హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 03 : బిజెపి హిమాయత్ నగర్ డివిజన్ కార్పోరేటర్ గడ్డం మహాలక్ష్మీరామన్ గౌడ్, ఆమె భర్త బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం రామన్ గౌడ్ శుక్రవారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఖైరతాబాద్ నియోజవర్గం అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి గత రెండు సంవత్సరాలుగా తమను మా నసికంగా, శారీరకంగా వేదింపులకు గురిచేశారని, చివరికి ఆయన అనుచరులు తమపై దాడులు, హత్యాప్రయత్నానికి పాల్పడ్డారని వారు కన్నీటి పర్యంతమైయ్యారు. శుక్రవారం నారాయణగూడలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తమకు జరిగిన అన్యాయాలను కేంద్ర, రాష్ట్రాల నాయకత్వాలకు విన్నవించుకున్న పట్టించుకోలేదని విమర్శించారు. కులాలు, బస్తీల పేర్లతో కార్యకర్తలను విడదీశారని, కక్షపూరితంగా తమపైన వ్యవహరించారని ఆరోపించారు. తాము గత 36 సంవత్సరాలుగా బిజెపిలో సేవలు అందిస్తున్నామని, కన్నతల్లిలాంటి పార్టీని విడటం చాలా బాధగా ఉన్నప్పటికి చింతల రామచంద్రారెడ్డి వల్లనే వీడక తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి దృష్టికి తమ సమస్యలను తీసుకువెళ్ళిన పట్టించుకోలేదని, బిజెపి పెద్దలను కలువనీయకుండా అడ్డుకున్నారని, నీతి నిజాయితీగా పనిచేస్తున్న తమకు పార్టీలో అన్యాయం జరిగిందని విచారం వ్యక్తం చేశారు. 75 ఎళ్ళ చింతలకు ఏ విధంగా పార్టీ అధిష్టాన వర్గం టిక్కెట్ కేటాయించిందని ప్రశ్నించారు. తమ కార్యకర్తల అభిప్రాయం మేరకు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని చెప్పారు. ప్రజలకు న్యాయం చేయాలంటే అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర మంత్రి కెటిఆర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ సమక్షంలో తమ అనుచరులతో చేరుతున్నామని వారు వివరించారు.
జేపీకి హిమాయత్‌నగర్ కార్పొరేటర్ రాజీనామా




