- గన్‌పార్క్ నుంచి అమరవీరుల స్థూపం వరకు ర్యాలీక బీఆర్‌ఎస్ నేత కర్నె ప్రభాకర్ వెల్లడి
- తెలంగాణ చిహ్నాల మార్పు తగదన్న మరో నేత దాసోజు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన కవాతు గుర్తుకు వొచ్చేలా ర్యాలీ జరుపుతామని బీఆర్‌ఎస్ నేత కర్నె ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా ర్యాలీ జూన్ 1వ తేదీన సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ నుంచి ప్రారంభమై తెలంగాణ అమరవీరుల స్తూపం గన్ పార్క్ వద్దకు చేరుకుంటుందని పేర్కొన్నారు. అక్కడ కేసీఆర్ అమరులకు నివాళులు అర్పించిన తర్వాత అక్కడి నుంచి సచివాలయం ముందు ఉన్న తెలంగాణ అమరుల చిహ్నం వరకు చేరుకుంటుందని తెలిపారు. ఈ ర్యాలీలో 1000 మంది కళాకారులతో పాటు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన అడ్వకేట్లు, డాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యమంలో పని చేసిన ఉద్యోగులు, మహిళలు అందరూ పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.
ఇదిలావుంటు ప్రజాపాలన అంటే పిల్లలాటగా ఉందా..అంటూ బీఆర్‌ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తానని అధికారం హస్తగతం చేసుకున్న రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌పై అక్కసుతో ప్రజాభ్యుదయానికి సంబంధం లేకుండా ప్రభుత్వ గుర్తులను మార్చి, తెలంగాణ చరిత్ర ఆనవాళ్లను తుడిచివేసే పనిలో పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్ర మార్చాలని అనుకోవడం రేవంత్ రెడ్డి అవివేకానికి, మూర?త్వానికి, మరుగుజ్జు మనస్తత్వానికి పరాకాష్ట అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ప్రభుత్వ గుర్తులను మార్చడం తుగ్లక్ చర్య అని దాసోజ్ శ్రవణ్ అన్నారు.
ఒకవేళ రేపో మాపో భవిష్యత్తులో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సి వస్తే.. ఆ తర్వాత వచ్చే ముఖ్యమంత్రి కొత్త లోగో తీసుకురావాలా? అని ప్రశ్నించారు. ఒకవేళ మార్చాల్సిన అవసరమే ఉంటే.. ముందుగా ప్రజలను ఒప్పించి మెప్పించాలని తెలిపారు. అంతేకాని.. సీఎం తన వంది మాగధుల సొంత నిర్ణయం కాకూడదని సూచించారు. అన్ని వర్గాల ప్రజల నిర్ణయం కావాలని.. కనీసం అసెంబ్లీలోనైనా చర్చ జరగాలని అన్నారు. ఏది పడితే అది చేయడానికి ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి రాజు కాదు అని అని కేవలం ప్రధాన సేవకుడు మాత్రమే అని తెలిపారు. ఆ పదవి కూడా శాశ్వతం కాదని చెప్పారు.





