పరిశీలించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్‌సుఖ్ మాండవీయ రాహుల్ గాంధీకి, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు ఈ మేరకు ఒక లేఖ రాశారు.



